భవిత స్కూళ్లలో మిడ్ డే మీల్స్ కు ప్లాన్

భవిత స్కూళ్లలో మిడ్ డే మీల్స్ కు ప్లాన్
  • విద్యాశాఖ ప్రిన్సిపల్ ​సెక్రటరీ యోగితారాణా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భవిత స్కూళ్లలో మిడ్​ డే మీల్స్​ను అమలు చేసేందుకు ప్లాన్​ చేస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ యోగితారాణా తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఆమె బుధవారం పర్యటించారు. కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్​లోని గవర్నమెంట్​ పాలిటెక్నిక్​ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కొత్తగూడెం పట్టణం రైటర్​ బస్తీలోని భవిత స్కూల్​ను సందర్శించారు. టాయిలెట్స్​గోడలపై కూడా ఆకట్టుకునే బొమ్మలు వేయాలని సూచించారు. స్కూల్​ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు.

 దివ్యాంగ స్టూడెంట్స్​తో పాటు వారి తల్లిదండ్రులతో ఆమె మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. భవిత స్కూళ్లపై సీఎం రేవంత్​ రెడ్డి స్పెషల్​ ఫోకస్​ పెట్టారని ఆమె తెలిపారు. ఈ స్కూళ్లకు పక్కా బిల్డింగ్స్, మౌలిక సదుపాయాల కోసం రూ. 15కోట్లు రిలీజ్​ చేశారన్నారు. ఈ పిల్లల కోసం స్పెషల్​గా సదరం క్యాంపులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భవిత స్కూళ్లలోచదివే 8, 9, 10వ తరగతి స్టూడెంట్స్​ కోసం పెద్ద అక్షరాలతో ప్రత్యేకంగా  రూపొందించిన బుక్స్​ను అందజేయనున్నట్టు తెలిపారు. 

స్కూళ్లలో కాంపౌండ్​ వాల్స్​నిర్మాణం కోసం ఉపాధి హామీ స్కీం కింద ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఇటుకల గురించి కలెక్టర్​ ఆమెకు వివరించగా, ఆమె ప్రశంసించారు. ఆమె వెంట డైరెక్టర్​ ఆఫ్​ స్కూల్​ ఎడ్యుకేషన్​ ఈ. నవీన్​ నికోలస్, అడల్ట్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ ఉషారాణి, ఆర్​జేడీ సత్యనారాయణరెడ్డి, జాయింట్​ డైరెక్టర్లు వెంకటనర్సమ్మ, మదన్​ మోహన్​, రాజీవ్​, ఐటీడీఏ పీవో రాహూల్, డీఈవో వెంకటేశ్వరాచారి, ఎంఈవో ప్రభుదయాల్, విద్యాశాఖ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. 

పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలరోల్ మోడల్ 

పాల్వంచ : అటానమస్ కళాశాలగా అవతరించిన పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రోల్ మోడల్ గా చూపాలని యోగితారాణా విద్యాశాఖ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేనకు సూచించారు.  ఈ కళాశాలను ఆమె సందర్శించి పలు సూచనలు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ పద్మ, ఉత్తమ లెక్చరర్ గా అవార్డు సాధించిన టి అరుణ కుమారి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జై మాధవి కృషిని ఆమె అభినందించారు.  

ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి

బూర్గంపహాడ్ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని యోగితా రాణా సూచించారు. బుధవారం రాత్రి బూర్గంపహాడ్​ మండల కేంద్రంలోని తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల గురుకుల కళాశాలతో పాటు కేజీబీవీలను కలెక్టర్ జితేశ్​వీ పాటిల్ తో కలసి ఆమె సందర్శించారు. బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థినులతో కలిసి వారు భోజనం చేశారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించి అక్కడే బస చేశారు.