మాజీ మంత్రి అవినీతిపై ఈడీకి ఫిర్యాదు చేస్తా : మేఘారెడ్డి

మాజీ మంత్రి అవినీతిపై ఈడీకి ఫిర్యాదు చేస్తా : మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: బీఆర్ఎస్  సర్కార్​ హయాంలో వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో జరిగిన అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేశామని, అలాగే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమాస్తులపై ఈడీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్పారు. ఆదివారం పట్టణంలోని క్యాంప్​ ఆఫీస్​లో పూజలు చేసి గృహప్రవేశం చేశారు.

వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అగ్రికల్చర్​ ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు చదువు లేదని, తనకు ఏమాత్రం సరిపోడని తనను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యంతో ఆయన అహంకారాన్ని ఓడించారన్నారు.

తొమ్మిదేండ్లలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అభివృద్ధి పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పారు. వనపర్తి మున్సిపాలిటీ నిధులను పక్కదారి పట్టించారని, చెరువుల అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. మాజీ మంత్రిని వదిలే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్  అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వచ్చాక, సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఆర్బాటం లేకుండా పాలన చేస్తున్నారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి ఆరు గ్యారంటీలను అమలు చేస్తారని చెప్పారు.

అనంతరం వనపర్తి లోని బాయ్స్​హైస్కూల్ గ్రౌండ్​లో క్రీడా పోటీలను ప్రారంభించారు. కౌన్సిలర్లు బ్రహ్మం ఆచారి, సత్యం సాగర్, నాయకులు శంకర్ ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, సతీశ్​కుమార్, తిరుపతయ్య పాల్గొన్నారు.