మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్  జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట(నంగునూరు), వెలుగు :  తెలంగాణలో  పేదరిక నిర్మూలనే ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని  మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం నంగునూరు మండలం లోని ముండ్రాయి, జెర్రిపోతుల తండా, అక్కన్నపల్లి  గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత పథకాలు వద్దన్న కేంద్ర బీజేపీని గద్దె దించాలన్నారు. ఎనిమిదేండ్ల కాలంలో  కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎకరాకు ఏటా రూ.10 వేల పంట పెట్టుబడి సాయాన్ని  రైతుబంధు పేరిట అందిస్తున్నామని, కానీ కేంద్రంలోని  బీజేపీ ప్రభుత్వం మాత్రం నీరవ్ మోడీ లాంటి వాళ్లకు రూ.10 లక్షల కోట్లు మాఫీ చేస్తూ మరోవైపు  రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వ వద్దని చెప్పడం సబబేనా అన్నారు. ముండ్రాయి పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీయల్ పార్కు, రైల్వే లైన్​, ఎల్కతుర్తి నుంచి రామయంపేట వరకు నాలుగు లేన్ల రాజీవ్ రహదారి నిర్మాణం పనులు మొదలుకానున్నాయని వివరించారు. మనఊరు మనబడి కింద ముండ్రాయి పాఠశాలను రూ.52 లక్షలతో అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నామని,  గ్రామంలో ఓపెన్ జిమ్, వైకుంఠధామం, సెగ్రీ గేషన్ షెడ్డు తదితర గ్రామ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకున్నామని తెలిపారు. కాగా మూడు గ్రామాల్లో  రెడ్డి కమ్యూనిటీ హాల్, ఓపెన్ జిమ్, రెండు ఓహెచ్ఎస్ఆర్ నీటి ట్యాంకులు, శ్మశాన వాటిక, డంపింగ్ షెడ్, పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించి  ముండ్రాయి నుంచి దూల్మిట్ట సర్కిల్ వరకు,  ముండ్రాయి నుంచి మందపల్లి వరకు రోడ్డు నిర్మాణ పునరుద్ధరణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. సాయంత్రం సిద్దిపేట ఎన్జీవో భవన్ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

త్రివర్ణంలో దుర్గమ్మ అలంకరణ

పాపన్నపేట, వెలుగు : స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఏడుపాయల వన దుర్గ భవానీ మాతను జాతీయ పతాకంలోని మూడు రంగుల పూలతో అలంకరించారు. భక్తులు భారీగా హాజరై దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు 
నిర్వహించారు.

ఏక కాలంలో రుణ మాఫీ చేయాలి

కోహెడ(హుస్నాబాద్​), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాలను ఏక కాలంలో మాఫీ చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బండ రాజిరెడ్డి డిమాండ్​ చేశారు. సోమవారం హుస్నాబాద్​లో నిర్వహించిన రైతు సంఘం జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేస్తామన్న హామీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని గ్రామ గ్రామన ప్రజలకు వివరించాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి రైతాంగం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐకేఎస్ జిల్లా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా యెడల వనేశ్, అధ్యక్షుడుగా ననువాల ప్రతాపరెడ్డిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, నాయకులు గడిపె మల్లేశ్, కొమ్ముల భాస్కర్, సంజీవరెడ్డి, జనార్దన్, సుజిత్, పద్మ పాల్గొన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రపై దాడి దారుణం

మెదక్/చేర్యాల, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ నిర్వహిస్తున్న  ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ గుండాల దాడి దారుణమని ఆ పార్టీ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్​కుమార్, ​బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేశ్​గౌడ్ అన్నారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడారు.  ముందస్తు అనుమతితో పాదయాత్ర చేస్తుంటే రక్షణ కల్పించలేని అసమర్థ ప్రభుత్వానికి క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి తొత్తులా వ్యవహరించకుండా ప్రజాస్వామ్యయుతంగా తమ విధులను నిర్వర్తించాలన్నారు. ఫామ్​హౌజ్ నుంచి బయటికి రాని సీఎం కేసీఆర్​ ప్రజలతో మమేకమవుతున్న బీజేపీ నాయకులపై, కార్యకర్తలపై వరుసగా దాడులు చేయించడం అమానుషమన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక టీఆర్ఎస్​ భౌతిక దాడులకు దిగుతోందని మండిపడ్డారు. ఈ దాడికి వ్యతిరేకంగా మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

సామూహిక జాతీయ గీతాలాపన మార్మోగాలి 

సిద్దిపేట రూరల్, వెలుగు: సామూహిక జాతీయ గీతాలాపన పట్టణాలు, గ్రామాలలో మార్మోగాలని సిద్దిపేట సీపీ శ్వేత ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా  మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించే సామూహిక జాతీయ  గీతాలాపన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సక్సెస్​ చేయాలని కోరారు. 

ఫ్రీడమ్ కప్  పోటీలు ప్రారంభం..

మానసిక ఉల్లాసం కోసం ఆటలు ఆడాలని సీపీ శ్వేత పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచించారు. వజ్రోత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఫ్రీడమ్ కప్  పోటీలలో వాలీబాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ ను  ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏ ఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్ర రావు, సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్, రిజర్వ్ ఇన్స్​పెక్టర్లు  శ్రీధర్ రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు. 

డీజేలపై నిషేధాజ్ఞలు కొనసాగింపు

మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించినట్లు సీపీ తెలిపారు. ఈ ఆంక్షలు ఈనెల 31 వరకు పొడిగించినట్లు చెప్పారు. 

రాయన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి

కంగ్టి, వెలుగు : బ్రిటిష్ వాళ్లను గడగడలడించిన మహావీరుడు క్రాంతి వీర సంగోళ్లి రాయన్నను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కంగ్టి సీఐ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. రాయన్న 224వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఖేడ్ రోడ్డు మార్గంలోని ఆయన విగ్రహానికి, ఫొటోకు రాయన్న యూత్ సభ్యులు  పూలమాల వేసి నివాళులర్పించారు. ర్యాలీ నిర్వహించారు. 

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

వెలుగు, నెట్​వర్క్​ :  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఊరూరా అధికారులు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోని వేడుకల్లో  మంత్రి మహమూద్ అలీ, మెదక్ కలెక్టరేట్​లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సిద్దిపేటలో డిగ్రీ కాలేజీ గ్రౌండ్​లోని వేడుకల్లో మంత్రి హరీశ్​రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన వేడుకల్లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ, కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్, సిద్దిపేటలో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్యే సతీశ్​ కుమార్, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ ఎన్.శ్వేత, మెదక్​లో జడ్పీ​ చైర్​ పర్సన్​ హేమలత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, అడిషనల్​ కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్​ పాల్గొన్నారు.  ప్రభుత్వ పథకాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన శకటాల ప్రదర్శన నిర్వహించారు.  స్వాతంత్ర్య  సమరయోధుల కుటుంబాలను శాలువాతో సన్మానించారు. వివిధ శాఖలలో ఉత్తమ  ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలతో సత్కరించారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పలుచోట్ల ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు జెండాలను ఆవిష్కరించారు. సిద్దిపేటలో 750 అడుగుల జాతీయ జెండాతో ఏబీవీపీ తిరంగా ర్యాలీ నిర్వహించగా, పలు ప్రాంతాల్లో భారీ జెండాలను ప్రదర్శించారు. 

పండుగలా మారిన వ్యవసాయం 

సిద్దిపేట, వెలుగు :  సమైక్య పాలనలో చిన్న చూపుకు గురైన తెలంగాణ వ్యవసాయ రంగం ఇప్పుడు టీఆర్​ఎస్​ ప్రభుత్వ పథకాలతో పండుగలా మారిందని మంత్రి హరీశ్​రావు అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతోనే నాలుగు దశాబ్దాల సిద్దిపేట జిల్లా కోరిక సాకారమైందని, సీఎం కేసీఆర్ ఒక్క నిర్ణయంతో అనేక సమస్యలు తొలగిపోయాయని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా మారిందన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాల గురించి శాఖల వారీగా వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా అభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. 
కొత్తగా 20,258 ఆసరా పింఛన్లు 


మెదక్​, వెలుగు: మెదక్​ జిల్లాలో కొత్తగా 20,258 మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేసినట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్​ అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించడంతో 12,141 మందికి పింఛన్లు​ మంజూరు అయ్యాయన్నారు. వీటితో పాటు 1,579 వితంతువులకు, 4,255 దివ్యాంగులకు, 242 మంది చేనేతలకు, 8 మంది గీత కార్మికులకు, 1,746 మంది బీడీ కార్మికులకు, 149 మంది ఒంటరి మహిళలకు, 49 మంది మలేరియా వ్యాధి గ్రస్థులకు కొత్తగా పింఛన్లు మంజూరైనట్టు తెలిపారు. 

అందరికీ సంక్షేమ ఫలాలు
సంగారెడ్డి, వెలుగు :  ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో సంగారెడ్డి జిల్లా కొత్త ఒరవడికి నాంది పలికిందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, భూగర్భ జలాలు, పౌరసరఫరాలు, పాడి పరిశ్రమ, పోలీసు శాఖ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించారు.