పైరవీలకు తావు లేకుండా ..పేదలకు ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

పైరవీలకు తావు లేకుండా ..పేదలకు ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చౌటుప్పల్, వెలుగు : ఎలాంటి పైరవీలకు తావు లేకుండా అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలోని ఫంక్షన్ హాల్ లో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 1400 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లడుతూ నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ఆలస్యమైనా విడతలవారీగా అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించే బాధ్యత తమపై ఉందన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి స్టీలు, సిమెంట్ యాజమాన్యంతో మాట్లాడి తక్కువ ధరకు ఇచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ మొదటి విడతలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటి పత్రాలు ఇస్తున్నట్లు తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.