కాంగ్రెస్​ వైపు చూడాలంటేనే వణికిపోవాలె..నా దగ్గర పైరవీలు.. ఉత్తమాటలు నడువయ్​

కాంగ్రెస్​ వైపు చూడాలంటేనే వణికిపోవాలె..నా దగ్గర పైరవీలు.. ఉత్తమాటలు నడువయ్​
  • ప్రజల్లో ఉన్నోళ్లకే పార్టీ పదవులు  
  • స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్

జనగామ, వెలుగు :  ‘ పక్కపార్టీ వాడెవడైనా సరే.. కాంగ్రెస్​ వైపు చూడాలంటేనే వణికిపోవాలె.. నా దగ్గర పైరవీలు నడువయ్​.. ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం పనిచేసే వాళ్లకే పదవులు వస్తయ్. సీనియరిటీ ఒక్కటే కాదు.. సమర్థత కూడా ముఖ్యమే..’ అని స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. 

జనగామ జిల్లా కేంద్రం శివారు యశ్వంతాపూర్​సమీపంలోని సత్య సాయి కన్వెన్షన్ హాల్ లో గురువారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను బలంగా తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. 

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్​ జెండా ఎగరాలన్నారు. కొత్త పాత అనే తేడా లేకుండా సమన్వయంతో ముందుకుసాగాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తన వద్దకు వచ్చి చెప్పాలన్నారు.   పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. పార్టీ పదవుల కోసం సమర్థులను ఎంపిక చేయాలని, ఇందులో తనకు ఎలాంటి ఆబ్లిగేషన్లు లేవన్నారు. సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకునే వరకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.

 మతతత్వ బీజేపీకి బుద్ధి చెప్పేలా పని చేయాలన్నారు. జిల్లా పరిశీలకుడు అద్దంకి దయాకర్​మాట్లాడుతూ కాంగ్రెస్​బలోపేతం కోసం ప్రతీ కార్యకర్త పని చేయాలని సూచించారు.  ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీదే గెలుపు ఉండాలన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. కష్టపడే వారికే పదవులు ఇస్తామన్నారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం కల్పించాలన్నారు. సీఎం రేవంత్​రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నా ప్రచారం చేసుకోకపోతే నష్టపోతామన్నారు. 

ఈ సమావేశంలో  వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అహ్మద్, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్​రెడ్డి ,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఘనపూర్, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్లు లావణ్య శిరీష్ రెడ్డి, బనుక శివరాజ్ యాదవ్ లతో పాటు పార్టీ మండలాధ్యక్షులు, ప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.