ఎమ్మెల్సీ చూపు ఎటువైపు .. రెండు పార్టీల క్యాడర్‌‌‌‌లోనూ కన్‌‌ఫ్యూజన్‌‌ 

ఎమ్మెల్సీ చూపు ఎటువైపు .. రెండు పార్టీల క్యాడర్‌‌‌‌లోనూ కన్‌‌ఫ్యూజన్‌‌ 
  • బీఆర్ఎస్​ పార్టీ వ్యవహారాలకు దూరంగా భానుప్రసాదరావు
  • కాంగ్రెస్​ లీడర్లతో చెట్టాపట్టాల్​
  • అసెంబ్లీ ఎన్నికలకు ముందే అనుచరులంతా కాంగ్రెస్‌‌లోకి 
  • ఎమ్మెల్సీ నిర్ణయం కోసం మరికొందరు వెయిటింగ్​ 

పెద్దపల్లి, వెలుగు: మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్‌‌ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు చూపు ఎటువైపు అన్నది తెలియక సొంతపార్టీతోపాటు కాంగ్రెస్‌‌ క్యాడర్‌‌‌‌లోనూ కన్‌‌ఫ్యూజన్‌‌ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్​ పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్సీ దూరంగా ఉంటున్నట్లు చర్చ జరిగింది. అలాగే ఎన్నికల ముందు పెద్దపల్లిలోని తన అనుచరులు కొందరు బీఆర్ఎస్‌‌కు రిజైన్​ చేసి కాంగ్రెస్‌‌లో చేరారు. భానుప్రసాదరావు సూచన మేరకే ఆనాడు అనుచరులు పార్టీ మారినట్లు ప్రచారం జరిగింది.  

అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార పార్టీతో.. 

కాగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో ప్రొటోకాల్​ ప్రకారం.. స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు పాల్గొన్నారు. కానీ ఈ కార్యక్రమాల్లో సరదాగా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం వారి సాన్నిహిత్యంపై పార్టీతోపాటు క్యాడర్‌‌‌‌లోనూ చర్చ నడిచింది.

ఇటీవల పెద్దపల్లిలో నిర్వహించిన ఇఫ్తార్‌‌‌‌ విందులో కూడా ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు. మరోవైపు పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్​ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్​ మూడు రోజుల కింద జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో రైతు దీక్ష చేశారు. దానికి భానుప్రసాదరావు హాజరుకాలేదు. దీంతో త్వరలోనే ఆయన కాంగ్రెస్​ గూటికి చేరవచ్చనే అనుమానాలు క్యాడర్‌‌‌‌లో వ్యక్తమవుతున్నాయి.

గతంలో భానుప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌‌‌‌రెడ్డి ఒకే వేదికపై ఐక్యంగా ఉన్నట్లు ఏనాడూ వ్యవహరించలేదు. ఎప్పుడూ ఉప్పు, నిప్పులాగానే కన్పించేవారు. కానీ కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే విజయరమణారావుతో ఎమ్మెల్సీ వ్యవహారంపై క్యాడర్‌‌‌‌లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆయన అనుచరుల్లో చాలామంది అధికార పార్టీలోకి వెళ్లగా మరికొంతమంది భానుప్రసాదరావు నిర్ణయం కోసం వెయిట్‌‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్‌‌ నేపథ్యంపై జోరుగా చర్చ 

ఉమ్మడి రాష్ట్రంలో భానుప్రసాదరావు ఎమ్మెల్సీగా ఉన్నారు. అనంతరం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్‌‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌‌లో చేరడంతో ఆయనకు రెండు సార్లు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. దీంతో ఆయన వరుసగా మూడు సార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్‌‌ నుంచి  అధికార పార్టీలోకి వలసలు పెరిగాయి. ఈక్రమంలో భానుప్రసాదరావుకు కాంగ్రెస్‌‌ నేపథ్యం ఉండడంతో ఆయన కూడా పార్టీ మారుతారన్న ప్రచారం నడుస్తోంది.