నా విజయానికి తాటికొండ సహకరిస్తారని నమ్ముతున్న : కడియం

నా విజయానికి తాటికొండ సహకరిస్తారని నమ్ముతున్న : కడియం

జనగామ జిల్లా : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ప్రజలు కేసీఆర్ నాయకత్వం పట్ల విశ్వాసంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. తాను స్టేషన్ ఘనపూర్ నుంచి ఎమ్మె్ల్యేగా విజయం సాధించేందుకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర మంత్రుల సహకారం తీసుకుంటానని చెప్పారు. 

ALSO READ : కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?..!

తమ మధ్య (తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి) చిన్న చిన్న విషయాలు ఉన్నాయని, అవి కూడా త్వరలోనే సద్దుమణుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు కడియం శ్రీహరి. 2014, 2018లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచేందుకు తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. రెండు సార్లు కూడా రాజయ్య విజయానికి తాము కృషి చేశామన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తన విజయానికి కూడా ఎమ్మెల్యే రాజయ్య సహకారం అందిస్తారని నమ్ముతున్నానని అన్నారు.

రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు కడియం శ్రీహరి. తనకు వ్యక్తిగత ఎజెండా లేదని, ప్రజల అభివృద్దే తన ఎజెండా అని చెప్పారు. వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చానన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రోడ్ల నిర్మాణం కోసం రూ.19 కోట్లు మంజూరు చేయించానన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో గిరిజనులకు పెద్దపీట వేశారని చెప్పారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వ్యాప్తంగా రూ.65 కోట్ల విలువైన పనులకు నిధులు మంజూరు చేయించానని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పూర్తిగా పడిపోయిన బీజేపీ... సింగిల్ డిజిట్ కే పరిమితమైందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో నాయకులను బుజ్జగింపులకే సమయం సరిపోతలేదని సెటైర్ వేశారు.