పాల రేట్లు మూడేండ్లలో గరిష్టంగారూ.12.50 పెంపు 

పాల రేట్లు మూడేండ్లలో గరిష్టంగారూ.12.50 పెంపు 
  • లీటర్​ ఫుల్ క్రీమ్ పాలు రూ.68.57 
  • కర్నాటకలో అతితక్కువగా రూ. 2 మాత్రమే
  • పెంపు రాజ్యసభకు కేంద్రం నివేదిక

హైదరాబాద్, వెలుగు: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే పాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. మూడేండ్లలో రేట్లు భారీగా పెరిగాయి. 2019లో ఫుల్ క్రీమ్(చిక్కటి) పాల ధర లీటరుకు రూ.56 ఉండగా.. ఇప్పుడది రూ.68.57కి పెరిగింది. ఈ మూడేండ్లలోనే లీటరుపై రూ.12.57 పెరిగింది. టోన్డ్ మిల్క్ ధర కూడా మూడేండ్లలో రూ.10 పెరిగింది. 2019లో రూ.42 ఉన్న లీటరు పాల ధర.. ఇప్పుడు రూ.52.14కి చేరింది. రాజ్యసభలో తృణమూల్ ఎంపీ ఆబిర్ రంజన్ బిశ్వాస్ అడిగిన ప్రశ్నకు కేంద్రం వివిధ రాష్ట్రాల పాల ధరల వివరాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం కర్నాటకలో పాల ధరలు దేశంలోనే అతి తక్కువగా ఉన్నాయి. లీటర్ ఫుల్ క్రీమ్ పాల ధర రూ.46 ఉండగా.. టోన్డ్ మిల్క్ ధర రూ.37గా ఉంది. మూడేండ్లలో ఆ రాష్ట్రంలో లీటరుకు రూ. 2 మాత్రమే పెరిగింది. 

సామాన్యుడిపైనే భారం 

రాష్ట్రంలో ఉన్న అధిక రేట్లతో సామాన్యుడు పాల కొనుగోలులో కోతలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. పాల ధరలు పెరగడం వల్ల రైతులకైనా మేలు జరుగుతున్నదా.. అంటే అదీ లేదు. లీటరు పాలపై ఇటీవల పెంచిన రూ.2.70తో కలిపి సగటున 6% వెన్న ఉండే ఫుల్ క్రీమ్ పాలపై విజయ డెయిరీ రైతులకు చెల్లిస్తున్నది రూ.49.40 మాత్రమే. కానీ, విజయ ఫుల్ క్రీమ్ మిల్క్ మార్కెట్ ధర మాత్రం రూ.70 ఉంది. ఈ లెక్కన మార్కెట్ ధరతో పోలిస్తే రైతులకు అందుతున్న చాలా తక్కువేనని తెలుస్తున్నది. కేంద్ర లెక్కల ప్రకారం లీటరు మామూలు పాల ధర రూ.52గానే ఉన్నా.. విజయ మిల్క్ ధర మాత్రం రూ.56గా ఉంది. రాష్ట్రంలో గతంతో పోలిస్తే ఇప్పుడు పాల ఉత్పత్తి బాగా పెరిగినా, ధరలు తగ్గకపోవడం విశేషం.