ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

క్రీడలతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి

మంత్రి సత్యవతి, గురుకులాల సెక్రటరీ రోనాల్డ్ రాస్ 

కురవి, వెలుగు : క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగుపడడంతోపాటు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్, గురుకుల సెక్రటరీ రోనాల్డ్ రాస్ అన్నారు. కురవిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్​ లో ఈనెల 1న ప్రారంభమైన సొసైటీ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. విజేతలకు మంత్రి సత్యవతి, గురుకుల సెక్రటరీ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గురుకులాల సెక్రటరీ రోనాల్డ్​రాస్​మాట్లాడుతూ 23 ఈఎంఆర్ఎస్ స్కూళ్ల నుంచి అండర్–14,19 విభాగాల్లో 17 ఆటలకు 1300మంది క్రీడాకారులు హాజరైనట్లు చెప్పారు. క్రీడల్లో టాలెంట్​చూపించిన క్రీడాకారుల కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. మంత్రి మాట్లాడుతూ  రాష్ట్రంలో 183 గురుకులాలు, 330 ఆశ్రమ స్కూళ్లలో నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికరమైన ఆహారం అందిస్తూ గిరిజన విద్యార్థులకు బంగారు బాట వేస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులతో మంత్రి సత్యవతి రాథోడ్ కోలాటం ఆడారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ , ఐటీడీఏ పీవో అంకిత్, ఆర్డీవో కొమురయ్య, ఆర్వీవో విజయలక్ష్మి, జడ్పీటీసీ వెంకటరెడ్డి పాల్గొన్నారు.

చట్టాలపై ప్రతిఒక్కరికి అవగాహన ఉండాలి 

వర్ధన్నపేట ,వెలుగు : నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కోసం గ్రామస్థాయిలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 13వరకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా లీగల్​సెల్​సెక్రటరీ, వరంగల్​సీనియర్​సివిల్​జడ్జి ఉపేందర్​తెలిపారు. శుక్రవారం వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్​ఆఫీసులో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్​సివిల్​జడ్జి మాట్లాడుతూ ప్రతి పౌరునికి చట్టాలపై అవగాహన కల్పించడం కోసం ఈ  కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో  మున్సిపల్​చైర్​పర్సన్​అరుణ, కమిషనర్ రవీందర్, సీఐ సదన్  కుమార్ పాల్గొన్నారు.

వాహనాలకు రిపేర్లలో జాప్యం చెయొద్దు : బల్దియా మేయర్​ సుధారాణి 

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: బల్దియా వాహనాలకు రిపేర్లు చేయడంలో జాప్యం చేయొద్దని మేయర్​ గుండు సుధారాణి సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం సిటీలోని బాలసముద్రంలో వాహనాల షెడ్డును మేయర్​ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్​ మాట్లాడుతూ బల్దియా ఆధ్వర్యంలో వాహనాల రిపేరింగ్​ సమాచారం నమోదు లాగ్​బుక్​లో ఎంటర్​చేసి వెంటవెంటనే పని పూర్తిచేయాలన్నారు. అనంతరం సెకండ్​ట్రాన్స్​ఫర్​ను మేయర్​ పరిశీలించారు. కార్యక్రమంలో ఎలక్ర్టికల్​ ఈఈ సంజయ్​ కుమార్​, వర్క్​ ఇన్​స్పెక్టర్లు సత్య, కమాలుద్దీన్​, అవినాశ్​పాల్గొన్నారు. 

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి : జనగామ కలెక్టర్​ శివలింగయ్య

జనగామ అర్బన్​, వెలుగు :  జిల్లాలో వడ్ల కొనుగోలుకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్​ శివలింగయ్య తెలిపారు. శుక్రవారం కలెక్టర్​ క్యాంపు ఆఫీస్​ నుంచి జిల్లాలో కొనుగోలు సెంటర్ల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కలెక్టర్​మాట్లాడుతూ జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్​ద్వారా 167 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సెంటర్లలో తాగునీరు, కరెంట్, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కొనుగోలు విషయంలో ఇబ్బందుల ఏర్పడితే కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన కంట్రోల్​ రూం 6303928718కు కాల్​చేయాలన్నారు.

జిల్లా హాస్పిటల్​లో ఉద్యోగాల పేరుతో వసూళ్లు : ఎస్పీ శరత్​చంద్రపవార్​

మహబూబాబాద్​అర్బన్​, వెలుగు : మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్​లో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసి రూ.13.80లక్షలు రికవరీ చేసినట్లు ఎస్పీ శరత్​చంద్ర పవార్​తెలిపారు. శుక్రవారం ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..  మహబూబాబాద్​జిల్లా హాస్పిటల్​లో 65 మంది ఔట్​సోర్సింగ్​వర్కర్స్​కోసం టెండర్​వేయగా హైదరాబాద్​కు చెందిన సాయి సెక్యూరిటీ కంపెనీకి టెండర్​దక్కింది. దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా టేకుమట్లకు చెందిన గాండ్ల వెంకటేశ్వర్లు, సీరోల్​మండలం రూప్లాతండకు చెందిన బానోత్​వరుణ్​కుమార్, ఖమ్మానికి చెందిన ఇస్లావత్​ వెంకన్న ఔట్​సోర్సింగ్​ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారు. వెంకటేశ్వర్లు 15 మంది నుంచి ఒక్కొక్కరికి రూ.30వేల చొప్పున 4.50లక్షలు, వరుణ్​కుమార్​ నలుగురి వద్ద రూ.1.20లక్షలు, ఇస్లావత్ వెంకన్న ఇద్దరి నుంచి రూ.60వేలు  వసూలు చేశారు. వీటితోపాటు వరుణ్​కుమార్.. నిమ్మల శ్రీను, రవీందర్​అనే వ్యక్తుల ద్వారా మరికొంతమంది నుంచి మరో 3 లక్షలు వసూలు చేసి వెంకటేశ్వర్లుకు ఇచ్చాడు. హాస్పిటల్​లో పనిచేస్తున్న పని చేస్తున్న మాలోత్ శరత్ .. నలుగురిని చేర్పించి వారి నుంచి వసూలు చేసిన డబ్బును వరుణ్​కుమార్​ద్వారా వెంకటేశ్వర్లు కు ఇచ్చాడు. ముగ్గురు నిందితుల నుంచి రూ.13.80లక్షల స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మరికొంతమంది నుంచి డబ్బు వసూలు చేసి ఉండొచ్చనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. 

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ముఖాముఖి : దాస్యం వినయ్ భాస్కర్

కాజీపేట, వెలుగు : ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.  శుక్రవారం కాజీపేటలోని కూరగాయల మార్కెట్ వద్ద మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, కార్పొరేటర్లతో కలిసి ముఖాముఖీ నిర్వహించారు.  కార్యక్రమానికి 47,48,61,62,63 డివిజన్ల ప్రజలు హాజరై తమ సమస్యలపై ఫిర్యాదులను లిఖితపూర్వకంగా చీఫ్ విప్​కి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్​ఖాన్, కార్పొరేటర్లు సంకు నర్సింగ్, రాములు, విజయ శ్రీ రజాలి, డివిజన్ అధ్యక్షుడు రంజిత్ పాల్గొన్నారు.


దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన చీఫ్​విప్ 

హనుమకొండ సిటీ, వెలుగు : వరంగల్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ప్రభుత్వ చీఫ్​విప్ దాస్యం వినయ్​ భాస్కర్ శుక్రవారం హనుమకొండలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి మంత్రికి స్వాగతం పలికారు.

పైసలున్నా జీతాలియ్య లేక.. 

ఏనుమాముల మార్కెట్​ లో జీతాలకు ఇబ్బందిపడుతున్న ఉద్యోగులు

వరంగల్​సిటీ, వెలుగు: రాష్ట్రంలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్​గా పేరుగాంచిన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో ఈ నెల జీతాలెట్లా వేయాలోనని అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఆగస్టు 18న  మార్కెట్​ చైర్మన్​ పదవీకాలం ముగిసింది. మార్కెట్​ చైర్మన్​తోపాటు కార్యదర్శికి జాయింట్​ చెక్​ పవర్​ ఉంటుంది. చైర్మన్ ​లేకపోవడంతో ఖజానాలో పైసలున్నా ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎదురవుతోంది. మార్కెట్​లో 109 మంది ఉద్యోగులు, 172 మంది పెన్షనర్లు ఉండగా ప్రతినెలా జీతాలకు రూ. కోటి24లక్షలు ఖర్చవుతోంది. చెక్​పవర్ ​లేకపోవడంతో ఇతర మార్కెట్​కమిటీల నుంచి అప్పులు తెస్తూ జీతాలు ఇస్తున్నారు.

కేసీఆర్​ను బద్నాం చేసేందుకు బీజేపీ కుట్రలు : ఎమ్మెల్యే డా రాజయ్య

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : రైతు పక్షపాతి సీఎం కేసీఆర్​ను బద్నాం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే డా.రాజయ్య ఆరోపించారు. స్టేషన్​ఘన్​పూర్​ మండలం నమిలిగొండ, తానేదార్​పల్లి, ఇప్పగూడెం, తాటికొండ గ్రామాల్లో శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డీఆర్డీఏ, సెర్ప్​ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మాట్లాడుతూ దేశానికి ప్రధాని అయ్యేందుకు సీఎం కేసీఆర్​కు అన్ని యోగ్యతలు ఉన్నాయని, దేశ ప్రజలు, రైతులు, దళితులు అదే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్​ కమిటీ చైర్మన్​ గుజ్జరి రాజు, వైస్​ చైర్మన్​చందర్​రెడ్డి, ఆర్డీవో కృష్ణవేణి, తహసీల్దార్​ పూల్​సింగ్​ చౌహన్​, వెటర్నరీ ఆఫీసర్లు పాల్గొన్నారు

ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీని ఓడించాలి 

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

హనుమకొండ సిటీ, వెలుగు : దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీని అన్ని రంగాల్లో ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ ఐకే గార్డెన్స్​లో  సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తామన్నారు. మునుగోడులో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ కన్వీనర్ బోట్ల చక్రపాణి, కమిటీ సభ్యులు వాసుదేవరెడ్డి, వీరన్న, వెంకట్, సంపత్, భానునాయక్​, లింగయ్య, దీప, నార్త్​ కమిటీ కార్యదర్శి రమేశ్​ పాల్గొన్నారు.


దివ్యాంగుల స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలి : రావు పద్మ 

హనుమకొండ సిటీ, వెలుగు : సుబేదారిలోని దివ్యాంగుల భూమిని కబ్జాదారుల నుంచి కాపాడి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ డిమాండ్ చేశారు.  కబ్జాకు గురవుతున్న తమ స్థలాన్ని కాపాడేందుకు పోరాడాలని దివ్యాంగుల ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం  రావు పద్మకు  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కబ్జాకోరులతో పాటు వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  సమస్యను కలెక్టర్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి   పోరాటం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి  పవన్, దివ్యాంగుల ఫోరం బాధ్యులు పాల్గొన్నారు.

ముగిసిన శివ భక్త మార్కండేయ ఉత్సవాలు

బచ్చన్నపేట, వెలుగు : బచ్చన్నపేటలో రెండు రోజులపాటు జరిగిన శివభక్త మార్కండేయ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఆలయ తొలి వార్షికోత్సవం సందర్భంగా పద్మశాలీల ఆరాధ్యదైవం మార్కండేయ స్వామిని భక్తులు అధిక సంఖ్యలోదర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్థాపితదేవతా హోమాలు, పూజలు, శాంతి కల్యాణం, పూర్ణాహుతి, మహదాశీర్వచనము, రుత్విక్​ సన్మానం, తీర్థప్రసాద వినియోగం, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు బేతి కృష్ణమూర్తి, కమిటీ సభ్యులు గుర్రపు బాలరాజు, కేశవులు, సిద్దిరాములు, కృష్ణమూర్తి, ఆనంద్, మురళీ, శ్రీహరి, వెంకటేశ్వర్లు, నగేశ్ పాల్గొన్నారు.