పార్టీ ఏదైనా అడిగిన వారి పనులు చేశా : నిరంజన్ రెడ్డి

పార్టీ ఏదైనా అడిగిన వారి పనులు చేశా : నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు : ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ఆ తరువాత ఎవరు వచ్చి అడిగినా కాదనకుండా పనులు చేసి పెట్టానని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. బుధవారం వనపర్తి మండలంలో ఆయన ప్రచారం నిర్వహించారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి మంచి పేరు తెచ్చానన్నారు. తొమ్మిదేండ్లలో నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరు తెచ్చిన ఘనత తమదేనని చెప్పారు. జిల్లాలో కరువును ఎదుర్కొనేందుకు 15 చెక్ డ్యామ్ లు కట్టించామన్నారు. రాష్ట్రం వచ్చాక ఫించన్ ను రూ.2 వేలకు పెంచామని, రూ.5 వేల వరకు ఇస్తామని తెలిపారు.

పేదలందరికీ రూ.5 లక్షల జీవిత బీమా కల్పించాలని సీఎం కేసీఆర్  నిర్ణయించారన్నారు. పైరవీలు లేకుండా ఆన్​లైన్ లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామని, కాంగ్రెస్ కు ఓటేస్తే పేదల నోళ్లు కొడతారని హెచ్చరించారు. కాంగ్రెస్  పార్టీవి మాయమాటలని నమ్మి మోసపోవద్దని సూచించారు.

ALSO READ : కొత్తగూడెంను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఇక పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి తండాలో మంత్రి నిరంజన్​రెడ్డి సతీమణి వాసంతి రెడ్డి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న మంత్రిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.