ఈసీ తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్ము తెలంగాణలోనే ఎక్కువ

ఈసీ తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్ము తెలంగాణలోనే ఎక్కువ
  •     ఐదు రాష్ట్రాల్లో రూ.1760 కోట్ల విలువైన సొత్తు పట్టివేత
  •     మన రాష్ట్రంలో సీజ్​చేసిన మొత్తం విలువ 659 కోట్లు
  •     2018 ఎన్నికలతో పోలిస్తే పట్టుబడిన సొత్తు ఏడు రెట్లు పెరిగింది

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రూ.1,760 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్​వెల్లడించింది. ఇందులో అత్యధికంగా తెలంగాణలో దాదాపు రూ.659 కోట్ల విలువైన లెక్కచూపని నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతరత్రా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ఈసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అక్టోబరు 9న ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఈ మొత్తాన్ని జప్తు చేసినట్లు తెలిపింది. 2018లో ఇవే రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీజ్‌ చేసిన దాంతో(రూ.239.15 కోట్లు) పోలిస్తే ఇప్పుడు పట్టుబడిన మొత్తం ఏడు రెట్లు ఎక్కువని పేర్కొంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటికే చత్తీస్‌గఢ్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ ముగిసింది. రాజస్థాన్‌లో ఈ నెల 25న, తెలంగాణలో 30న ఎన్నికలు జరగనున్నాయి.

మిజోరంలో ఒక్క రూపాయి దొరకలే..

ఈసీ వివరాల ప్రకారం.. తెలంగాణలో 659.2 కోట్లు పట్టుబడగా, అందులోరూ.225.23 కోట్లు నగదు రూపేణా ఉన్నాయి. రూ.86.82 కోట్ల విలువైన మద్యం, రూ.103.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ.191.02 కోట్ల విలువైన బంగారం, వెండి, ఆభరణాలు, రూ.52.41 కోట్ల విలువైన ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వస్తువులను ఎన్నికల అధికారులు సీజ్​చేశారు. మిజోరంలో నిర్వహించిన తనిఖీల్లో ఒక్క రూపాయి నగదు కానీ, విలువైన బంగారు, వెండి ఆభరణాలు కానీ దొరక్కపోవడం గమనార్హం.ఈ రాష్ట్రంలో రూ.29.82 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ.4.67 కోట్ల లిక్కర్, రూ.15.16 కోట్ల విలువైన ఉచితాల వస్తు సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈసారి స్టేట్, సెంట్రల్​ఏజెన్సీల మధ్య సమన్వయం, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ వ్యవస్థలో టెక్నాలజీ భాగస్వామ్యం పెంచామని, ఎన్నికలు ముగిసేనాటికి తనిఖీల్లో పట్టుబడే సొమ్ము మరింత పెరిగే అవకాశం ఉందని ఈసీ తెలిపింది.