తెలంగాణ భూములు ఆయిల్ పామ్కు అనుకూలం : మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు

తెలంగాణ భూములు ఆయిల్ పామ్కు అనుకూలం : మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
  • సాగులో మన రాష్ట్రమే నంబర్​ వన్​
  • మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు 

వికారాబాద్​, వెలుగు: ఆయిల్ పామ్​ పంటల సాగుకు తెలంగాణ భూములు అనుకూలంగా ఉన్నాయని, సాగులో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం వికారాబాద్  జిల్లా కొత్రేపల్లిలోని ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ మాజీ చైర్మన్ ​కాసాని జ్ఞానేశ్వర్  వ్యవసాయ క్షేత్రంలో మెగా ఆయిల్  పామ్  ప్లాంటేషన్  డ్రైవ్  నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్  తో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఆయిల్ పామ్​ సాగుతో అధిక లాభాలు వస్తాయని, మూడేళ్ల పాటు అంతర్గత పంట కింద కూరగాయలు సాగు చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్​కు కూరగాయలు ఎగుమతి చేయాలని, అందుకు అవసరమైన సౌలతులు కల్పిస్తామన్నారు.

 గత ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా, రేవంత్​ సర్కార్​ రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. త్వరలో పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. వికారాబాద్​ జిల్లాలో 10 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్పీకర్​ మాట్లాడుతూ.. రైతు భరోసాను ఎకరాకు రూ.12 వేలకు పెంచి 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాలో వేశామన్నారు. పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ యాస్మీన్  బాషా, డిప్యూటీ డైరెక్టర్  నీరజ గాంధీ, అడిషనల్​ కలెక్టర్  లింగ్యానాయక్  పాల్గొన్నారు.