ప్రజా సేవకుడిగా వచ్చా .. ఓట్లు అడిగేందుకు కాదన్న మోదీ

ప్రజా సేవకుడిగా వచ్చా ..  ఓట్లు అడిగేందుకు కాదన్న మోదీ

ఝబువా(మధ్యప్రదేశ్)/టంకార(గుజరాత్):  లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి కచ్చితంగా 370 సీట్లకు పైగా వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్డీఏ కూటమి ఈసారి 400కు పైగా స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌‌‌‌సభ ఎన్నికల ప్రచారం కోసం తాను ఇక్కడికి రాలేదని.. ప్రజా సేవకుడిగా మాత్రమే వచ్చానన్నారు.

మధ్యప్రదేశ్‌‌‌‌లోని డబుల్‌‌‌‌ ఇంజిన్‌‌‌‌ సర్కార్ రెట్టింపు వేగంతో పని చేస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ గిరిజన వ్యతిరేకి అని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీకి గిరిజనులు, రైతులు, పేదలు గుర్తుకొస్తారని విమర్శించారు. ఆదివారం మధ్యప్రదేశ్‌‌‌‌లో పర్యటించిన ప్రధాని.. రూ.7,550 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఝబువా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దక్షిణాదిన ఉన్న రాముడి ఆలయాలు సందర్శించినప్పుడు అక్కడి ప్రజల్లో తనపై ఎంత ప్రేమ ఉందో చూశానని తెలిపారు. ‘‘కాంగ్రెస్ ఓటమి దగ్గర్లోనే ఉంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు లోక్​సభ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. దోపిడీ, విభజన అనేవి కాంగ్రెస్ నినాదాలు. అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని దోచుకున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భాష, ప్రాంతం, కులం ఆధారంగా దేశాన్ని విభజిస్తున్నది’’అని మోదీ విమర్శించారు.

అబ్ కీ బార్ 400 పార్

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్​సభ లోనూ రిపీట్ చేయాలని మోదీ కోరారు. గత ఎన్నికలతో పోలిస్తే ఒక్కో బూత్‌‌‌‌లో 370 ఓట్లు అదనంగా పోలయ్యేలా చూడాలన్నారు. ‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదంతో ముందుకెళ్లాలన్నారు. పార్లమెంట్​లో కాంగ్రెస్ లీడర్లు కూడా ఇదే అంటున్నారని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌‌‌‌.. 2024లో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. ‘‘సికిల్ సెల్ ఎనీమియా వ్యాధికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఓట్ల కోసం కాదు. గిరిజనుల ఆరోగ్యమే మాకు ముఖ్యం. వారి సంక్షేమం కోసం మా ప్రభుత్వం పని చేస్తున్నది. ఈ వ్యాధితో చాలా మంది గిరిజనులు చనిపోతున్నారు’’అని ఆవేదన వ్యక్తం చేశారు.

మనది విలువలతో కూడిన విద్యా విధానం

మన దేశ విద్యా విధానం ఎన్నో విలువలతో కూడిందని మోదీ అన్నారు. ఇలాంటి విద్యకు ఆర్య సమాజ్ స్కూల్స్ కేరాఫ్ అడ్రస్​గా నిలుస్తున్నాయని తెలిపారు. ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద్ సరస్వతి 200వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌‌‌‌లోని మోర్బీ జిల్లా టంకారలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ వర్చువల్​గా పాల్గొని మాట్లాడారు.

‘‘ప్రజలు బానిసత్వంలో కూరుకుపోయి.. మూఢ నమ్మకాలు దేశాన్ని చుట్టుముట్టిన సమయంలో భారతీయ సమాజం తిరిగి వేదాలను ఆశ్రయించాలని పిలుపునిచ్చిన మహానుభావుడు దయానంద సరస్వతి. ఆయన ప్రపంచ జ్ఞాని మాత్రమే కాదు.. జాతీయ స్పృహ కలిగిన జ్ఞాని కూడా.. సనాతన ధర్మం కోసం కృషి చేశారు. భారతీయ తత్వశాస్త్రం అంటే ఏంటో వివరించారు’’అని మోదీ కొనియాడారు. కాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన లక్షకు పైగా అభ్యర్థులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ సోమవారం అపాయింట్​మెంట్ లెటర్లు అందజేస్తారు. అదేవిధంగా, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ‘కర్మయోగి భవన్’ ఫేజ్ 1కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.

నీ ప్రేమ అర్థం చేసుకున్న..

ఝబువా జిల్లాలో నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతు న్నారు. అక్కడికొచ్చిన వారందరూ ఆసక్తిగా వింటున్నారు. దూరంగా ఓ పిల్లాడు తన తండ్రి భుజంపై కూర్చుని మోదీని చూస్తూ చేయి ఊపుతున్నాడు. ఇది చూసిన మోదీ ‘‘నా పై నీకు ఉన్న ప్రేమ ఎంతో బాగుంది. చేయి ఊపుతూ ఉంటే నొప్పి వస్తది.. చేయి దించు..’’ అంటూ కామెంట్ చేశారు. తర్వాత బాలుడు చేయి ఊపడం ఆపేయడంతో ‘‘పిల్లాడు చాలా తెలివైనవాడు’’ అని మోదీ కొనియాడారు.