ఎక్కువ మంది పిల్లల్ని కంటే రూ. లక్ష సాయం

ఎక్కువ మంది పిల్లల్ని కంటే రూ. లక్ష సాయం
  • జనాభా పెరుగుదలే లక్ష్యంగా ప్రకటన
  • ఫాదర్స్ డే సందర్భంగా మిజోరాం మంత్రి రాబర్ట్ రోమావియా రాయ్టే 

ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న, జన్మనిచ్చే తల్లిదండ్రులకు రూ. లక్ష ఆర్థికసాయం ఇస్తామని మిజోరాం మంత్రి రాబర్ట్ రోమావియా రాయ్టే ప్రకటించారు. జనాభాపరంగా చిన్న రాష్ట్రమైన మిజోరాంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికే ఈ ప్రకటన చేసినట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ ఆఫర్‌ను అందుకోవడానికి ఉండాల్సిన కనీస పిల్లల సంఖ్యను ఆయన ప్రస్తావించలేదు. భారత్‌లో అనేక రాష్ట్రాలు జనాభా నియంత్రణను అవలంభిస్తోన్న ఈ సమయంలో ఇటువంటి ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా.. మంత్రి రాయ్టే తన ఐజాల్ ఈస్ట్ -2 అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. అత్యధిక సంతానం కలిగి ఉన్న తల్లిదండ్రులకు రూ. లక్ష నగదు ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా.. ఆ తల్లిదండ్రులకు సర్టిఫికెట్‌తో పాటు ట్రోఫీ కూడా అందిస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రోత్సాహక ఖర్చును తన కొడుకు యజమానిగా ఉన్న నిర్మాణ రంగ సంస్థ భరిస్తుందని మంత్రి చెప్పారు.

మిజోరాం జనాభా యొక్క వంధ్యత్వ రేటు మరియు తగ్గుతున్న వృద్ధి రేటు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మంత్రి అన్నారు. ‘మిజోరాం జన సంఖ్య క్రమంగా క్షీణించినందున వివిధ రంగాలలో అభివృద్ధి సాధించలేకపోతున్నాం. ఇక్కడ జనాభా సంఖ్య చాలా తక్కువగా ఉంది. తక్కువ జనాభా అనేది తీవ్రమైన సమస్య. ఇది చిన్న రాష్ట్రాల మనుగడ మరియు పురోగతికి అడ్డంకి. కొన్ని చర్చిలు మరియు యంగ్ మిజో అసోసియేషన్ వంటి ప్రభావవంతమైన సంస్థలు రాష్ట్రంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి బేబీ బూమ్ విధానాన్ని సమర్థిస్తున్నాయి’ అని రాయ్టే అన్నారు. 

మిజోరాంలో 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 1,091,014. ఆ రాష్ట్రం సుమారు 21,087 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ చదరపు కిలోమీటరుకు 52 మంది మాత్రమే జనాభా ఉంది. మిజోరాం పక్క రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌ అతి తక్కువ జన సాంద్రతను కలిగి ఉంది. అక్కడ చదరపు కిలోమీటరుకు 17 మంది ఉంటున్నారు. జాతీయ లెక్కల ప్రకారం చదరపు కిలోమీటరుకు సగటున 382 మంది ఉండాలి.

ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఇటీవల ప్రకటించారు. జనవరి 2021 నుంచి ఇద్దరు పిల్లలకు పైగా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కాదని రాష్ట్ర పరిపాలన నిర్ణయించింది. అదేవిధంగా అస్సాం కూడా పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండరాదనే నియమాన్ని తీసుకొచ్చింది. ఉత్తర ప్రదేశ్ లా కమిషన్ చైర్మన్ ఆదిత్య నాథ్ మిట్టల్ ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో జనాభా పెరుగుదలకు చెక్ పెట్టాలని అన్నారు.