యుద్ధం వేళ.. ఇజ్రాయెల్‌ అధ్యక్షుడితో మోదీ భేటీ

యుద్ధం వేళ.. ఇజ్రాయెల్‌ అధ్యక్షుడితో మోదీ భేటీ

ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదానికి చర్చలు, దౌత్యమార్గాల ద్వారా శాశ్వత పరిష్కారానికి భారత్‌ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దుబాయి వేదికగా నిర్వహిస్తున్న ‘కాప్‌- 28’ ప్రపంచ వాతావరణ సదస్సు సందర్భంగా ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అక్టోబరులో ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్‌కు చెందిన అగ్రనేతను ప్రధాని మోదీ కలవడం ఇదే ఫస్ట్ టైం. 

ఇజ్రాయెల్- హమాస్ వివాదంపై ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌, ప్రధాని మోదీ చర్చించారు. హమాస్‌ దాడుల్లో ప్రాణనష్టంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారని భారత విదేశాంగశాఖ తెలిపింది. ఇటీవల బందీల విడుదలను స్వాగతించినట్లు చెప్పింది. గాజాలోని బాధిత ప్రజలకు మానవతా సాయం చేరవేయాల్సిన అవసరాన్ని చాటినట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్ర దాడులను ఇప్పటికే పలుమార్లు ఖండించిన భారత్‌.. గాజాలో మానవతా సంక్షోభం నివారణకు పిలుపునిచ్చింది. పెద్దఎత్తున సహాయ సామాగ్రిని గాజాకు పంపించింది.