రజాకార్లకు చుక్కలు చూపించిన బత్తిని మొగిలయ్య గౌడ్

రజాకార్లకు చుక్కలు చూపించిన బత్తిని మొగిలయ్య గౌడ్

తరాలుగా పెత్తనాన్ని భరించిన సామాన్యుడు ఒక్కసారిగా తిరగబడితే.. 
స్వాతంత్ర్యం కావాలని బలంగా కోరుకుంటే..
ఆ ఆకాంక్షకు ఆరడుగుల రూపం.. బత్తిని మొగిలయ్య గౌడ్

ఓరుగల్లు గడ్డ మీద 1918,19-19 కాలంలో మొగిలయ్య పుట్టారు. చెన్నమ్మ, మల్లయ్య దంపతుల ఐదుగురు సంతానంలో చిన్నవాడు మొగిలయ్య. చిన్ననాటి నుంచే కల్లుగీతతో పాటే ఖిలా వరంగల్ లో ఉద్యమపాఠాలు నేర్చుకున్నాడు. స్వతంత్ర భావాలతో పెత్తనాన్ని ఎదిరించేవాడు. ఆర్య సమాజంలో చేరి దొరలకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. 1946, ఆగస్టు 11 ఆదివారం దేశమంతా వందేమాతర నినాదం వినిపిస్తోంది. బ్రిటిష్ పాలన పోతోందన్న సంబురంలో భారతీయులంతా మువ్వన్నెల జెండాలను ఎగరేస్తున్నారు. నిజాం రాజ్యంలో త్రివర్ణపతాకాలపై నిషేధం ఉంది. ఆ కాలంలో ఇక్కడ జెండా ఎగరేయడం అంటే చావును కోరుకోవడమే. అయినా.. సరే మొగిలయ్య అన్న రామస్వామి, భూపతి కృష్ణమూర్తితో పాటు కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ధైర్యంగా వరంగల్ కోటలో జెండా ఎగరేశారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై అని నినాదాలు చేశారు.

జెండా వందనం తర్వాత కాంగ్రెస్ లీడర్లంతా ఛాయ్ తాగడానికి రామస్వామి ఇంటికి పోయారు. ఇది తెలుసుకున్న 200 మంది రజాకార్లు ఆ ఇంటిని చుట్టుముట్టారు. బయటి నుంచి రాళ్లదాడి మొదలుపెట్టారు. దీంతో భూపతి కృష్ణమూర్తి అందరినీ ఇంట్లోకి తీసుకెళ్లి కాంపౌండ్ తలుపునకు బెడం పెట్టాడు. రజాకార్లు విసిరిన రాళ్లనే వారిపై విసురుతూ ఎదురుదాడి మొదలుపెట్టాడు. పొలం దగ్గరున్న మొగిలయ్యకు దాడి విషయం తెలిసింది. వెంటనే ఇంటికి ఉరికొచ్చాడు. సూరులో ఉన్న కత్తి దూసి రజాకార్లపైకి దూకాడు. వాళ్లు వందల మంది ఉన్నా బెదరకుండా దొరికినవాణ్ని దొరికినట్లు ఊచకోత కోశాడు.

పదుల సంఖ్యలో రజాకార్లు హతమయ్యారు. మిగిలినవాళ్లు బతికుంటే చాలని పారిపోయారు. పారిపోయినవాళ్లు మరి కొంతమందిని కూడదీసుకొని మొగిలయ్య మీదికి వచ్చారు. గండం గడిచిందని మొగిలయ్య ఆగిపోలేదు. ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆలోచన కూడా చేయలేదు. అలుపులేకుండా కత్తి తిప్పుతూ రెండోసారీ ఊచకోత కోశాడు. రజాకార్లు మళ్ల పారిపోక తప్పలేదు. ఒక్కడి చేతిలో చావుదెబ్బ తిన్నట్లు తెలిస్తే పరువుపోతుందని, ఈసారి భారీగా బలగాల్ని పిలిపించారు. మూడోసారి మొగిలయ్య మీదికి దండెత్తి వచ్చారు. అప్పటికీ మడమచూపని మొగిలయ్య ధైర్యంగా ఖిలా వరంగల్ కోట గుమ్మం ముందు నిలబడ్డాడు. వందలమంది రజాకార్లను చూసి బెదరలేదు. పోరాటం కొనసాగింది. ఒకేసారి అంతమంది ఒక్కడిని చుట్టుముట్టి కత్తులు, బరిసెలతో దాడిచేయడంతో పోరాడుతూనే మొగిలయ్య నేలకొరిగాడు. 

నాటి మొగిలయ్య సాహసానికి ప్రత్యక్షసాక్షి భూపతి కృష్ణమూర్తి. ఒంటరి యోధుడిగా పోరాడి కన్నుమూసే నాటికి మొగిలయ్య గౌడ్ వయసు 28 సంవత్సరాలు. ఆయన భార్య లచ్చమ్మ పదిహేను రోజుల బాలింత. ఆ రోజు మొగిలయ్య కత్తిపట్టకుంటే రామస్వామి ఇంట్లో ఉన్న కాంగ్రెస్ నేతలంతా చనిపోయేవారు. ఒక్కడి పోరాటంతో అందరి ప్రాణాలు కాపాడడంతో పాటు ఓరుగల్లు చరిత్రలో కొత్తతరం వీరుడిగా నిలిచాడు మొగిలయ్య. కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధపోరాటం సాగుతున్న కాలంలో మొగిలయ్య త్యాగం కాంగ్రెస్ లోనూ అతివాద వర్గాన్ని తయారు చేసింది. ఆయన వీరమరణాన్ని కాళోజీ కవితగా రాశాడు. వీరతెలంగాణ పోరాటంలో ప్రత్యేకంగా నిలిచిన మొగిలయ్య గౌడ్ కి తగిన గౌరవం దక్కలేదు. అప్పట్లోనే ఓరుగల్లు నడిబొడ్డున మొగిలయ్య హాల్ నిర్మించినా ఆయన గాథ మాత్రం తర్వాత తరాలకు అందించే ప్రయత్నం జరగలేదు. మన గడ్డ ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడికి ట్యాంక్ బండ్ మీద మన రాష్ట్రంలోనూ గజం జాగ దక్కలేదు.