వాహనదారులకు డేంజర్​గా రోడ్లపై మట్టి, ఇసుక, కంకర వ్యర్థాలు

వాహనదారులకు డేంజర్​గా రోడ్లపై మట్టి, ఇసుక, కంకర వ్యర్థాలు
  • బైక్​లు స్కిడ్ అయి కిందపడుతున్న వాహనదారులు
  • మెటీరియల్ తరలించే వెహికల్స్​కు రూ.25 వేల ఫైన్
  • అయినా టిప్పర్లు, లారీ డ్రైవర్లలో మార్పు రావట్లేదు
  • అవగాహన కల్పిస్తే ఇబ్బందులు తొలగే అవకాశం
  • ఎలాంటి చర్యలు తీసుకోని బల్దియా అధికారులు

హైదరాబాద్, వెలుగు: సిటీలో రోడ్లపై మట్టి, ఇసుక, కంకర వ్యర్థాలు వాహనదారులకు డేంజర్​గా మారాయి. మెయిన్ రోడ్ల నుంచి కాలనీల రోడ్ల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. నిర్మాణ వ్యర్థాలు తరలిస్తున్న వాహనాలతోనే సమస్య ఏర్పడుతుంది. మెటిరియల్ తరలింపుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  వాహనాల డ్రైవర్లకు అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో పట్టించుకోవడంలేదు. 5 నుంచి10  మంది మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటుండగా.. మిగతా వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు.  అధిక లోడ్ చేసి ఓపెన్​గా తరలిస్తుండగా రోడ్లపై పడుతుంది. మరోవైపు ఓవర్ లోడ్ వాహనాల ఫొటోలు తీసి జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్​ఫోర్స్​మెంట్ సెల్​కు ట్విట్టర్​లో  పోస్ట్​ చేస్తే  రూ.25వేల ఫైన్లు వేస్తుంది. అయినా..  నిర్మాణ వ్యర్థాలను ఎలా తరలించాలనే దానిపై టిప్పర్లు, లారీల డ్రైవర్లలో  మార్పు రావడంలేదు. అధికారులు డ్రైవర్లకి అవగాహన కల్పించి పటిష్ట చర్యలు తీసుంటే ఇబ్బందులు తొలగుతాయి.  

నిర్మాణ ప్రాంతాల్లోనే ఎక్కువ..

పెద్ద పెద్ద కన్​స్ట్రక్షన్స్ ​ప్రాంతాల్లోని రోడ్లపై ఇసుక, మట్టి, కంకర గుట్టలుగా కనిపిస్తుంది. అలా పోయడం ప్రమాదమని తెలిసినా బిల్డర్లు పట్టించుకోవడంలేదు. తమకేం నష్టం అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. చిన్నపాటి వాన పడినా ఇసుక, కంకర వరదకు కొట్టకుపోయి రోడ్లపై చేరుతుంది. అనంతరం బల్దియా క్లీన్ చేయకపోతుండగా ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొంది. రోడ్లపై బిల్డింగ్ మెటీరియల్ పోసే వారిపై చట్టపరంగా జీహెచ్ఎంసీ  అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. పెద్దగా పట్టించుకోవట్లేదు. నిర్మాణ వ్యర్థాలు, కన్​స్ట్రక్షన్ మెటీరియల్ తరలించే వాహనాల డ్రైవర్లు,  నిర్మాణదారులు, మెటిరియల్ అమ్మేవారికి  అవగాహన కల్పిస్తే ముందుగా జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంది.  

రోడ్లపైనే కుప్పలుగా పోసి అమ్మకాలు

సిటీలోని చాలా ప్రాంతాల్లో మెయిన్ రోడ్లపైనే ఇసుక, కంకర కుప్పలుగా పోసి వ్యాపారులు అమ్మకాలు చేస్తుంటారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని రోడ్లు వాహనదారులు ప్రమాదకరంగా మారాయి. హయత్​నగర్ పరిధి ఆటోనగర్ – విజయవాడ హైవే పక్కన ఇసుక లారీలను ఆపడమే కాకుండా ఒక లారీలోంచి మరో లారీలోకి డంప్​ చేస్తారు. ఆ సమయంలో రోడ్లపై ఇసుక పడుతుంది. టోలిచౌకి​ఫ్లై పక్కన రోడ్డు, అత్తాపూర్​లోనూ ఇసుకను స్టోరేజ్​ చేస్తుంటారు. అదేవిధంగా బంజారాహిల్స్ రోడ్ నం.7, ఖైరతాబాద్, బండ్లగూడ, ఫతేనగర్, లోటస్ పాండ్, లంగర్​హౌస్, బషీర్ బాగ్, రాంకోఠితో పాటు చాలా ప్రాంతాల్లో వానలతో కొట్టుకొచ్చి రోడ్లుపై పేరుకుపోతుండగా బైక్​లు  స్కిడ్ అయి పడుతున్నా అధికారులు, పోలీసులు ఎవరూ పట్టించుకోవడంలేదు.  రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా బైక్​లే ఉంటున్నాయి.   

వెయ్యికిపైగా డేంజర్ స్పాట్స్..

గ్రేటర్​లో వెయ్యికి పైగా డేంజర్​ స్పాట్స్​ ఉన్నట్లు నిపుణుల అంచనా . ఆయా ప్రాంతాల్లో ప్రతిరోజు ఒకరైన, కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 10  బైక్​లు స్కిడ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. కొందరికి చిన్నపాటి గాయాలు అయితే.. స్పీడ్​గా వెళ్లేవారు తీవ్రంగా గాయపడి దవాఖానల్లో చేరుతున్నారు. అత్యాధునిక వాహనాలతో రోజూ రోడ్లను క్లీన్​ చేస్తున్నామని జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ ఎక్కడ అలా కనిపించడంలేదు. వానలకు గుంతలు పడి వాటిలో మట్టి చేరడం, రెండు, మూడ్రోజులకోసారి కూడా అధికారులు క్లీన్​ చేయించడం లేదు. కొత్త నిర్మాణాలకు లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లతో పాటు ఇతర వాహనాల్లో మెటీరియల్ తరలిస్తుండగా కింద పడుతుండగా రోడ్లు కూడా ప్రమాదకరంగా ఉంటున్నాయి. ఇలా డేంజర్ స్పాట్లతోనే యాక్సిడెంట్లకు కారణమైతుంది.