బీఆర్ఎస్​కు అంత శక్తి లేదు ; పొన్నం ప్రభాకర్

బీఆర్ఎస్​కు అంత శక్తి లేదు ; పొన్నం ప్రభాకర్
  • మేమేం అంత వీక్​గా లేం.. కూల్చుడు మాటలు బంజేయాలి: పొన్నం
  • సంజయ్ జ్యోతిషం చదివాడని తెలియదు 
  • ఆయన దేశంలోనే నంబర్​వన్ విఫల ఎంపీ అని కామెంట్
  • స్మార్ట్​ సిటీ పనుల్లో అవినీతిపై ఎంక్వైరీ జరుగుతున్నదని వెల్లడి

కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే శక్తి బీఆర్ఎస్​కు లేదని, తమ పార్టీ అంత బలహీనంగా లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైందని, ప్రజలు మార్పు కోరి తమను ఎన్నుకున్నారని తెలిపారు. 

ఆదివారం వేములవాడలో రాజరాజేశ్వర స్వామిని పొన్నం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చబోతున్నారంటూ ఎంపీ సంజయ్ చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు. సంజయ్ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుడు బంద్ చేయాలని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదన్నారు.

తాము ప్రజలకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంటే, బీఆర్ఎస్ లో అసహనం పెరిగిపోతున్నదని మండిపడ్డారు. ఒకవేళ కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే, బీఆర్ఎస్ ను ఆ పార్టీ నిట్టనిలువునా చీలుస్తుందని కొందరు తనతో ఢిల్లీలో చెప్పారని పేర్కొన్నారు.

‘‘బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే ఇన్నాళ్లు కొందరు నమ్మారు.. మరికొందరు నమ్మలేదు. ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూల్చబోతున్నదని సంజయ్ మాట్లాడుతున్నాడంటే.. ఒకరి సమాచారం ఒకరికి తెలుస్తున్నదని మరోసారి నిరూపితమైంది” అని అన్నారు. సంజయ్ ఇంటర్ ఫెయిలయ్యాడని  తెలుసుగానీ, జ్యోతిషం చదివాడని తెలియదంటూ ఎద్దేవా చేశారు.  

కరీంనగర్ స్మార్ట్ సిటీలో అవినీతిపై విచారణ జరుగుతున్నది 

రాముడు, అయోధ్య రామమందిరం పేరుతో బీజేపీ మార్కెటింగ్ చేసుకుంటున్నదని పొన్నం విమర్శించారు. ఆలయ నిర్మాణం పూర్తికాకున్నా లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభోత్సవం చేస్తున్నదని మండిపడ్డారు. దీనికి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని దేశంలోని ముఖ్యమైన నలుగురు జగద్గురువులు వ్యతిరేకిస్తున్నారు.

రాముడి ప్రాణప్రతిష్ట సంప్రదాయం ప్రకారం జరగడం లేదు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రాణప్రతిష్టను దేశంలో ఎవరూ హర్షించరు. ఇది దేశానికి ‌‌‌‌అరిష్టం” అని అన్నారు. గత ఎన్నికల్లో మంగళ సూత్రాలు అమ్మిన సంజయ్ కి ఇప్పుడు లక్షల రూపాయలతో కటౌట్స్ పెట్టుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు.  దేశంలోనే నంబర్ వన్ విఫల ఎంపీ సంజయ్ అని కామెంట్ చేశారు.

అంతకుముందు ఎంపీగా పనిచేసిన వినోద్ కుమార్ కూడా కరీంనగర్ కు చేసిందేమీ లేదన్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి.. కేసీఆర్, వినోద్, సంజయ్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘‘కరీంనగర్ స్మార్ట్ సిటీలో అవినీతి జరిగితే మాజీ మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్ ప్రేక్షక పాత్ర వహించారు. అవినీతి, అక్రమాలపై ఎంక్వైరీ నడుస్తోంది. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి” అని చెప్పారు. సీఎం అనే పదవి కంటే, కేసీఆర్ అనే మూడక్షరాల పదమే గొప్పదైతే ఆయనకే పూజ చేసుకోవాలని అన్నారు.