ఇండియాకు సొంత AI లేకుంటే కష్టం... డెవలప్ చేసుకోవాలని నిపుణుల సలహ..

ఇండియాకు సొంత AI లేకుంటే కష్టం... డెవలప్ చేసుకోవాలని నిపుణుల సలహ..
  • ఏడాదికి రూ.50 వేల కోట్లతో  స్పెషల్ ఫండ్ కేటాయించాలని కోరిన మోహన్‌‌దాస్ పాయ్
  • ఆర్‌‌‌‌ అండ్ డీని పెంచాలన్న శీధర్ వెంబు
  • ఆంత్రోపిక్ మోడల్స్‌‌పై అమెరికా  ప్రభుత్వం ఆంక్షలు

న్యూఢిల్లీ:  అమెరికా ప్రభుత్వం ఆంత్రోపిక్ ‘‘మైథోస్-క్లాస్"  ఏఐ మోడళ్ల ఎగుమతిపై ఆంక్షలు పెట్టడంతో  సొంతంగా ఏఐను డెవలప్ చేసుకోవాల్సిన టైమ్ వచ్చిందని నిపుణులు  చెబుతున్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్‌‌కు భారీగా ఖర్చు చేయాలని, ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించాలని సలహా ఇచ్చారు.  ఇండియా ఏఐ రేసులో అమెరికా, చైనాతో పోలిస్తే చాలా వెనకబడి ఉంది. 

భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ),  డీప్ టెక్ రంగాలను బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సరికొత్త ‘ఇండియా ఏఐ మిషన్’ ను ప్రారంభించాలని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ టి.వి. మోహన్‌‌దాస్ పాయ్ శనివారం డిమాండ్ చేశారు. ఎక్స్‌‌ వేదికగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకనిని ఈ మిషన్‌‌కు వైస్ చైర్మన్‌‌గా నియమించాలని, ప్రైవేట్,  ప్రభుత్వ రంగ నిపుణులను ఇందులో భాగస్వామ్యం చేయాలని సూచించారు.

డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం ప్రతి ఏటా రూ. 50 వేల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని కోరారు.  దేశీయంగా హైపర్ క్లౌడ్ డేటా సెంటర్లు, హార్డ్‌‌వేర్, సెమీకండక్టర్ చిప్స్ తయారీని ప్రోత్సహించడానికి రూ. 2 లక్షల కోట్ల 'ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్' ఫండ్‌‌ను ఏర్పాటు చేయాలన్నారు.

గ్లోబలైజేషన్ ముగిసింది: శ్రీధర్‌‌‌‌ వెంబు

గ్లోబలైజేషన్  అనే భ్రమల నుంచి భారతీయులు ఇకనైనా మేల్కొనాలని జోహో ఫౌండర్ శ్రీధర్‌‌ వెంబు హెచ్చరించారు.  మన దేశాన్ని వారు (అమెరికా) ఒక మార్కెట్‌‌గా చూడనప్పుడు, వారికి మనం ఎందుకు డబ్బులు చెల్లించాలని ప్రశ్నించిన ఆయన.. భారతీయ సంస్థలు స్వదేశీ ఏఐ మోడళ్లు లేదా చైనాకు చెందిన ఓపెన్ సోర్స్ చిన్న మోడళ్లను ఉపయోగించుకోవాలని సూచించారు.  భారత్ ఆర్ అండ్ డీపై ఫోకస్ పెంచాలన్నారు. 

మైథోస్ వాడలేం

ఆంత్రోపిక్  సరికొత్త క్లాడ్ "మైథోస్-క్లాస్"  ఏఐ మోడళ్లయిన 'ఫేబుల్ 5' , 'మైథోస్ 5' ల యాక్సెస్‌‌ను అమెరికా వెలుపల ఉన్న వినియోగదారులందరికీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది. 

ఫేబుల్ 5: ఇది అడ్వాన్స్డ్ సాఫ్ట్‌‌వేర్ ఇంజనీరింగ్ టూల్‌‌.  ఇండిపెండెంట్‌‌గా పనిచేయగలదు. క్లిష్టమైన రీజనింగ్,  ఏజెంటిక్ వర్క్‌‌ఫ్లోల కోసం డిజైన్ చేశారు.  రోజుల తరబడి కోడ్ మైగ్రేషన్ వంటి పెద్ద ప్రాజెక్టులను చేయగలదు. 
మైథోస్ 5: ఇది ఫేబుల్ 5 లాంటి ఆర్కిటెక్చర్‌‌నే కలిగి ఉన్నప్పటికీ ఎటువంటి ఆంక్షలు లేకుండా పనిచేస్తుంది. సాఫ్ట్‌‌వేర్ లోపాలను కనుగొనడం, అధునాతన సైబర్ సెక్యూరిటీ పరిశోధనలు చేసే సామర్థ్యం దీనికి ఉంది. దీని సైబర్ పవర్స్ కారణంగా ఈ మోడల్‌‌ను  కేవలం ఆమోదం పొందిన పరిశోధక సంస్థలకే పరిమితం చేశారు.