వానా కాలం సాగు ప్రణాళిక ఖరారు

వానా కాలం సాగు  ప్రణాళిక ఖరారు
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 13.42 లక్షల ఎకరాల్లో సాగు 
  • భద్రాద్రి జిల్లాలో మునగ, ఆయిల్​పాంపై స్పెషల్​ ఫోకస్​ 

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 13,42,131ఎకరాల్లో వానా కాలం పంట సాగు ప్రణాళిక ఖరారైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతేడాది కంటే ఈ సారి దాదాపు 17,358 ఎకరాల్లో అదనంగా పంటలు సాగు జరిగేలా అగ్రికల్చర్​ ఆఫీసర్లు ప్లాన్​ చేశారు. ఈ సారి ప్రధానంగా ఆయిల్​పాం, మునగ సాగుపై అధికారులు స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. జిల్లాలో పత్తి, వరి పంటలు సాగు కానున్నాయి. ప్రస్తుతం పడ్తున్న వానలతో రైతులు వేసవి దుక్కులు చేసుకునేందుకు అనుకూలమే. విత్తనాలు మాత్రం తొందర పడి వేసుకొవద్దని అగ్రికల్చర్​ ఆఫీసర్లు సూచిస్తున్నారు.  

ఉమ్మడి జిల్లాలో :

అడపా దడపా కురుస్తున్న వర్షాలతో రైతులు వేసవి దుక్కులకు సిద్ధం అవుతున్నారు. పశువుల పెంటను పొలాల్లోకి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మేతకు వచ్చిన గొర్రెలను  కొందరు రైతులు తమ పొలాల్లో ఎరువు కోసం రాత్రి వేళల్లో ఉంచుతున్నారు. ఖమ్మం జిల్లాలో 7,32,509 ఎకరాలు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 6,09,622 ఎకరాల్లో వానా కాలం పంటల సాగు చేపట్టేందుకు అగ్రికల్చర్​ ఆఫీసర్లు ప్రణాళికలను ఖరారు చేశారు. 

మునగ, ఆయిల్​పాం సాగుపై ప్రత్యేక దృష్టి : 

భద్రాద్రికొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గతేడాది వానా కాలంలో 5,92,264 ఎకరాల్లో పంటల సాగు కాగా ఈ సారి 6,09,622 ఎకరాల్లో పంటల సాగవుతాయని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.  చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించారు. జిల్లాలో 41,489 క్వింటాల్స్​ వరి విత్తనాలు, 6,924 క్వింటాల్స్​ మొక్కజొన్న, 51,158 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం ఉందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పచ్చిరొట్ట విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అందుబాటులో ఉన్నాయని అగ్రికల్చర్​ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. 

ఎరువులకు ప్రతిపాదన       

ఖమ్మం జిల్లాలో 1,20,904 మెట్రిక్​ టన్నుల యూరియా, 41,719 మెట్రిక్​ టన్నుల డీఏపీ అవసరం ఉంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 40,625 మెట్రిక్​ టన్నుల యూరియా, 10,978 మెట్రిక్​ టన్నుల డీఏపీ అవసరం ఉన్నట్టుగా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.  

తొందర పడొద్దు :అడపా దడపా పడ్తున్న వానలు వేసవి దుక్కలకు అనుకూలమే. కానీ విత్తుకునేందుకు మాత్రం రైతులు తొందర పడొద్దు. ప్రస్తుతం కురుస్తున్న వానలు విత్తుకోడానికి అనుకూలం కావు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతున్నాం. పచ్చి రొట్ట విత్తనాలు ఇప్పటికే రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి మునగ, ఆయిల్​ పాం సాగును పెంచేందుకు కలెక్టర్​ ప్రత్యేక దృష్టి పెట్టారు.   బాబూరావు, అగ్రికల్చర్​ ఆఫీసర్​, భద్రాద్రికొత్తగూడెం