న్యూఢిల్లీ:ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) స్కీం కింద శుక్రవారం ప్రధాని మోడీ రూ.20 వేల కోట్లకుపైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిలీజ్ చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో కలిసి నిధులు విడుదల చేసిన అనంతరం ఏపీ, యూపీ, మహారాష్ట్ర, మేఘాలయ, జమ్మూకాశ్మీర్, అండమాన్ నికోబార్ రైతులతో ప్రధాని మాట్లాడారు. కరోనా వైరస్ గ్రామాల్లో వేగంగా వ్యాపిస్తోందని ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. జ్వరం, సర్ది వంటి వాటిని తేలికగా తీసుకోవద్దని, వెంటనే టెస్టులు చేయించుకోవాలని రైతులకు సూచించారు.
నేనూ అంతే బాధపడుతున్నా..
కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని, మందులు, జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం వద్దన్నారు. ప్రజలంతా మాస్కులు పెట్టుకోవడం, దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనేక రూపాల్లోకి మారుతూ కరోనా సవాల్‌గా నిలిచిందని మోడీ అన్నారు. ‘వందేండ్లలోనే ఘోర విపత్తు అయిన కరోనా కారణంగా మనం ఎంతో మంది ఆత్మీయులను కోల్పోయాం. దేశంలో ఎంతో మందికి ఈ విపత్తు బాధను మిగిల్చింది. మీ బాధ నన్ను కూడా అంతే ఎక్కువగా బాధిస్తోంది’ అని తెలిపారు.
18 కోట్ల టీకాలు వేశాం..
‘కరోనాపై అన్ని డిపార్ట్మెంట్లు, సాయుధ బలగాలు, సైంటిస్టుల పోరాటం నిరంతరం సాగుతోంది. ఇండియన్లు ధైర్యం కోల్పోరు. మనం పోరాడతాం. గెలుస్తాం’ అని మోడీ ధీమా వ్యక్తం చేశారు. కొత్త హాస్పిటల్స్, ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. మెడిసిన్స్, వ్యాక్సిన్ సప్లైని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
రెండేళ్లకు స్కీంలో చేరిన బెంగాల్
పీఎం కిసాన్ స్కీం రెండేళ్ల కిందటే ప్రారంభమైనా, వెస్ట్ బెంగాల్ లో ఈ స్కీం ఇప్పటివరకూ అమలు కాలేదు. స్కీంలో చేరేందుకు అంగీకరించిన మమత ప్రభుత్వం.. తాజాగా లబ్ధిదారులకు సంబంధించిన డేటా, ఇతర ప్రాసెస్ ను పూర్తి చేసింది. దీంతో రాష్ట్రంలోని 7.03 లక్షల మంది రైతులకు కూడా ఈ పథకం కింద లబ్ధి కలగనుంది. కాగా, బెంగాల్ రైతులకు పీఎం కిసాన్ నిధులను విడుదల చేయడంలో కేంద్రం తటపటాయిస్తోందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. శుక్రవారం ఆమె బెంగాల్ రైతులకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పోరాటం వల్లే కేంద్రం ఈ స్కీంలో బెంగాల్ ను చేర్చిందన్నారు.
9.5 కోట్ల రైతులకు లబ్ధి
రైతులకు పీఎం కిసాన్ నిధులు విడుదల కావడం ఇది 8వ సారి. దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి ఈ డబ్బును వేయనున్నారు. పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతుల కుటుంబాలకు కేంద్రం ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో ఇస్తోంది. ఈ స్కీం కింద ఇప్పటిదాకా రూ. 1.35 లక్షల కోట్లను రైతుల బ్యాంక్ అకౌంట్లలో వేసినట్లు కేంద్రం తెలిపింది.
