కాంచనపల్లి కథలు..బడుగుజీవుల వెతలు..

కాంచనపల్లి కథలు..బడుగుజీవుల వెతలు..

ఈ సంపుటిలో 12 కథలున్నాయి. ఎక్కువ కథలలో బడుగుజీవుల వెతలున్నాయి. ఇందులో కొన్ని జూలపల్లి, పరిసర ప్రాంతాలతో పెనవేసుకున్నవే. తెలంగాణ పదాలతో జీవితాలతో ముడివేసుకున్నవే.

‘ఒక వర్షం కురిసిన రోజు’ కథలో -– నాన్న జూలపల్లికి 18 కి.మీ. దూరం ఉన్న పెద్దకలువలలో టీచర్. జూలపల్లికి బస్ సౌకర్యం లేదు. కాలినడకనే ప్రయాణం. వానలో నానిరావడం, వర్షానికి పెంకుటిల్లు ఉరవడం, ఉరిసేచోట నేలపైన పళ్లాలు, గిన్నెలు పెట్టడం, పెద్ద గంజులో చాయ్ చేసుకొని పెద్ద గ్లాసుల్లో పోసుకొని ఇంటిల్లిపాదీ జుర్రడం, పిల్లలకు అరటిపండ్లు కొనడం కోసం వానలోనే నాన్న పడిన పాట్లు ఈ కథలో ఉంటయ్. ‘బలి బతుకు’ కథలో లక్ష్మికి 22 ఏళ్లు. బంగారు రంగుతో మెరిసిపోతుంటుంది. దళిత కుటుంబంలోని నిసర్గ సౌందర్యం ఆమె సొంతం. కోటిని పెళ్లాడింది. అతనికి అక్షరజ్ఞానం లేదు. కోటి బుచ్చిరాంరెడ్డి దొర దగ్గర పాలేరు. వడ్డీ వ్యాపారియైన కోమటి బుచ్చయ్యతో బుచ్చిరాంరెడ్డి అకారణ వైరం పెట్టుకుండు. కోటిచేత బుచ్చయ్య ఇంటికి నిప్పు పెట్టించిండు. పోలీసులొస్తే కోటిని వాళ్లకు పట్టించిండు. కోటిని లోపటెయ్యాలని, లక్ష్మి మీద కన్నెయ్యాలని, అటు అమీనాబ్ ఇటు దొర అనుకుంటుండ్రు. దుర్మార్గులలో అత్యంత క్రూరమైన ఆలోచనలుంటాయని, అజ్ఞానంతో అమాయకత్వంతో అటువంటివాళ్లను నమ్మి బలికావద్దని ఈ కథ ద్వారా తెలుసుకుంటం. 

‘ఆడ మనసు’ కథలో మంగ వెంకన్న ఆలుమగలు. ‘మీ అన్న మన పెళ్లప్పుడు బైక్ కొనిస్తనని ఒప్పుకున్నడు గద! బండి తెస్తేనే నువ్వు ఇంటికి రా’ అని మంగను పుట్టింటికి తరిమేసిండు. మంగ వెళ్లి రెండు రోజులైంది. వెంకన్నకు మనసున పట్టడం లేదు. పొద్దున చాయ్ తాగినప్పటినుంచి రాత్రి పడుకునేదనుక మంగ పాత్ర ఎంత విలువైనదో అర్థం అవుతుంది. మంగ జ్ఞాపకాలతో నిలువలేకపోయిండు. మంగ కంటె బండి ఎక్కువా? ఏంది? వెళ్లి మంగను తీసుకురావాలె అని బయల్దేరిండు. అక్కడ అన్న బండి కొనివ్వనన్నడు. మంగ వెంకన్న కోసం బయల్దేరింది. మంగ వెంకన్న ఎదురు పడ్డరు. ప్రేమ ఒలకబోసుకున్నరు. ‘గౌరి’ కథలో బూదమ్మ కూతురు గౌరి, కొడుకు కొమురయ్య. వాళ్లు రజకులు. అందరిండ్లల్ల ఇడిచిన బట్టలు చాకిరేవుకు తీసుకెళ్లి ఉతికి తీసుకొస్తది బూదమ్మ. ఇంటికింత అన్నం కూరలు అడుక్కొస్తది. వాళ్లిండ్ల నుంచి తెచ్చినయి గౌరి తినదు. ఇంట్ల వండితేనే తింటది. గౌరికి సదువుకుందామనుంటది. ‘ఇండ్లల్లకు బట్టలకెళ్లు, అన్నం అడుక్కురా’ అంటుంది బూదమ్మ. ‘నేనసలు గీ పని సచ్చినా సెయ్య’ అంటుంది గౌరి. కొమురయ్య కొట్టవోతడు. చేసేదేం లేక వాళ్ల ఇండ్లల్లకు పోతది గౌరి. అయితే మొగోళ్ల ఆకలి చూపులు ఆమెను వెంటాడుతయ్. 

వెంకటరెడ్డి బలాత్కరించబోతే తప్పించుకొని ఇంటికచ్చి ఏడ్చి ఏడ్చి అలసిపోతది. చైతన్యం, తిరుగుబాటుతత్వం గల గౌరికి ఆ అలసటలో కనిపించిందొక ‘ఊరట’.
‘ఒక్క పొరపాటు’ ఎంత పని చేసింది! ఒకతను మల్లన్నకు వెయ్యి నోటు ఇచ్చాననుకున్నాడు. కాని ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల మల్లన్న కూతురు పదవతరగతి పరీక్ష ఫీజు కట్టలేకపోయింది. ఆ బాధతో దోమలమందు తాగేసింది. దవాఖానకు తీసుకపోతే బతికింది. కాని స్థిమితం కాలేదు. తనవల్లే పొరపాటు జరిగింది కనుక ఆ వ్యక్తి మల్లన్న కూతురికి నయమయ్యేదాకా వైద్యం చేయించాలని, చదువయ్యేదాకా చదివించాలని దృఢంగా నిశ్చయించుకుంటాడు. ‘టిట్ ఫర్ టాట్’లో జగపతి రుచిత దంపతులు. బయట ఆడగాలి తగలగానే ఆకాశమంత ఉబ్బిపోయే జగపతికి బుద్ధివచ్చేలా రుచిత మంచిపని చేసిందని ఈ కథ చదివిన పాఠకులు అనుకోవడం ఖాయం. ‘పురుగులు’ కథలో ఏదో ఒక వంకతో విద్యార్థినులను స్పృశించాలనే హీనమైన ప్రవర్తన ఉన్న మగ లెక్చరర్లపై శిశిర పోరాటానికి సమాయత్తమౌతుంది. ‘కర్తవ్యం’ కథ ప్రిన్సిపాల్ అంటే వైదేహిలా ఉండాలి అనిపించేది. ఈ కథ ప్రిన్సిపాళ్లందరూ చదవదగినది.

కొన్ని కథలు రసవత్తరంగా ఉంటయ్. ‘సంధ్య’ కథలో -తనతోపాటు బడిలో చదివే సంధ్య, ఆమె మంచితనంతో ప్రేమగుణంతో రాజుకు చందమామ కథలో దేవతలా అనిపించింది. ఆ తర్వాత ఆ ఊరినుంచి వెళ్లిపోయింది. మళ్లీ కనిపించలేదు. అయినా ఆ నవసంధ్య జ్ఞాపకమై, కవిత్వమై, కథై అతనిలో ప్రవహిస్తూనే ఉంది. ‘పాటకోసం’ కథలో కిరణ్ ‘‘మనసు గతం వైపు వెళ్తోంది. నీ పాట కోసం వెతుకుతోంది. చివరగా నీ పాటతో ఈ పక్షి రెక్కలు ఇంకొంత కాలమైనా ఎగిరే శక్తినివ్వవూ!’’ అని అపురూపకు ఉత్తరం రాస్తాడు. ఆమె పాటకోసం పలవరిస్తాడు. ‘‘రా బావా! నీకోసం పారేసుకున్న బాల్యాన్ని పాటచేసి ఆలపిస్తాను. నా పాటతో నీలో జీవం నింపి నీ ఆశయానికి ఊపిరులూదుతాను” అని ఆమె అతని రాకకోసం కలవరిస్తుంది. కాంచనపల్లి ఈ కథను మలచిన తీరు మనల్ని కదిలిస్తుంది. ‘జారిన స్వప్నం’- ఇది కూడా వర్షం కథే. 

చక్కనైన అబ్బాయి మెరుపుతీగ లాంటి అమ్మాయి అనుకోకుండా ఊరి బయట ఉధృతంగా పారుతున్న వాగు పక్కన ఒక పాకలో ఒకరాత్రి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వాన ఇసిరిసిరి కొడుతుంది. మెరుపు మెరిసినప్పుడు ఉరుము ఉరిమినప్పుడు ఆమె భయంతో అతన్ని హత్తుకుంటుంది. యౌవనపు ప్రకంపనలు ఒక వంక, వర్షపు ధాటికి పాక కూలిపోతుందేమోననే భయం ఇంకొక వంక - ఏం జరుగుతుంది? అడుగడుగున ఆసక్తిదాయకం. ఈ కథ చదవడం పాఠకులకు అందమైన అనుభవం.
సహజమైన వాక్యాలు, సందర్భోచితమైన సన్నివేశాలు, వర్ణనలు, సముచిత సంభాషణలు, కథాగమనానికి సరిగ్గా సరిపోయే తెలంగాణ తెలుగు పదాలు ఈ కథల లక్షణాలు. కదిలించే మరెన్నో కథలు కాంచనపల్లి నుండి రావాలని ఆశిస్తూ అభినందనలు.
- ఎ. గజేందర్ రెడ్డి, 9848894086