ఎంపీలు..సెలవు  చిట్టీలు

ఎంపీలు..సెలవు  చిట్టీలు
  • లోక్ సభకు హాజరు కాలేక లీవ్ లెటర్లు పెట్టిన సభ్యులు
  • వరుసగా 60రోజులకు మించి హాజరు కాకపోతే అనర్హత వేటుకు అవకాశం

ఓ రోజు స్కూలుకు వెళ్లకపోతే సెలవు చిట్టీ పెట్టాలె. ఆఫీసుకు పోకపోయినా లీవ్ లెటర్ పెట్టాల్సిందే.మనమే కాదు ఎంపీలు కూడా పార్లమెంటుకు వెళ్లకపోతే లీవ్ లెటర్ పెట్టాల్సిందే తెలుసా? పార్లమెంటు నిబంధనల ప్రకారం లోక్ సభ, రాజ్యసభ సభ్యులెవరైనా అనుమతి లేకుండా వరుసగా 60 రోజులకుమించి పార్లమెంటు సమావేశాలకు హాజరుకాకపోతే వారిపై అనర్హత వేటు వేసేందుకు అవకాశం ఉంటుంది. దాంతో పార్లమెంటు సమావేశాలకు హాజరుకాని ఎంపీలు.. సభకు హాజరై 60 రోజులు దాటే పక్షంలో లీవ్ లెటర్లు పెడుతూ ఉంటారు. 16వ లోక్ సభ (2014–19)లోనూ ఇట్లా 63 లీవ్ అప్లికేషన్లు వచ్చాయి. లోక్ సభ అంశాలపై పీఆర్ ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్​ సంస్థ చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

320 రోజులు సమావేశాలు…

16వ లోక్ సభలో మొత్తంగా 320 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. అందరు ఎంపీలు కలిపి సగటున 80 శాతం హాజరు నమోదైంది. 2018 ఆగస్టు వరకు సేకరించిన డేటా మేరకు.. వరుసగా రెండు నెలలు దాటినా హాజరుకాలేని 43 మంది లోక్ సభ సభ్యులు 63 లీవ్ లెటర్లు పెట్టారు. ఈ 63 లీవ్ లెటర్లలో కలిపి అడిగిన సెలవు రోజులు ఎన్నో తెలుసా?ఏకంగా రెండు వేల రోజులు.

కమిటీ ఓకే చెప్పాలి….

ఎంపీలు సెలవు కోసం లోక్ సభలో అయితే స్పీకర్ కు,రాజ్యసభలో అయితే డిప్యూటీ చైర్మన్ కు లీవ్ లెటర్ ఇవ్వాలి. అందులో కచ్చి తంగా కారణాన్ని కూడా రాయాలి. ఈ లీవ్ లెటర్లను సభలో ‘సభ్యుల గైర్హాజరును పరిశీలించే కమిటీ ’కి నివేదిస్తారు. ఆ కమిటీ వాటిని పరిశీలించి.. ఓకే చేయాలా, రిజెక్ట్ చేయాలాఅన్న దానిపై ప్రతిపాదన ఇస్తుంది. ఆ మేరకు సభ నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం కొనసాగుతున్న16వ లోక్ సభలో సీపీఎం కేరళ ఎంపీ పి.కరుణాకరన్ ఈ కమిటీకి చైర్మన్ గా ఉన్నా రు.

సెలవుల్లో కోత పెట్టారు….

సాధారణంగా ఎప్పుడూ లీవ్ లెటర్లను రిజెక్ట్ చేయడం జరగదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కోరినన్నిరోజులు కాకుండా తక్కువ రోజులు మాత్రమే లీవ్ ఇచ్చారు. ఎందుకంటే పార్లమెంటు కమిటీ ఎవరైనా ఎంపీ లీవ్ అప్లికేషన్ పెట్టిన రోజు నుంచి గరిష్టం గా 60 రోజుల వరకు మాత్రమే సెలవు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కావాలంటే గడువు ముగిశాక మళ్లీ అప్లై చేసుకొమ్మంటా రు. ఇలా కాంగ్రెస్ ఎంపీ అమరీందర్ సింగ్ , బీజేపీ ఎంపీ విఠల్ భాయ్ హంసరాజ్, వైఎస్సార్ సీపీ ఎంపీ ఎస్పీ వై రెడ్డి తదితరులు ఎక్కువ రోజులు లీవ్ కోరినా.. 59 రోజులే ఇచ్చారు. ఒకటి రెండు ఘటనల్లో మాత్రం ఎక్కువ రోజులు ఇచ్చారు. జైలుకు వెళ్లిన బీజేపీ ఎంపీ రామచంద్రహం సదా 299 రోజులు లీవ్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే 67 రోజులు ఇచ్చారు.

 అనారోగ్యం, ఎలక్షన్లు, జైళ్లు….

లోక్ సభలో లీవ్ లెటర్లు పెట్టిన ఎంపీల్లో సగానికిపైగా అనారోగ్యమే కారణంగా చెప్పారు. 10 లీవ్ లెటర్లేమో ఎలక్షన్ల కోసమంటూ, మరో పది లీవ్ లెటర్లు తాము జైల్లో ఉన్నందున హాజరు కాలేక పోతున్నామంటూ వచ్చాయి.అనారోగ్యం, వైద్యం కోసమంటూ 35 మంది లీవ్ పెట్టగా.. 34 మంది తమకే బాగోలేదని వివరించారు. ఒక బీజేపీ ఎంపీ మాత్రం తన కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగాలేదంటూ సెలవు పెట్టారు. జైల్లో ఉన్నందున హాజరుకాలేనంటూ వచ్చిన10 లీవ్ అప్లికేషన్లలో ఒక్క బీజేడీ వచ్చినవే ఆరు. తృణమూల్ కాంగ్రెస్ , ఎల్ జేపీ ఎంపీల నుంచి మిగతా అప్లికేషన్లు వచ్చాయి. తమ నియోజకవర్గానికి సంబంధించిన పని ఉందంటూ మూడు, విదేశాలకు వెళ్లామంటూ మరో మూడు లీవ్ లెటర్లు వచ్చాయి. విదేశాలకు వెళ్లేందుకు లీవ్ పెట్టినవారిలో బీజేపీ ఎంపీ హేమామాలిని, తృణమూల్ ఎంపీ సుగతాబోస్ ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపీ ఒక్క లీవ్ లెటర్ లోనే.. ఓ వివాహం, విదేశీ ప్రయాణం, నియోజకవర్గంలో పనులు ఉన్నా యంటూ మూడు కారణాలను పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యుల మరణం కారణంగా లీవ్ అప్లికేషన్ ఇచ్చిన ఎంపీలు ఇద్దరున్నారు. మరో విషాదం ఏమిటంటే.. అనారోగ్యం , ఇతర కారణాలతో లీవ్ లెటర్లు పెట్టిన నలుగురు ఎంపీలు దురదృష్టవశాత్తూ ఆ లీవ్ సమయంలోనే మరణించారు. తృణమూల్ ఎంపీ కపిల్ కృష్ణఠాకూర్ , బీజేపీ ఎంపీలు వినోద్ ఖన్నా, చాంద్ నాథ్ యోగి, కాంగ్రెస్ ఎంపీ షానవాజ్ అలా కన్నుమూశారు. ఎక్కువ రోజులు లీవ్ కోసం అప్లై చేసింది బీజేడీ ఎంపీ రామచంద్ర. జైలుకు వెళ్లిన ఆయన 299 రోజులు సెలవు అడిగారు. బీజేపీ ఎంపీ చాంద్ నాథ్ 164 రోజులు లీవ్ కోరారు. కానీ కొద్దిరోజులకే ఆయన మరణించారు.