గొప్పల డప్పులు.. అదొక ఆర్ట్​

గొప్పల డప్పులు.. అదొక ఆర్ట్​

గొప్పలు చెప్పటం కొందరికే అలవాటు అని అనుకుంటే పొరపాటే. మనిషి పుట్టగానే మనసుకు గొప్పలు చెప్పుకునే గుణం నాజూగ్గా అంటుకుంటుందేమో. పుట్టిన బిడ్డ ఉయ్యాలలో ఉన్నప్పుడే తన గొప్పతనం ఎప్పుడు బయట పెట్టాలనే ఆదుర్దాతో నవ్వుతాడు, ఏడుస్తాడు, కాళ్లు చేతులూ పహిల్వాన్‌లా ఊపుతాడు. జోలపాట పాడితే సంగీత విద్వాంసుడిలా ఆస్వాదిస్తూ కునుకు తీస్తాడు. నిద్రలేవటం లేవటమే గయ్‌ మంటాడు. మనకు అర్థంకాదు కానీ అదంతా తను గొప్పలు చెప్పుకునే విన్యాసాలే. తనను కాకుండా ఇంకొకరిని దగ్గరకు తీస్తే ఇల్లు పీకి పందిరి వేస్తాడు. అందరికంటే తనే గొప్ప అన్న లక్షణం పుట్టినప్పటి నుంచే ఉగ్గుపాల విద్యగా అలవర్చుకున్నప్పుడు పెద్దయిన తర్వాత ఎవరైనా ఎందుకు వదులుకుంటారు?.

చిన్నప్పుడు మా స్కూలులో ఉపాధ్యాయుల నడవడికలో గొప్పలు చెప్పుకునే గుణం అలవోకగా మిళితమై ఉండేది. ఇంగ్లీష్​ చెప్పే టీచర్‌ వచ్చీ రావటంతోటే ‘‘తెలుగు మాస్టారు విరగదీసి పద్యాలు పాడినట్లున్నాడే  వీధి వీధంతా వినేటట్లు’’ అని మొదలుపెట్టేవాడు. నిజానికి ఇద్దరూ మా దృష్టిలో గొప్ప టీచర్లే. కానీ, వారు తమ గొప్పలు తాము చెప్పుకోవటం మొదటి రోజుల్లో అర్థం కాలేదు. బుద్ధిమంతుళ్లలా వినేవాళ్ళం. ఆ తర్వాత తర్వాత మా గొప్పలు మేము చెప్పుకునే స్థితికి వచ్చిన తర్వాత వారి విషయం మాకు బోధపడింది. 

భాషా జ్ఞానం

‘ఇంగ్లీష్​లో ప్రొనన్సియేషన్‌,  గ్రామర్‌, వొకాబ్యులరీ  అబ్బో- ఎన్నో మాలాంటి వాళ్ళం అతికష్టం మీద నేర్చుకున్నాంగానీ- తెలుగే ముందోయ్‌..  హరికథ, బుర్రకథ - చెప్పేవాళ్ళు.. అంతెందుకు - గుళ్లో పురాణం చెప్పే పూజారి గూడా రాగాలు తీస్తూ పాడేయగలడు.- అడిగేవాడు లేడుకదా’ అని వారానికి రెండుసార్లయినా ఆ గొప్పల డప్పులు వాయించేవాడు. తెలుగు మాస్టారేం తక్కువా? ‘‘ఇంగిలిపీస్‌ ఏం భాషోయ్‌. మన భాషలో అతడు,- వాడు - అని దేనికదే చెప్పగలం.  ఇంగ్లీషులో ‘హి’ తప్ప అట్లాంటి వాటికి రెండో పదం ఉందా?’’ అని ఆయన తెలుగు గొప్పతనం- తన గొప్పతనంతో మాకు భాషా జ్ఞానం దానం చేసేవాడు. సరే స్కూలు వదిలేటప్పుడు మాలో మాకే గొప్పల జాడ్యం అంటుకుంది.  బాగా మార్కులొచ్చినవాడు అందరినీ  నీకెన్ని మార్కులు..- నీకెన్ని మార్కులు అని కనపడ్డ క్లాసు పిల్లలందర్నీ అడిగి తన మార్కులు చెప్పి  తనకు వచ్చిన మార్కులు ఇంతవరకూ ఏ సంవత్సరమూ,  ఏ పిల్లవాడికీ రాలేదని.. -బహుశా అది స్కూలు రికార్డుగా మిగిలిపోతుందేమోనని తాదాత్యం చెందుతూ, పరవశిస్తూ చెప్పేవాడు - మాకు ఒళ్ళు మండేది కానీ అప్పుడు ఏం చేయలేం గదా?.

గొప్పలతో పబ్బం

ఉద్యోగం దొరక్క తిరుగుతున్న రోజులవి. తెలిసిన ఒకాయన ఎప్పుడు కలిసినా.. ఎవరెవరికి ఎన్నెన్ని ఉద్యోగాలు తను ఇట్టే చెప్తే అట్టే ఇచ్చేవారి సంఖ్యతో సహా చెప్పినప్పుడు ఆ బుట్టలో పడటం సహజమేగా. ‘నేను ఫలానా చోట నీకు కలుస్తాను. అక్కడ ఎదురుగ్గా ఉన్న ఆఫీసులో నీ ఉద్యోగం ఖాయం అనుకో’ అని చెప్పి అన్ని ఖర్చులకు రెండింతల మందం వసూలుచేసి పోతూ పోతూ ఒక మాట చెప్పాడు. ‘‘నీ వెంబడే ఉంటే నిరుద్యోగులు పదిమంది క్యూలో నా ముందర ఉండి నన్ను మొహమాటం పెట్టి నీ ఉద్యోగాన్ని ఊడలాక్కునేందుకు చికాకు చేస్తారు. అందుకే నేను ఎవరికీ కనపడకుండా అక్కడికి రావటమే క్షేమం’’ అని.  తీరా అక్కడ ఆయన జాడలేదు.

చాలాసేపయిన తర్వాత ఆ ఆఫీసులోంచి తెలిసినాయన వచ్చి ఉద్యోగం కోసం వచ్చిన సంగతి తెల్సుకొని ‘నీ లక్‌ ఎలావుందో చూద్దాం పద’ అని లోనికి తీసుకెళ్ళి పెద్దాయనతో మాట్లాడి ఉద్యోగం నమ్మశక్యం కానివిధంగా ఇప్పించాడు. అంతేగాదు ‘థాంక్స్‌’ అని చెబుతున్నా వినకుండా ‘‘జాగ్రత్తగా ఉద్యోగం చేసుకో’’ అని హడావిడిగా వెళ్ళిపోయాడు.  సంతోషంగా బయటకు రావటం చూసిన గొప్పలు చెప్పుకొని పబ్బం గడుపుకొనే ఆయన వచ్చి ఉద్యోగం ఇప్పించిన ఆయన వెళ్ళిన వాలకం  అదీ చూసి- ‘ఏదోలే -ఎరేంజ్‌ చేశా! ఇంతకూ కాయా, పండా?’ అని అడిగాడు.  పండంటే తన ఖాతాలో వేసుకుంటాడేమోనని గొప్పల డప్పుగాడ్ని తప్పించుకోవటంతో, ఉద్యోగంతోపాటు లోకజ్ఞానం వచ్చిన తర్వాత గొప్పల జోలికి పోవద్దనుకోవటం జరిగింది.  కానీ, ఎందుకో ఎవరడిగినా ‘ఉద్యోగం భలే సంపాదించావే. ఎవరి సిఫార్సు?’ అని అడిగితే - ‘సిఫార్సా.. పాడా. మెరిట్‌ మీద ఉద్యోగం వచ్చింది’ అని గొప్పగా చెప్పుకోవటం ప్రారంభం అయింది.  

గొప్పల ఆద్యుడు గిరీశం

ఈ గొప్పల డప్పులకు ఆద్యుడు ఎవరబ్బా అని ఆలోచిస్తే - ‘నేనే కదా’ అని గురజాడ వారి గిరీశం ది గ్రేట్‌ నోట్లో పెద్ద చుట్ట పెట్టుకొని ఉంగరాల జుత్తుతో సాక్షాత్తు ప్రత్యక్షమై.. ‘ గొప్పలు చెప్పుకోవటం ఇంట్రడ్యూస్‌ చేసింది నేనేకదటోయ్‌! మీతోటి వచ్చిన గొడవేయిది! షార్ట్‌ మెమొరీతో సఫర్‌ అవుతున్నారు’’ అన్నాడు. దొరికాడనుకొని అసలు ఈ గొప్పల డబ్బాను మీ సొంతం ఎలా చేసుకున్నారు అని అడిగితే - ‘పొట్టకోసం పుట్టెడు బుద్ధులు.- నెస్సిసిటీ ఈజ్‌ ది మదర్‌ ఆఫ్‌ సెల్ఫ్‌ ప్రెయిజ్‌’ అన్నాడు.

Also read : దక్షిణ తెలంగాణకు కేసీఆర్​ చేసిన తొమ్మిది ద్రోహాలు

అదొక ఆర్ట్​

గొప్పలు చెప్పుకోవటం అనేది ఒక ఆర్ట్‌.  గొప్పలు చెప్పుకోవటంలో చిన్న లౌక్యం ఉంది.  మనం చెప్పుకొనే గొప్పలు పక్కవాడి తిప్పలు క్షణకాలం అయినా మాయం చేయగలిగితే మన పాచిక పారినట్లే. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిందల్లా ఒకటే సూత్రం. - ఎదుటివాడిని ‘అలెగ్జాండర్‌ లాగా ఉన్నావోయ్‌’ అని మనం పొగిడామంటే మనం ఫినిష్‌ అయినట్లే. మన గొప్పలు మనకే పరిమితం కావాలి. ఎదుటివాడికి అప్పుగానైనా ఇవ్వకూడదు. ‘అలెగ్జాండర్‌ లాంటివాడినోయ్‌. ఏమైనా ఉద్యోగం అదీ చూడమంటావా?’ అన్న లెవల్లో మనం అంటేనే మన గొప్పలు పదికాలాల పాటు గొప్పింటి సౌధంలో ఉంటాయి.

- రావులపాటి సీతారాంరావు, ఐపీఎస్​ (రిటైర్డ్​)