హాలియా, వెలుగు : గతంలో కొండగట్టు గుట్టల్లో భారీ ప్రమాదం జరిగితే స్పందించని బీఆర్ఎస్ నాయకులు.. కోతులు చనిపోతే రాజకీయం చేయడం సిగ్గుచేటని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్ లో వాటర్ట్యాంకులో పడి కోతులు చనిపోయిన ప్రదేశాన్ని గురువారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవిలో కోతులు తాగునీటి కోసం ప్రమాదవశాత్తు వాటర్ట్యాంకులో పడి చనిపోవడం బాధాకమన్నారు. బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదన్నారు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తే ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.