
- జెండాలను పక్కనపెట్టి ఎజెండా కోసం పని చేద్దాం
- ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వారావుపేట, వెలుగు: నూతనంగా ఏర్పడిన అశ్వారావుపేట మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. సోమవారం పట్టణంలోని సత్యసాయి బాబా కల్యాణ మండపంలో మున్సిపాలిటీ అభివృద్ధి పనులు, వార్డులపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేటను మున్సిపాలిటీలో16, 724 ఓట్లతో 22 వార్డులను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టునున్నామని తెలిపారు. వార్డుల విభజనలో తప్పులు ఏమైనా జరిగి ఉంటే వాటిని సమీక్షించుకొని ఈనెల 12నాటికి తుది నిర్ణయం ప్రకటించాలన్నారు. 911 సర్వే నెంబర్ లో ఐటీఐ కాలేజీని తీసుకువస్తున్నామన్నారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా సంపులను ఏర్పాట్టు చేస్తున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం రోడ్డులో రూ.5.70 కోట్లతో మినీ స్టేడియం పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. పేటలో ఎకో పార్కు కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి 5 ఎకరాల భూమిని తీసుకున్నామని, రూ.4.30 కోట్లతో త్వరలోపనులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.
నియోజకవర్గ వ్యాప్తంగా 8 ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, స్పెషల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, తహసీల్దార్ రామకృష్ణ, సీఐ పింగళి నాగరాజు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, నాయకులు జూపల్లి రమేశ్, జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, సూర్య ప్రకాశ్‌రావు, సుంకవల్లి వీరభద్రరావు, చెన్నకేశవరావు, డేగల రామచంద్రరావు, చిన్నంశెట్టి సత్యనారాయణ, సలీం, కట్రం స్వామి, మెట్టా వెంకటేష్, తుమ్మా రాంబాబు, అల్లాడి వెంకట రామారావు, మిండా హరిబాబు తదితరులు
పాల్గొన్నారు.