దేశాన్ని దోచుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ: ఎంపీ అర్వింద్

దేశాన్ని దోచుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ: ఎంపీ అర్వింద్

తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టు ఒక్కటి కూడా నిర్మించలేదని..దేశాన్ని దోచుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల మరమ్మతుకు డబ్బులు లేని పరిస్థితి నెలకొందన్నారు. పేపర్లకే పరిమితమైన కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట  గొప్పలు తప్ప చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రూ. 60  కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు రూ. 130 కోట్లకు పెంచడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లాలో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటించారు. జగిత్యాల పట్టణంలోని బీఎల్ఎన్ గార్డెన్ లో బీజేవైఎం జిల్లా శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు.

అంతకుముందు పీఎం మోడీ తల్లి హీరాబెన్ చిత్ర పటానికి ఎంపీ అర్వింద్ నివాళి అర్పించారు. అనంతరం అకాల వర్షాలకు దెబ్బతిన్న  బీర్పూర్ మండలం రోళ్ళ వాగు ప్రాజెక్టు పనులను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. రోళ్ల వాగు కట్ట తెగి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మరమ్మత్తు పనులు చేపట్టకపోవడం సీఎం కేసీఆర్ పాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రం ఏర్పడితే రైతులను ఆదుకుంటామని అబద్ధపు హామీలు చెప్పాడని దుయ్యబట్టారు. రైతులకు మంచి చేయాలని ఆయనకు సోయి లేదని.. యాసంగి పంటకు నీరు అందిస్తామన్న స్థానిక మంత్రి, ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని నిలదీశారు.