శ్రీలంకలో తిండికి తిప్పలు:  కిలో పప్పు రూ.310

V6 Velugu Posted on Sep 15, 2021

  • నిత్యావసరాలను బ్లాక్​ చేసిన వ్యాపారులు.. భారీగా పెరిగిన ధరలు
  • కిలో చక్కెర రూ.230.. కిలో పప్పు రూ.310
  • సేంద్రియ సాగు ఎఫెక్ట్​తో సగానికి తగ్గిన దిగుబడులు
  • కరిగిన ఫారెక్స్​ నిల్వలు.. ఖర్చు తగ్గించుకునే చర్యలు
  • పప్పులు, చక్కెర, ఉల్లిగడ్డలు, నూనెలతో సహా 600 వస్తువుల దిగుమతిపై బ్యాన్​


శ్రీలంకలో ఆహార సంక్షోభం ముదురుతోంది. ‘అన్నమో రామచంద్రా’ అని మొరపెట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిపోను తిండిగింజలు దొరక్క.. దొరికిన కొన్నింటికీ డబ్బులు డబుల్​ పెట్టలేక లంకవాసులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దానికి కారణాలు.. మొదటిది విదేశీ పైసల నిల్వలు పడిపోవడం. రెండోది.. సేంద్రియ సాగును కంపల్సరీ చేయడం. మూడోది.. విదేశాల నుంచి తిండి గింజలను, పాల పొడులను, పప్పు ధాన్యాల దిగుమతులను నిషేధించడం. నాలుగోది.. ఏటికేడు అప్పుల కొండ పెరిగిపోతుండడం. ఇవన్నీ కలిసి శ్రీలంకలో తిండికి తిప్పలను తెచ్చిపెట్టేశాయి. బియ్యం, చక్కెర, పాలపొడి, పప్పులు, చిరుధాన్యాలు, తృణధాన్యాలకు కొరత భారీగా పెరిగింది. పప్పులు, చక్కెరల ధరలు రెట్టింపయ్యాయి. కొందరు వ్యాపారులు దానినే అదనుగా చేసుకుని తిండిపదార్థాలను బ్లాక్​ చేసేశారు. ఇంత జరుగుతున్నా తిండి సంక్షోభం ఏమీ లేదంటూనే.. గత నెల 30న దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించారు ఆ దేశాధ్యక్షుడు గోటబయా రాజపక్స. 
ఒక్కసారిగా సేంద్రియ సాగు అన్నరు
ప్రపంచం మొత్తం ఇప్పుడు మనం తింటున్నది విషపు తిండే. శ్రీలంక దాని నుంచి బయటపడాలనుకుంది. అనుకున్నదే తడవుగా సేంద్రియ వ్యవసాయాన్ని అమలు చేస్తామని ప్రకటించేసింది. విదేశాల నుంచి రసాయన ఎరువులు, పురుగుమందుల దిగుమతులను నిషేధించింది. అయితే, ఆ తొందరపాటు నిర్ణయమే కొంప ముంచిందని నిపుణులు చెప్తున్నారు. దేశంలో 90 శాతం మంది రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులతోనే పంటలు పండిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు ఉన్నట్టుండి సేంద్రియ సాగువైపు మళ్లడమంటే నష్టాలను కొని తెచ్చుకోవడమేనని హెచ్చరించారు. సేంద్రియ సాగు వల్ల పంట దిగుబడులు సగానికి సగం పడిపోయాయని అంపారా జిల్లా జాయింట్​ ఫార్మర్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​హెచ్​ సీ హేమకుమార చెప్పారు. మామూలుగా వరి పంట, టీ (తేయాకు), రబ్బర్​ తోటలకే అక్కడి రైతులు ఎక్కువగా పురుగుమందులు, రసాయన ఎరువులు వాడుతుంటారు. శ్రీలంక ఎగుమతుల ఆదాయంలో టీ పౌడర్​వాటానే 10 శాతం. ఇప్పుడు ఆర్గానిక్​ ఫార్మింగ్​ పుణ్యమా అని టీ పంట దిగుబడి 50 శాతానికి పడిపోయింది. వడ్లది దాదాపు అదే పరిస్థితి. సంప్రదాయ సాగును ఒక్కసారిగా సేంద్రియ సాగువైపుకు మళ్లించడమే ఇప్పుడు శ్రీలంకకు నష్టం చేసిందని జర్మనీలోని ఓన్హామ్​ యూనివర్సిటీ సెంటర్​ ఫర్​ ఆర్గానిక్​ ఫార్మింగ్​ ప్రొఫెసర్​ సబీన జికేలి అంటున్నారు. సేంద్రియ సాగుకు మారేందుకు కనీసం మూడేండ్ల సమయమైనా తీసుకోవాలని ఆమె సూచించారు.  
ప్రభుత్వ వాదన ఇదీ..
శ్రీలంక ప్రభుత్వం మాత్రం దేశంలో ఎలాంటి ఆహార సంక్షోభం లేదని అంటోంది. ఈ నెల 10వ తేదీన దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేసింది. సరిపోను ఆహార నిల్వలు ఉన్నాయని, టైంకు తగ్గట్టు వాటిని విడుదల చేస్తామని చెప్పింది. కొందరు వ్యాపారులు కావాలనే వాటిని బ్లాక్​ చేస్తూ ధరలు పెంచేస్తున్నారని, లేని కొరతను సృష్టిస్తున్నారని చెప్పింది. అంతేకాదు.. దేశ ఆర్థిక ప్రగతి చాలా బాగుందనీ వెల్లడించింది. 4.5% వృద్ధి నమోదవుతోందని, ద్రవ్యోల్బణం తక్కువగానే ఉందన్నది. అన్ని ఆహార పదార్థాలను అందుబాటులోకి తెస్తామని ప్రజలకు హామీ కూడా ఇచ్చింది. కొరత అనేదే రాకుండా చూస్తామని చెప్పింది. అయితే, ఆహారం అందని చాలా మందికి రాబిన్​ హుడ్​ ఆర్మీ శ్రీలంక, ద దావూదీ బోహ్రాస్​ అనే స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నాయి. పేదలకు ఆహారాన్ని అందిస్తున్నాయి.

విదేశీ పైసల నిల్వలు పడిపోయినయ్​
దేశంలో విదేశీ పైసల నిల్వలూ దారుణంగా పడిపోయాయి. 2019 నవంబర్​ లో ఫారెక్స్​ నిల్వలు 750 కోట్ల డాలర్లుండగా.. ఈ ఏడాది జులై నాటికి 280 కోట్ల డాలర్లకు తగ్గాయి. ఇటు అప్పులు 400 కోట్ల డాలర్లకు ఎగబాకా యి. దీంతో వచ్చే ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని అప్పులకే శ్రీలంక కడుతోంది.దీంతో ఫారెక్స్​ నిల్వలూ కరిగిపోతూ వచ్చా యి. అంచనా కన్నా ఎక్కువగా ఈ ఏడాది రెవెన్యూ లోటు రూ.1.6 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్థిక మంత్రి బాసిల్​ రాజపక్స వెల్లడించారు. దేశానికి ప్రధాన ఆదాయ వనరులు కస్టమ్స్​, ఎక్సైజ్​, ఇన్లాండ్​ రెవెన్యూనే అని, కరోనా కారణంగా వాటి నుంచి ఈ ఏడాది రిటర్నులు రాలేదని ఆయన చెప్పారు. 

600 వస్తువులపై నిషేధం
ఈ నెల నుంచే పప్పులు, పిండి పదార్థాలు, చీజ్​, బటర్​, చాక్లెట్లు, ఫోన్లు, ఫ్యాన్లు, టీవీలు, యాపిల్స్, సంత్రలు, ద్రాక్షలు, బీర్లు, వైన్స్​, పురుగుమందుల వంటి 600 వస్తువుల దిగుమతులపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన దేశంలో ఖర్చులను తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బెడిసికొట్టింది. ప్రతి నెలా 10 కోట్ల డాలర్ల విలువైన పప్పులు, చక్కెర, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, మసాలా దినుసులు, వంట నూనెల వంటి ప్రధాన ఆహార పదార్థాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే శ్రీలంక వంటి దేశానికి.. నిషేధం రోకలిపోటులా తయారైంది. ఇటు కరోనా కారణంగా రవాణా సౌకర్యాలూ ఇంకా మెరుగుపడకపోవడంతో.. స్థానికంగా ఫుడ్​ సప్లై చెయిన్​కు బ్రేకులు పడ్డాయి. దీంతో ఫుడ్​ ఐటెమ్స్​కు కొరత ఏర్పడింది. జనాలు షాపుల వద్ద సరుకుల కోసం క్యూలు కడుతున్నారు. గత నెల వరకు కిలో రూ.120 ఉన్న చక్కెర.. ఇప్పుడు ఏకంగా రూ.192కు పెరిగింది. కొన్ని చోట్లయితే రూ.230దాకా పలుకుతోంది. కిలో కందిపప్పు ఇదివరకు రూ.167 ఉండగా.. ఇప్పుడు రూ.310 అయింది. పాలపొడి ధర కూడా రెట్టింపైంది. కొరత ఏర్పడడంతో ఒక్కొక్కరికి 400 గ్రాములకు మించి ఇవ్వట్లేదు. దీంతో వృద్ధులు, పిల్లలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

Tagged increased, prices, srilanka, Merchants, Essentials,

Latest Videos

Subscribe Now

More News