లాకప్‌‌లో గ్యాంగ్ రేప్: మధ్యప్రదేశ్‌‌లో యువతిపై పోలీసుల అఘాయిత్యం

లాకప్‌‌లో గ్యాంగ్ రేప్: మధ్యప్రదేశ్‌‌లో యువతిపై పోలీసుల అఘాయిత్యం

భోపాల్: హత్రాస్, బల్‌‌రాంపూర్ గ్యాంగ్ రేప్ ఘటనతో మొత్తం దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలు పార్టీలు, సంఘాలు, ప్రజలు పెద్దపెట్టున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఘటనలు జరిగిన నెల కూడా అయిందో లేదో ఇలాంటి మరో గ్యాంగ్ రేప్ ఘటన కలకలం సృష్టిస్తోంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఓ మహిళపై అత్యాచారం చేశారు. మధ్యప్రదేశ్‌‌లోని రెవా జిల్లా, మంగ్వాన్ టౌన్‌‌లో ఈ ఘటన జరిగింది. లాకప్‌‌లో ఉన్న నిందితురాలిని పోలీసులు గ్యాంగ్ రేప్‌‌ చేశారు.

వివరాలు.. ఈ ఏడాది మే నెలలో ఓ మర్డర్ కేసులో నిందితురాలైన 20 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని ఉంచిన లాకప్‌‌లోనే ఆమెపై పది రోజుల పాటు ఐదుగురు పోలీసులు దారుణంగా అత్యాచారానికి దిగారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి జైలును తనిఖీ చేసిన సమయంలో పోలీసుల అఘాయిత్యం విషయాన్ని బాధితురాలు బయటపెట్టింది. రేప్ విషయాన్ని ఎవరికైనా చెబితే మర్డర్ కేసులో తన నాన్నను కూడా ఇరికిస్తామని పోలీసులు బెదిరించినట్లు అడిషనల్ జడ్జి ఎదుట యువతి వాపోయింది. ఆమె స్టేట్‌‌మెంట్‌‌ను రికార్డు చేసిన జడ్జి.. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.