వాళ్లకెన్ని? మనకెన్ని?..పోలింగ్​ లెక్కల్లో బిజీగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు

వాళ్లకెన్ని? మనకెన్ని?..పోలింగ్​ లెక్కల్లో బిజీగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు
  • జిల్లా హెడ్​ క్వార్టర్లలో అపోజిషన్​ పార్టీలకు లీడ్​ వచ్చే అవకాశం
  • జడ్చర్లలో మినహా మిగతా చోట్ల తగ్గిన పోల్​ పర్సంటేజీ

మహబూబ్​నగర్​, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్  ముగియడంతో ఎమ్మెల్యే క్యాండిడేట్లు నియోజకవర్గాల వారీగా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఏ మండలం నుంచి ఎన్ని ఓట్లు పోల్​ అయ్యాయనే విషయంపై ఆ మండల లీడర్లను పిలిపించుకొని చర్చిస్తున్నారు. నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలపై ఆరా తీస్తున్నారు. దీనికితోడు 2018 ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్​ పర్సంటేజీ 3 నుంచి 4 శాతానికి పడిపోవడానికి కారణాలేంటనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు.

తక్కువ మెజార్టీనే..

ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ(నాగర్​కర్నూల్​ మినహా) నుంచి క్యాండిడేట్లు పోటీ చేయగా, మెజార్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ వర్సెస్​ బీఆర్ఎస్​గా, కాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీగా వార్​ నడిచింది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఓటర్లు అపోజిషన్​ పార్టీల వైపు మొగ్గు చూపారనే విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాలు, మున్సిపాల్టీల్లో బీఆర్ఎస్​కు ఓటింగ్​ శాతం తగ్గిందనే చర్చ  జరుగుతోంది. బీఆర్ఎస్​కు మూడు, నాలుగు గ్రామాల్లో వన్​సైడ్​గా ఓట్లు పడితే, కొన్ని చోట్ల కాంగ్రెస్​కు వన్​సైడ్​గా లీడ్ వస్తుందని, మిగిలిన చోట్ల ఫిఫ్టీ ఫిఫ్టీగా ఓట్లు పోల్​ అయ్యాయనే గ్రౌండ్​ రిపోర్ట్​ బయటకు వస్తోంది.

మహబూబ్​నగర్, నారాయణపేట, దేవరకద్ర, నాగర్​కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో టఫ్​ ఫైట్​ నడవగా, ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచినా 3 వేల నుంచి 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారనే చర్చలు నడుస్తున్నాయి. జడ్చర్ల, మక్తల్, అచ్చంపేట​సెగ్మెంట్లలో అపోజిషన్​లోని ఒకే పార్టీకి చెందిన క్యాండిడేట్లకు 15 వేల నుంచి 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్​ వర్గాలు ఇచ్చిన సర్వే రిపోర్టులో ఉన్నట్లు తెలిసింది. కల్వకుర్తిలో రెండు అపోజిషన్​ పార్టీల మధ్యే వార్​ నడిచినట్లు వార్తలొస్తుండగా, గద్వాల, అలంపూర్​లో బీఆర్ఎస్,​ కాంగ్రెస్​ మధ్య పోటీ జరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

షాడో ఎమ్మెల్యేల తీరుతో..

ఈ ఎన్నికల్లో మార్పు కోసం ఓటర్లు తీర్పు ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయం ఆదివారం తేలనుంది. ఎన్నికల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతో పాటు ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల అహంకార ధోరణి కొంప ముంచినట్లు సమాచారం. దీనికితోడు షాడో ఎమ్మెల్యేల తీరుతో అటు బీఆర్ఎస్​ పార్టీకి, ఇటు క్యాండిడేట్లకు ఎఫెక్ట్​ పడిందని అంటున్నారు. వీరి అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, ల్యాండ్​ సెటిల్మెంట్లు, ఇసుక అక్రమ రవాణా, నల్ల మట్టి దందా, బెదిరింపులు, దౌర్జన్యాలు తదితర కారణాలతో ప్రజలు విసిగిపోయి భిన్నమైన తీర్పు ఇవ్వడానికి అపోజిషన్​ పార్టీల వైపు మొగ్గు చూపారని రాజకీయ విశ్లేషణలు పేర్కొంటున్నారు. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయాక కొందరు క్యాండిడేట్లు షాడోలను పిలిపించుకొని క్లాస్​ తీసుకోవడం, మీ వల్లే ఇలా జరిగిందనే ఫ్రస్టేషన్​లో టీవీలు, సెల్​ఫోన్​లు పగులగొట్టారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తగ్గిన పోలింగ్​ శాతం..

2018 ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్​ శాతం తగ్గిపోయింది. జడ్చర్లలో మాత్రమే గత ఎన్నికల్లో 82.32 శాతం ఓట్లు పోల్​ కాగా.. ఈ ఎన్నికల్లో 4.78 శాతం పెరిగి 87.81 శాతం ఓట్లు పోల్​ అయ్యాయి. నారాయణపేటలో గతంలో 79,67 శాతం ఓట్లు పోల్​ కాగా, ఈసారి 1.17 శాతం పోలింగ్​ పర్సంటేజ్​ తగ్గి 78.50 శాతంగా నమోదైంది. మహబూబ్​నగర్​లో గతంలో 74.93 శాతం ఓట్లు పోల్  కాగా ఈసారి 4.52 శాతం తగ్గి 70.41 శాతం ఓట్లు పోల్​ అయ్యాయి. దేవరకద్రలో గతంలో 85.11 శాతం కాగా, ఈసారి 2.78 శాతం తగ్గి 82.33 శాతంగా నమోదైంది. మక్తల్​లో గతంలో 77.77 శాతం కాగా, ఈసారి అత్యధికంగా 8.65 శాతం తగ్గి 69.12 శాతంగా రికార్డైంది. వనపర్తిలో గతంలో 81.40 శాతం కాగా, ఈసారి3.86 శాతం తగ్గి 77.54 శాతంగా నమోదైంది.

గద్వాలలో గతంలో 83.94 శాతం కాగా, ఈ సారి 1.52 శాతం తగ్గి 82.42 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అలంపూర్​లో గతంలో 82.66 శాతం కాగా, ఈ సారి 2.86 శాతం తగ్గి 79.80 శాతంగా రికార్డైంది. నాగర్​కర్నూల్​లో గతంలో 83.21 శాతం కాగా, ఈసారి 4.7 శాతం ఓట్లు తగ్గి 78.50 శాతంగా నమోదైంది. అచ్చంపేటలో గతంలో 81.85 శాతం కాగా, ఈసారి 1.88 శాతం తగ్గి 79.97 శాతం ఓట్లు పోలయ్యాయి. కల్వకుర్తిలో గతంలో 87.21 శాతం కాగా, ఈసారి 4.01శాతం తగ్గి 83.20 శాతం నమోదైంది. కొల్లాపూర్​లో గతంలో 83.71 శాతం ఓట్లు పోల్​ కాగా, ఈసారి 3.85 శాతం తగ్గి 79.86 శాతం ఓట్లు పోలింగ్​ నమోదైంది.

నిరుత్సాహంలో బీఆర్ఎస్​ క్యాడర్..​

గురువారం పోలింగ్​ ముగిసిన తరువాత ఎగ్జిట్​ పోల్​​సర్వేలు బయటకు వచ్చాయి. ఈ సర్వేల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్​కు వస్తాయని చూపించాయి. అయితే, రూలింగ్​ పార్టీకి అసెంబ్లీలో సీట్లు తగ్గిపోతున్నాయని రిపోర్టులు రావడంతో, ఆ పార్టీ లీడర్లలో జోష్​ కనిపించడం లేదు. పోలింగ్​ ముగిశాక ఎవరూ బయట కనిపించడం లేదు. అందరూ నిరుత్సాహంలో ముగినిపోయారు. కాంగ్రెస్​ క్యాడర్​ ఫుల్​ జోష్​లో తిరుగుతున్నారు. పటు చోట్ల పటాకులు కాల్చారు. అలాగే ఆదివారం ఎలక్షన్​ రిజల్ట్స్​ వెలువడనుండటంతో జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా ఎవరూ గెలుస్తారు? ఎక్కువ స్థానాలను ఏ పార్టీ చేజిక్కుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? అనే దానిపై జోరుగా బెట్టింగ్​లు స్టార్ట్ అయ్యాయి.