నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు .. అధికారులు బాధ్యతతో వ్యవహరించండి : పొన్నం ప్రభాకర్​

నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు .. అధికారులు బాధ్యతతో వ్యవహరించండి : పొన్నం ప్రభాకర్​
  • సమస్యలుంటే మా దృష్టికి తీసుకురండి 
  • త్వరలో జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం
  • హైదరాబాద్​ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్​ 

హైదరాబాద్, వెలుగు: అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హైదరాబాద్​ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని సూచించారు. బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్​హాల్ లో సమావేశం కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి హైదరాబాద్​జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాకు సంబంధించి మౌలిక సదుపాయాలు, వెల్ఫేర్​, విద్య, వైద్యం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలపై ,పెండింగ్ లో ఉన్న  పనులపై, వివిధ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్య, వైద్యం, ఎంప్లాయ్ మెంట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ​ వెల్ఫేర్​, కోపరేటివ్​ బ్యాంక్​, ఫిషరీస్​, చేనేత, రెవెన్యూ, టామ్​కామ్​ తదితర డిపార్ట్ మెంట్లకు సంబంధించిన వివిధ సమస్యలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలకు సంబంధించి సరైన వివరాలను తెలపని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.  

అధికారులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి సెక్రటేరియట్​ నిర్మాణం మీద ఉన్న శ్రద్ధ, జిల్లా కలెక్టరేట్​మీద లేదని విమర్శించారు. త్వరలో విశాలమైన ప్రాంతాన్ని ఎంపిక చేసి కొత్త కలెక్టరేట్ భవన​నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సిటీలో నిర్మాణం పూర్తయిన భవనాలు చాలా ఉన్నాయని, త్వరలో వాటిని ప్రాంరంభిస్తామని మంత్రి చెప్పారు. అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

విటమిన్ ఫుడ్ తీసుకోండి 

రక్త హీనతతో ఎవరూ బాధపడొద్దని, అందరూ ఆకుకూరలు, పండ్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఫుడ్ ను తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ విద్యార్థులకు సూచించారు. రాజ్ భవన్ ప్రభుత్వ స్కూల్ లో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎనీమియా ముక్త్ భారత్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గెస్ట్​ గా హాజరైన మంత్రి మొదటగా రక్త పరీక్షలు చేయించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. బాలికలు ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ పరీక్షలు చేసుకోవాలని, అవసరమైన వారు మందులు తీసుకోవాలని, తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం 51 వేల మందికి రక్తహీనత ఉందని, వచ్చే ఏడాదికి 20 వేలకు తగ్గించాలని, ఇందుకు ప్రభుత్వం మందులు సప్లై చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో  కలెక్టర్ అనుదీప్ , డీఎంహెచ్ వో డాక్టర్ వెంకటి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శ్రీకళ, అధికారులు పాల్గొన్నారు.

కొందరు ఉద్యోగ సంఘాల నేతలు పదవుల కోసం చెంచాగిరి చేసిన్రు 

బషీర్ బాగ్:  కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు తమ పదవుల కోసం ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేసి , గత ప్రభుత్వం దగ్గర చెంచాగిరి చేశారని  మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇప్పుడా ఆ పరిస్థితి ఉండదని , ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం చూసుకుంటుందని, విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.  తెలంగాణ ఎన్జీవో సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ ఆధ్వర్యంలో బుధవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లలితకళా తోరణంలో జరిగిన కొత్త సంవత్సర డైరీ ఆవిష్కరణ సభకు ఆయనతో పాటు మంత్రి సీతక్క, టీజేఎస్ చీఫ్ ప్రొ.కోదండరాం పాల్గొన్నారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగరీత్యా క్రమశిక్షణ తప్పితే అదేస్థాయిలో చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. 

జిల్లా విద్యాశాఖపై సమీక్ష

అనంతరం టెన్త్ , ఇంటర్ పరీక్షలపై నారాయణగూడ కేశవ్ మెమోరియల్ స్కూల్ లో హైదరాబాద్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. డీఈవో, ఎస్సీ, ఎస్టీ ,బీసీ , మైనారిటీ వెల్ఫేర్ అధికారులు, హెడ్ మాస్టర్లు , ఆర్సీవోలు , డిప్యూటీ ఈవోలు, హాస్టల్ వార్డెన్స్ అధికారులు పాల్గొన్నారు.