
- ప్రాజెక్ట్‌ను గత సర్కార్ పట్టించుకోలేదు
నల్గొండ అర్బన్/కట్టంగూర్(నకిరేకల్), వెలుగు : ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గాన్ని మూడేండ్లలో పూర్తి చేసి నల్గొండ జిల్లా ప్రజలకు తాగు, సాగునీటిని అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం జి.ఎడవెల్లి గ్రామంలో ఎడవల్లి ప్రాజెక్ట్ రిపేర్ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.4 వేల కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు చేస్తున్నామని, ప్రమాదం జరగడంతో ప్రస్తుతం పనులు నిలిచిపోయాయన్నారు.
పనులను తిరిగి ప్రారంభించి మూడేండ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాకు చెందిన ప్రాజెక్ట్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రతి నీటి బొట్టును వినియోగించుకునేలా ప్రాజెక్ట్‌లు, రిజర్వాయర్లను పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే జి.ఎడవెల్లి చెరువు, తూము రిపేర్లకు రూ.1.30 కోట్లను డీఎంఎఫ్‌టీ ద్వారా మంజూరు చేసినట్లు చెప్పారు. సన్నబియ్యం పంపిణీతో మూడు కోట్ల మంది సంతోషంగా భోజనం చేస్తున్నారన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. జిల్లాలో రోడ్లు, డ్రైనేజీలను నిర్మించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎడవెల్లి గ్రామంలోని 80 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఆర్డీవో అశోక్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనుప్‌రెడ్డి పాల్గొన్నారు.
సౌర విద్యుత్‌తో మహిళలకు ఆదాయం
కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ఆర్థికసాయంతో, స్వబాగ్స్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాములలో ఏర్పాటుచేసిన స్వచ్ఛ శక్తి ఆఫ్ గ్రిడ్ కో ఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్లను మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛ శక్తి కేంద్రం, మహిళా సంఘాల మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సౌరశక్తితో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఆదాయం పొందేందుకు దేశంలోనే మొదటిసారిగా అయిటిపాములలో మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యులతో సోలార్ బ్యాటరీ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మరో రెండు నెలల్లో నల్గొండ మండలం చర్లపల్లి గ్రామంలో సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేసి, గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ నారాయణ అమిత్, మండల ప్రత్యేక అధికారి, జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, నల్గొండ ఆర్డీవో అశోక్‌రెడ్డి, తహసీల్దార్ ప్రసాద్ పాల్గొన్నారు.