మూడు రాష్ట్రాలపైనే మోడీ, అమిత్ షా ఫోకస్

మూడు రాష్ట్రాలపైనే మోడీ, అమిత్ షా ఫోకస్

ఎగ్జిట్ పోల్స్‌‌‌‌లో ఎన్డీయే దూకుడుకు రకరకాల విశ్లేషణలు బయటకొస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌‌‌‌ షా, ప్రధాని నరేంద్ర మోడీ సెలెక్టివ్ గా కొన్ని రాష్ట్రాల్లో స్పెషల్ ఫోకస్ పెట్టడమే ప్రధాన కారణమని  తాజాగా తెర మీదకు వచ్చింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలపై మోడీ–షా జోడి ప్రత్యేకంగా  దృష్టి పెట్టిందని పోల్‌‌‌‌ ఎనలిస్టులు చెప్పారు. 2014 ఎలక్షన్స్‌‌‌‌లో బీజేపీ సొంతంగా యూపీలోని 80 సీట్లలో 71 సీట్లు గెలుచుకుంది. ఈసారి బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయడానికి అఖిలేశ్ యాదవ్, మాయావతి నాయకత్వంలోఓ బలమైన కూటమి ఏర్పడింది. మొదట్లో కేవలం సమాజ్‌‌‌‌వాది పార్టీ, బహుజన్ సమాజ్‌‌‌‌పార్టీలే ఇందులో ఉన్నాయి. తర్వాత పశ్చిమ యూపీలోని జాట్ వర్గానికి ప్రాతినిధ్యం వహించే  రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) కూడా ఈ కూటమిలో చేరింది. కాంగ్రెస్‌‌‌‌ని ఈ కూటమి దగ్గరకు రానివ్వలేదు.  యూపీలో ఎవరెన్ని కబుర్లు చెప్పినా కులాల లెక్కలే కీలకం. రాజకీయంగా బలమైన యాదవులు, దళితులు, జాట్‌‌‌‌లు ఒక గొడుగు కిందకు రావడం వల్ల ఆ ప్రభావం బీజేపీ గెలుపు అవకాశాలపై తప్పకుండా పడుతుందని అందరూ భావించారు. దీంతో ప్రధాని మోడీ యూపీ లో  వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఏయే కులాలు తమపై  అసంతృప్తితో ఉన్నాయో గుర్తించి ఆ కుల నాయకులను బుజ్జగించే పనిని లోకల్‌‌‌‌ బీజేపీ లీడర్లకు అప్పగించారు. వారిని తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. సమాజ్‌‌‌‌వాది పార్టీ కేవలం యాదవ కులస్తుల ప్రయోజనాలనే కాపాడుతుందని మిగతా బీసీ కులాల్లో ఉన్న అసంతృప్తిని బీజేపీ క్యాష్ చేసుకుంది. అలాగే దళితుల్లో నాన్–జాతవ్ కులస్తులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంది. ఏ కులాల లెక్కలను ఆధారం చేసుకుని బీజేపీని దెబ్బతీద్దామని ప్రతిపక్షాలు భావించాయో అవే లెక్కల ఆధారంగా బీజేపీ పావులు కదిపింది.

బెంగాల్​పై ప్రత్యేక దృష్టి

పశ్చిమ బెంగాల్‌‌‌‌లోని 42 సీట్లపైకూడా ప్రధాని మోడీ, బీజేపీ ప్రెసిడెంట్‌‌‌‌ అమిత్‌‌‌‌ షా ప్రత్యేక దృష్టి పెట్టారు. జాతీయ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌‌‌‌గా పేరున్న మమతా బెనర్జీ సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో ఈసారి సత్తా చాటాలని బీజేపీ డిసైడ్ అయ్యింది. ఇక్కడ లెఫ్ట్ ఫ్రంట్ ఉనికి నామమాత్రం కావడంతో తృణమూల్‌‌‌‌తో అమీతుమీకి బీజేపీనే రెడీ అయింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. దీంతో ఈసారి మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని పక్కా ప్లాన్‌‌‌‌తో ముందుకెళ్లింది. మమత సర్కార్‌‌‌‌పై ప్రజల్లో ఉన్న యాంటీ–ఇనకంబెన్సీ ఫ్యాక్టర్‌‌‌‌ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించింది.  తృణమూల్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించింది. బెంగాల్లో సత్తా చాటి జాతీయ రాజకీయాల్లో మమతను కట్టడి చేయడానికి  బీజేపీ ప్రత్యేక శ్రద్ద పెట్టింది.

అలాగే నవీన్ పట్నాయక్‌‌‌‌ పాతుకుపోయిన ఒడిశాని ఈసారి తమవైపు తిప్పుకోవడానికి వ్యూహం పన్నింది. ఒడిశాపై కూడా మోడీ–షా నజర్ పెట్టారు. అక్కడ కాంగ్రెస్ అంతర్గత కలహాలతో చతికిలబడటంతో ప్రత్యామ్నాయంగా  దూసుకెళ్లడానికి బీజేపీయే పావులు కదిపింది. ఫొని తుఫాను వచ్చినప్పుడు ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించి అక్కడి ప్రజలకు అండగా నిలబడ్డారన్న మంచి పేరు తెచ్చుకున్నారు. ఎగ్జిట్‌‌‌‌ పోల్స్‌‌‌‌ అన్నీ నెంబర్లలో కొద్దిపాటి తేడా చూపించాయేమోగానీ, మోడీ–షా వ్యూహాల విషయంలో మాత్రం ఏకాభిప్రాయాన్నే వ్యక్తం చేశాయి.

మూడు రాష్ట్రాల్లో  55  ర్యాలీలు

ఈసారి ఎన్నికల్లో మోడీ దేశవ్యాప్తంగా 141 ర్యాలీల్లో పాల్గొంటే, అందులో 55 ర్యాలీలు ఈ మూడు  రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మొత్తంగా 40 శాతం ఎన్నికల ప్రచారం యూపీ, బెంగాల్‌‌‌‌,ఒడిశాల్లోనే జరిగింది. మోడీ ఈ రాష్ట్రాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. 2014 నాటి సీట్లను నిలబెట్టుకోవడంతో పాటు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ కంచుకోటలను బద్దలు కొట్టే లా మోడీ ఎన్నికల ప్రచారాన్ని చేశారు.