తమిళనాడులో ఘనంగా ఎంజీఆర్ జయంతి

తమిళనాడులో ఘనంగా ఎంజీఆర్ జయంతి

తమిళనాడులో ప్రముఖ రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ జయంతి సందర్బంగా ఆయనకు నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఏఐఏడీఎంకే కో ఆర్డినేటర్ పన్నీరు సెల్వం, జాయింట్ కోఆర్డినేటర్ ఎడపాడి పళనిస్వామి పార్టీ కార్యాలయంలో ఎంజీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎంజీఆర్ 105వ జయంతి సందర్బంగా పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎంజీఆర్ తో పాటు.. పక్కనే ఉన్న మాజీ సీఎం జయలలిత విగ్రహాలకు కూడా పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. 

ఎంజీఆర్ పూర్తి పేరు... మరుతూర్ గోపాలన్ రామచంద్రన్. ఎంజీఆర్ శ్రీలంకలోని కేండీలో జన్మించారు. ఆయన ఓ మళయాళి కుటుంబంలో పుట్టారు. ఆయన రెండున్నరేళ్ల వయస్సులోనే తండ్రి చనిపోయారు. తండ్రి చనిపోయిన కొన్నిరోజలకే.. ఆయన సోదరి కూడా చనిపోయింది. దీంతో ఎంజీఆర్ తల్లి అతడ్ని తీసుకొని ఇండియా తిరిగి వచ్చింది. భారత్ లో కేరళలోని తమ బంధువుల ఇంటికి చేరింఇ. వారి సాయంతో కొడుకును స్కూల్ లో చేర్చింది ఎంజీఆర్  తల్లి. స్కూల్ లో ఉన్నప్పుటి నుంచే ఎంజీఆర్.. నటనవైపు ఆకర్షితులయ్యారు. స్కూల్ సమయంలో ఓ డ్రామా ట్రూప్ లో చేరారు. యాక్టింగ్,డాన్సింగ్,కత్తి తిప్పడం వంటివి నేర్చుకున్నారు. ఎంజీఆర్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయనకు పిల్లలు లేరు. 1936లో సతీ లీలావతి సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత అనేక హిట్ సినిమాల్లో నటించి హీరోగా ఎదిగారు.

ఎంజీఆర్  1953లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత డీఎంకే పార్టీలో చేరారు.   నటుడిగా తనకున్న అపారమైన ప్రజాదరణతో భారీ రాజకీయ బలం పెంపొందించడానికి ఉపయోగించాడు. తద్వారా డీఎంకెలో తన స్థానాన్ని వేగంగా పెంచుకుంటూ పోయాడు. అన్నాదురై మరణించాకా పార్టీ నాయకత్వం చేపట్టిన తన ఒకప్పటి స్నేహితుడు కరుణానిధితో ఎం.జి.ఆర్.కు రాజకీయ విరోధం ఏర్పడింది. 1972లో అన్నాదురై మరణించిన మూడేళ్ళకు డిఎంకెను విడిచిపెట్టి, తన సొంత పార్టీ- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట కళగం (ఎఐఎడిఎంకె) ను ఏర్పాటు చేశాడు. 

ఐదు సంవత్సరాల తరువాత, 1977 తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో ఎం.జి.ఆర్. తన నేతృత్వంలోని ఏఐఎడిఎంకె కూటమిని విజయం వైపుకు నడిపించాడు. అలా అతను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో భారతదేశంలో మొట్టమొదట ముఖ్యమంత్రి పదవి సాధించిన సినీ నటుడిగా చరిత్ర సృష్టించాడు. ఆయన నేతృత్వంలో ఏఐఏడిఎంకె 1980లోనూ, 1984లోనూ మరో రెండు పర్యాయాలు రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించింది. 1980లో కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని కూలదోసి రాష్ట్రపతి పాలన విధించిన ఆరు నెలలు మినహాయిస్తే, 1987లో మరణించేవరకూ తమిళనాడు ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగాడు.1988లో ఎంజిఆర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్న మరణానంతరం లభించింది.

 

ఇవి కూడా చదవండి: 

ఢిల్లీలో వెయ్యికి పైగా కేసులు వారివే

వ్యాక్సిన్ తీసుకోవాలని బలవంతం చేయం