ములుగు మున్సిపాలిటీపై అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

ములుగు మున్సిపాలిటీపై అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

ములుగు, వెలుగు: ములుగు జిల్లా కేంద్రం ఎట్టకేలకు మున్సిపాలిటీగా మారింది. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో మొట్టమొదటి తాలుకాగా ఉన్న ములుగును.. ప్రత్యేక రాష్ట్రంలో జిల్లాగా ఏర్పాటు చేశారు. కానీ జిల్లాకేంద్రాన్ని మాత్రం గ్రామ పంచాయతీగానే కొనసాగించారు. దీంతో ప్రజలు అనేక పోరాటాలు చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ పర్యటనలోనూ ఈ అంశం తెరపైకి వచ్చింది. స్పందించిన ప్రభుత్వం.. ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో ప్రతిపాదన పెట్టింది, మెజారిటీ సభ్యులు దీనిని ఆమోదించారు. కాగా, జీపీ పాలకవర్గం పదవీ కాలం ముగిశాకే, మున్సిపాలిటీ ఏర్పాటు అవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.

పోరాటాలతోనే..

తెలంగాణ ఏర్పాడ్డాక 2016లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను పునర్విభజన చేసింది. కానీ ములుగును మాత్రం జిల్లాగా మార్చలేదు. ఏజెన్సీ ఏరియా ఎక్కువగా ఉన్నందున, పాలన సౌలభ్యం కోరుతూ.. జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో 2019 ఫిబ్రవరి 17న మరిన్ని జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ములుగుకు జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ జిల్లాకేంద్రాన్ని మాత్రం పంచాయతీగానే ఉంచారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీగా ఉన్న మొట్టమొదటి జిల్లాకేంద్రం ములుగు కావడం విశేషం. దీంతో ఇక్కడి ప్రజలు మళ్లీ ధర్నా చేసి, మున్సిపాలిటీగా మార్చాలని కోరారు.

కలువనున్న గ్రామాలివే..

ములుగును మున్సిపాలిటీగా మార్చేందుకు జనాభా తక్కువగా ఉండడంతో చుట్టుపక్కల గ్రామాలను అందులో కలుపుతూ.. డీపీవో వెంకయ్య ప్రభుత్వానికి నివేదిక పంపారు. ములుగుతోపాటు బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామాలను విలీనం చేశారు. ఇప్పటికే ములుగు గ్రామ పంచాయతీ పరిధిలో రంగారావుపల్లి, ప్రేమ్ నగర్, మాధవరావుపల్లి, పాల్సాబ్ గ్రామాలుండగా.. జీవంతరావుపల్లిలో గణేశ్ లాల్ పల్లి గ్రామం ఉంది. బండారుపల్లి పరిధిలో ఏ గ్రామాలు లేవు. దీంతో మున్సిపాలిటీ పరిధిలోకి 8 గ్రామాలు రానున్నాయి.

నాయకుల హర్షం..

ములుగుజిల్లాకేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చడం పట్ల వివిధ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ తో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.

జిల్లా కేంద్రానికి మహర్దశ..

ములుగు మున్సిపాలిటీగా మారితే పాలన సౌలభ్యం మెరుగుపడుతుంది. వివిధ రకాల అనుమతులు ఈజీగా వస్తాయి. ఆన్ లైన్ సేవలు అధికమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు పెరుగుతారు. పట్టణీకరణ పెరిగి, పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్య, వైద్యం, పారిశుధ్యం మెరుగుపడుతుంది. మున్సిపల్ యాక్ట్ ప్రకారం నిధులు అందుతాయి. కాగా, ప్రజలకు మాత్రం పన్నుల భారం పడే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా, జీపీ పాలకవర్గం పదవీకాలం పూర్తయ్యాకే మున్సిపాలిటీ యాక్ట్ అమలు అవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.