మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

ములుగు: మేడారం మహాజాతరకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం మేడారం జాతర ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం మేడారంలో నలుగురు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ పర్యటించి.. సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుంటారని చెప్పారు.

అనంతరం మేడారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. మహా జాతర ఏర్పాట్లు భక్తులకు కల్పించిన సౌకర్యాలపై అన్ని శాఖలతో మంత్రులు రివ్యూ నిర్వహిస్తారని చెప్పారు. జాతరకు ముందే గత నెల రోజుల్లో 50 లక్షల మంది భక్తులు మేడారంకు వచ్చారని కలెక్టర్ చెప్పారు. మహా జాతరకు కోటి 50 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున క్యూ లైన్, గద్దల దగ్గర స్ప్రింగ్లర్లతో వాటర్ స్ప్రే చేయిస్తామని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులు ప్లాసిక్ వస్తువులు తీసుకురాకుండా సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి భక్తులను కోరారు.