14 పతంజలి ఉత్పత్తుల లైసెన్స్‌లు రద్దు..

14 పతంజలి ఉత్పత్తుల లైసెన్స్‌లు రద్దు..

బాబా రామ్‌దేవ్‌కు చెందిన ప్రముఖ ఆయుర్వేద సంస్థ  పతంజలికి మరో షాక్ తగిలింది. పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ , దివ్య ఫార్మసీ తయారు చేసిన 14 ఉత్పత్తుల తయారీ లైసెన్సులను ఉత్తరాఖండ్ సర్కార్ ఏప్రిల్29వ తేదీ సోమవారం సస్పెండ్ చేసింది.  ఈ మేరకు రాష్ట్ర డ్రగ్స్ లైసెన్సింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చినట్లు నిర్ధారణ కావడంతో..  డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954 ప్రకారం.. లైసెన్సులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఉత్పత్తులలో .. స్వసారి గోల్డ్, స్వసారి వాటి, బ్రోంకోమ్, స్వసారి ప్రవాహి, స్వసారి అవలే, ముక్తావతి ఎక్స్‌ట్రా పవర్, బిపి గ్రిట్, మధుగ్రిట్, మధునాశినివాటి ఎక్స్‌ట్రా పవర్, లివామృత్ అడ్వాన్స్, లివోగ్రిట్, ఐగ్రిట్ గోల్డ్, పతంజలి దృష్టి ఐ డ్రాప్ వంటి 14 ఉత్పత్తుల తయారీ లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ అఫిడవిట్‌లో తెలియజేసింది.

కాగా ఇటీవల, పతంజలి ఆయుర్వేద సంస్థ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై విచారించిన సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకులు యోగా గురు రామ్‌దేవ్, బాలకృష్ణ కోర్టుకు బహిరంగ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.