ఓటుకు పది వేలిచ్చి తండ్రిని గెలిపించుకుండు : ఎమ్మెల్సీ కవిత

ఓటుకు పది వేలిచ్చి తండ్రిని గెలిపించుకుండు : ఎమ్మెల్సీ కవిత
  • మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత 

సూర్యాపేట/హుజుర్ నగర్ :  హారీష్​రావు, జగదీశ్  రెడ్డి పైన వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని, అవినీతి పరులను మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.  ఓటుకు పది వేలు ఇచ్చి తండ్రిని సర్పంచ్ గా గెలిపించుకుండని మాజీ మంత్రి ఎమ్మెల్సీ  జగదీష్​ రెడ్డి పైన మండిపడ్డారు. ఆదివారం హుజూర్ నగర్ లో బీఆర్‌‌‌‌ అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  మంత్రి ఉత్తమ్, జగదీశ్ రెడ్డి ఇద్దరు మంచి స్నేహితులని అందుకే సూర్యాపేటలో ఎలాంటి అక్రమాలు జరిగినా ఉత్తమ్​ స్పందించడని కవిత ఆరోపించారు.  జగదీశ్ రెడ్డి అనుచరులు నూతన కలెక్టరే సమీపంలోని కర్నాల చెరువు అలుగుపై అక్రమంగా రోడ్డు వేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ అక్రమాలపై ప్రభుత్వం తీసుకునే చర్యలను బట్టే ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ బయటపడుతుందని వ్యాఖ్యానించారు.  ప్రభుత్వ వైద్య కళాశాలలో 350 మంది ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా కేవలం 150 మందే ఉన్నారన్నారు.  జగదీశ్ రెడ్డి దత్తత గ్రామం పెన్ పహాడ్ మండలం చీదెళ్లకు రోడ్ల మరమ్మతు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

మట్టపల్లి కృష్ణానది కలుషితానికి ఫార్మా కంపెనీలే కారణం

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మట్టపల్లి వద్ద కృష్ణానదిలో వ్యర్థాలను వదిలి కలుషితం చేసింది ఫార్మా, కెమికల్స్ కంపెనీలేనని కవిత ఆరోపించారు.  దీంతో  వందల సంఖ్యలో గ్రామాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోయిందన్నారు.  గతంలో గృహ నిర్మాణ శాఖామంత్రిగా పనిచేసిన మంత్రి ఉత్తమ్ ఆనాడు ప్రారంభించి నిర్మించిన గృహాలను ఇప్పటివరకు పేదలకు అందించలేదని విమర్శించారు. నియోజకవర్గంలో 54 లిఫ్టులు ఉన్నాయని వాటన్నిటిని వాడుకలోకి తీసుకురాకుండానే కొత్త లిఫ్ట్ ల నిర్మాణం ఎందుకని ప్రశ్నించారు.   

రాజేశ్ మృతి పై సమగ్ర విచారణ జరపాలి

సూర్యాపేట, కోదాడ/ వెలుగు:  సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతి విషయంలో ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, అతడి మృతికి కారణమైన ఎస్ ఐ ను సస్పెండ్ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆమె ఆదివారం కోదాడ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కర్ల రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. 

రాజేష్ కస్టోడియల్ డెత్ విషయంలో అగ్రవర్ణానికి చెందిన ఎస్ఐ ని కాపాడి బీసీ బిడ్డ అయిన సీఐని బలి చేశారని ఆమె ఆరోపించారు. రాజేశ్ పోస్ట్ మార్టం సహా అనేక అంశాలపై అనుమానాలు ఉన్నాయన్నారు. రాజేశ్ మృతి పై స్థానిక ఎమ్మెల్యే పద్మావతి సరైన రీతిలో స్పందించలేదని, ఎమ్మెల్యే మాట్లాడకపోవటం ఏమిటన్నారు. ఈ విషయంలో జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన పై సమగ్ర విచారణ జరపాలని,  ఎస్ఐని సస్పెండ్ చేయాలన్నారు.