
- ఆయన కృషితోనే సింగరేణి కార్మికులకు పెన్షన్
- ఇప్పుడు ఆ పెన్షన్ పెంపు కోసం ఎంపీ వంశీకృష్ణ పోరాడుతున్నారని వెల్లడి
- కాకా మెమోరియల్ తరఫున 26 మందికి శ్రమశక్తి అవార్డులు ప్రదానం
హైదరాబాద్, వెలుగు: కార్మికుల హక్కుల కోసం కాకా వెంకటస్వామి జీవితాంతం పోరాడారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆనాడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఆయన చేసిన కృషితోనే సింగరేణి కార్మికులకు పెన్షన్ సౌకర్యం లభించిందని గుర్తుచేశారు. గురువారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై కాకా విగ్రహం వద్ద ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మే డే వేడుకల్లో వివేక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాకా మెమోరియల్ తరఫున 26 మందికి శ్రమశక్తి అవార్డులు అందజేశారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ.. ‘‘కాకా కార్మిక శాఖ మంత్రిగా ఉన్న టైమ్‌లో కోల్ మైనర్స్ ఫెన్షన్ ఫండ్ (సీఎంపీఎఫ్) కోసం కృషి చేశారు. ఆయన కృషి వల్లే సింగరేణి కార్మికులకు పెన్షన్ కల సాకారమైంది. ఇప్పుడు ఆ పెన్షన్ఫండ్పెంపు కోసం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సింగరేణి యాజమాన్యం ఇటీవల పెన్షన్ఫండ్ రూ.140 కోట్లు పెంచింది’’అని తెలిపారు. ‘‘ఐడీపీఎల్‌లో కార్మికులు 55 రోజుల పాటు సమ్మె చేస్తే, కాకా అక్కడికి వెళ్లి యాజమాన్యంతో చర్చించి కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేలా చూశారు.
అసంఘటిత కార్మికులకు పీఎఫ్, పెన్షన్ కోసం కాకా ఎంతో కృషి చేశారు. ఇందుకోసం కేబినెట్ తీర్మానం కూడా ఆయనే పాస్ చేయించారు” అని పేర్కొన్నారు. కంపెనీల్లోఉత్పత్తి పెరగాలంటే కార్మికులను యాజమాన్యాలు బాగా చూసుకోవాలని సూచించారు. కార్మికుల సంక్షేమం కోసం ఐఎన్టీయూసీ నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి, స్టేట్ లీడర్ దయానంద్ ఎంతో కృషి చేశారన్నారు. మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నోళ్లను ఆదుకునే వ్యక్తిత్వం వివేక్‌వెంకటస్వామి సొంతమని, అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు ఆయన ఆర్థికసాయం అందజేస్తున్నారని కొనియాడారు.