ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

జగిత్యాల, వెలుగు : రోళ్లవాగు నుంచి యాసంగికి నీళ్లు విడుదల చేయాలని బీర్పూర్ లో ధర్నా చేయడంతోనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రాజెక్టును సందర్శించారని బీజేపీ నియోజకవర్గ లీడర్, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి అన్నారు. ఆదివారం బీర్పూర్ మండలకేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రోళ్లవాగు కట్ట తెగడం  మానవ తప్పిదమేనన్నారు. వాగు మత్తడి నిర్మాణంలో నాణ్యత పాటించి ఉన్నట్లయితే నేడు గండి పెట్టాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. రైతులకు కేంద్రం ఏం చేసిందని ఎమ్మెల్యే ప్రశ్నించారని.. వాగు కింద ఉన్న అరగుండాల ప్రాజెక్టును కేంద్ర నిధులతో విద్యాసాగర్ రావు కట్టించారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ బీర్పూర్ మండలాధ్యక్షులు మ్యాడ జనార్దన్, జిల్లా కార్యవర్గ సభ్యులు రఘువీర్ రెడ్డి, నాయకులు 
పాల్గొన్నారు.

‘యువజన సమ్మేళనం విజయవంతం చేయాలి’

కరీంనగర్ టౌన్, వెలుగు: నవంబర్​23న కరీంనగర్ లో నిర్వహించే యువజన సమ్మేళనం విజయవంతం చేయాలని నైజాం విముక్త స్వాతంత్ర అమృత మహోత్సవాల రాష్ట్ర బాధ్యుడు కె. భాగ్యరెడ్డి పిలుపునిచ్చారు.  ఆదివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మానేర్ విద్యాసంస్థల అధినేత అనంతరెడ్డితో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైజాం పాలన నుంచి రాష్ట్రం విముక్తి పొంది 75 ఏళ్లయ్యిందన్నారు. ఈ చరిత్రను యువతకు తెలియజేయడం కోసమే సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఏ నిరంజనాచారి, మధుసూదన్ రావు, మల్లేశం, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా లక్ష దీపోత్సవం

కరీంనగర్​ రూరల్, వెలుగు :కార్తీక మాసంలో భాగంగా ఆదివారం కరీంనగర్‌‌ మండలం నగునూర్‌‌ దుర్గాభవానీ ఆలయంలో కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి దీపాసంకల్పం, దీపారాధన, మహామంగళ హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఏకాదశి సంద
ర్భంగా ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో సుందరేశ్వర స్వామికి ఫలపూజ చేశారు. శివాలయం ముందు, అమ్మవారి ఆలయంలోని ధ్వజ స్తంభం వద్ద భక్తులు దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. సుహాసిని సేవాదళ్, గోవిందాపతి శ్రీవారి సేవ సభ్యులు అలయ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పవనకృష్ణ, ఆలయ ఫౌండర్‌‌ వంగల లక్ష్మన్, ఆలయ కమిటీ బాధ్యులు వేములవాడ ద్రోణాచారి, నీరుమల్ల తిరుపతి, మున్సిపల్‌‌ కార్పొరేటర్‌‌ శ్రీదేవి, భక్తులు పాల్గొన్నారు. 

ప్రజలకు అందుబాటులో గ్రీన్​ హోమ్స్​

సందడి చేసిన నటి ఇంద్రజ 

జమ్మికుంట, వెలుగు: అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం లక్ష్మీ గణపతి కన్​స్ట్రక్షన్స్ బృందం ఇళ్లు నిర్మిస్తోందని రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్​అన్నారు. జమ్మికుంట పట్టణంలో ఆదివారం సుమారు 20ఎకరాల విస్తీర్ణంలో 155 ఇళ్లను నిర్మిస్తున్న ఆదిత్య గ్రీన్ హోమ్ టౌన్ షిప్ నకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, సినీ నటి ఇంద్రజతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ జనాభా త్వరలో  లక్ష దాటుతుందన్నారు. జమ్మికుంట, హుజూరాబాద్​ జంట నగరాలుగా కలిసిపోతాయన్నారు. అంతకుముందు ఇంద్రజతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఇంద్రజ పలువురితో సెల్ఫీలు దిగి అలరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్​విజయ, మున్సిపల్ చైర్మన్​రాజేశ్వర్​రావు, సింగిల్ విండో చైర్మన్​ సంపత్, లీడర్లు పాల్గొన్నారు. 

డిమాండ్‌‌‌‌కు తగ్గట్టుగా బొగ్గు రవాణా

గోదావరిఖని, వెలుగు : డిమాండ్‌‌‌‌కు తగినట్టుగా సింగరేణి నుంచి బొగ్గు రవాణా చేయాలని రైల్వే బోర్డు(కోల్‌‌‌‌) ఎగ్జిక్యూటివ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ అవినాశ్ కుమార్‌‌‌‌ సింగరేణి ఆఫీసర్లను కోరారు. ఆదివారం ఆయన ఆర్జీ 1, ఆర్జీ 2 ఏరియాలలో పర్యటించారు. ఆర్జీ 1 ఏరియాలోని సీహెచ్‌‌‌‌పీని సందర్శించగా ఏరియా జీఎం కె.నారాయణ స్థానిక గెస్ట్‌‌‌‌హౌస్‌‌‌‌లో స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఆర్జీ 2 ఏరియాలోని సీహెచ్‌‌‌‌పీని సందర్శించి బొగ్గు రవాణా పనితీరును పరిశీలించారు. బొగ్గు రవాణా కోసం సమయానికి రైల్వే వ్యాగన్లు అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఇందుకోసం రైల్వే ట్రాక్‌‌‌‌ లేఅవుట్‌‌‌‌లో మార్పులు చేయాలన్నారు. భవిష్యత్​లో బొగ్గు అవసరాల దృష్యా ఓసీపీ-3 సీహెచ్‌‌‌‌పీలో నిర్మిస్తున్న అధునాతన సైలో బంకర్ నిర్మాణం పనులను సర్వే మ్యాప్ ద్వారా పరిశీలించారు. కార్యక్రమంలో సౌత్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ రైల్వే ఏఓఎం శుభం జైన్‌‌‌‌, ఎన్టీపీసీ(ఎఫ్‌‌‌‌ఎం) జీఎం థామస్‌‌‌‌, ఏజీఎంలు ముఖర్జీ, హిమంత్‌‌‌‌ షిండే, ఆఫీసర్లు పాల్గొన్నారు. 

‘బీజేపీ భరోసా’ను సక్సెస్​ చేయాలి 

బోయినిపల్లి, వెలుగు: మండలం కేంద్రంలో నవంబర్​30న నిర్వహించే ‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ చొప్పదండి నియోజకవర్గ కన్వీనర్ పెరుక శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం బోయినిపల్లిలో మండలాధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాత్రలో భాగంగా మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని అన్నారు. 

సెస్ డైరెక్టర్ ఎన్నికల్లో పోటీ..

డిసెంబర్​లో సెస్ పాలకవర్గానికి జరిగే ఎన్నికల్లో బోయినిపల్లి డైరెక్టర్ పదవికి బీజేపీ అభ్యర్థిగా ఏనుగుల కనుకయ్య పోటీ చేస్తారని పార్టీ మండలాధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈమేరకు కనుకయ్య పేరును ఆయన ప్రతిపాదించారు. గత పాలకవర్గంలో కనుకయ్య భార్య లక్ష్మి సెస్ డైరెక్టర్ గా గెలుపొందారు. కార్యక్రమంలో కో కన్వీనర్ నర్సింహాచారి, మహేశ్​కృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

చందుర్తి, రుద్రంగిని సస్యశ్యామలం చేశాం

చందుర్తి, వెలుగు: రుద్రంగి, చందుర్తి మండలాలను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేశామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​బాబు అన్నారు. ఆదివారం రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో కరువుతో తినడానికి తిండి లేని పరిస్థితి ఉండేదని ఇప్పుడు వడ్లు ఆరబోయడానికి స్థలం కూడా లేనంతగా వరి పండుతోందన్నారు. వడ్ల కొనుగోల్లలో కేంద్రం అనుసరిస్తున్న తీరు సరికాదని, కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొంటుందని అన్నారు. అనంతరం రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, పాలకవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణ, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ బాపురెడ్డి, జడ్పీటీసీ మెంబర్లు కుమార్, మీనయ్య ఎంపీపీలు లావణ్య, స్వరూప, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ ఎల్లయ్య పాల్గొన్నారు. 

కంటి, షుగర్‌‌‌‌ పరీక్షల సెంటర్‌‌‌‌ ప్రారంభం

గోదావరిఖని, వెలుగు: రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని లయన్స్ భవన్‌‌‌‌లో ఉచిత కంటి, షుగర్ పరీక్షల విజన్ సెంటర్ ప్రారంభించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కె.రాజేందర్, సెక్రటరీ పి.మల్లికార్జున్, ట్రెజరర్ వి.ఎల్లప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్లబ్‌‌‌‌ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్లు మీనేశ్​ నారాయణ్ టండన్, ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజన్ సెంటర్లలో ఉచిత కంటి వైద్య పరీక్షలు, షుగర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు ఫ్రీగా చేస్తామన్నారు. సహకరించిన దాతలు లయన్ రాజేశ్వర్ రావు, రమాపతిరావును అభినందించారు. కార్యక్రమంలో సభ్యులు ఎం.గంగాధర్, బి.రామస్వామి, బి.రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.