వలసలు ఆగాయనేందుకు ముంబై బస్సు బంద్!

వలసలు ఆగాయనేందుకు ముంబై బస్సు బంద్!

నారాయణపేట, వెలుగు : జిల్లా కేంద్రం నుంచి ముంబై వెళ్లే బస్సును బంద్​ చేసి, కార్మికుల వలసలు తగ్గాయని చెప్పేందుకు నాయకులు  ప్రయత్నిస్తున్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఆర్టీసీ బస్సును బంద్​ చేసినా ప్రైవేటు వెహికల్స్​ను, రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ప్రతిరోజూ జిల్లా కేంద్రం నుంచి వలస కార్మికులు గుల్బార్గా వరకు వెళ్లి  అక్కడి నుంచి వివిధ మార్గాల ద్వారా ముంబైకి  చేరుతున్నారు. బస్సుబందు పెట్టడంతో తిప్పలు.. జిల్లాలో పంటలకు సాగునీరు లేక, సాగులో లాభాలు రాక... స్థానికంగా వలసలు పెరుగుతున్నాయి. చాలామంది ఇప్పటికే కుటుంబాలతో ముంబైవెళ్లి స్థిరపడ్డారు. వారంతా పండుగలప్పుడు ఇక్కడి వస్తుంటారు. దీంతోపాటు ఉపాధికోసం వలస వెళ్లేవారు నిత్యం ఉంటున్నారు. వీరందరి కోసం గతంలో ప్రతి రోజూ ముంబైకి ఆర్టీసీ బస్సు నడిచేది. బస్సు కెపాసిటీ 60 మంది ఉన్నా.. పిల్లలతో కలిసి దాదాపు 100మంది వరకూ అందులో వెళ్లేవారు. ఇటీవల కాలంలో నారాయణపేట నుంచి వలసలు తగ్గాయని అధికార పార్టీ నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. అందులోభాగంగానే జనవరి 5 నుంచి ముంబై బస్సును బంద్​ చేశారు. కూలీలు ఎక్కువ ముంబై వెళ్లడం లేదని, కలెక్షన్​  తక్కువగా రావడం వల్ల రద్దు చేసినట్టు అధికారులు అంటున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం బస్సురద్దుపై వలస కార్మికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

స్థానికంగా దొరకని ఉపాధి..     

జిల్లాలో కృష్ణా నది ఉన్నా.. ఇక్కడి ప్రజలకు ఆ నీరు అందడం లేదు. ఉపాధి కల్పించే పరిశ్రమలూ లేవు. దీంతో ఇక్కడి ప్రజలు పొట్ట చేతపట్టుకొని వేరే రాష్ట్రాలకు వలస వెళ్లక తప్పడం లేదు. మొదట్లో గుంపు మేస్త్రీల ఆధ్వర్యంలో  వలస వెళ్లగా.. తర్వాత కాలంలో ప్రజలే స్వయంగా పనులు చేసుకోవటానికి ఇతర ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభించారు. జిల్లాలోని అనేక గ్రామాల నుంచి బెంగళూరు, ముంబైకి కుటుంబంతో కలిసి వెళ్తున్నారు. కరోనా టైంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.50 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అయితే ముంబైలోనే 40శాతం మంది కూలీకోసం వెళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ముఖ్యంగా నారాయణపేట, ధన్వాడ, మరికల్​, దామరగిదద్ద, ఊట్కూర్​, మద్దూర్​, కోస్గి మండలాల నుంచి  వలస ఎక్కువగా ఉంది.   ముసలివాళ్లని, పిల్లలను ఇక్కడే విడిచి పని కోసం వలస  వెళ్తున్నారు. 

జిల్లాగా ఆవిర్భవించినా... మారని పరిస్థితి.. 

తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాలో వలసలు తగ్గాయని చెప్పటానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కార్మికులు, ప్రతిపక్షాల నాయకులు విమర్శిస్తున్నారు. జిల్లాగా ఏర్పడినా సాగునీటి ప్రాజెక్టులు రాలేవని, ఉపాధి దొరకడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గత నెలలో మంత్రి కేటీఆర్​ ప్రోగ్రాం ఉండటంతో అప్పటికే వలసలు తగ్గాయని చెప్పటానికి ముందస్తుగా బస్సును బంద్​ చేశారని విమర్శలున్నాయి. 

ఆగిన జీవో 69..

రాష్ట్రం ఏర్పడిన సమయంలో అప్పటి గవర్నర్​ పాలనలో కొడంగల్​ ఎత్తిపోతల పేరుతో జీవో 69ను విడుదల చేశారు. దీనికి 90 శాతం కేంద్రం, 10శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. కానీ, ఈ ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డి పథకం ద్వారా నీరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని రైతులు అంటున్నారు.  తెలంగాణ ఏర్పడి తొమ్మిదేండ్లవుతున్నా సాగునీరు అందించకుండా రైతులను మోసం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.  

కలెక్షన్​ తగ్గటంతోనే  బస్సును బంద్​ చేశాం...

నారాయణపేట నుంచి ముంబైకి వెళ్లే బస్సులో కలెక్షన్​ తగ్గింది.  అందుకే బస్సును నిలిపేశాం. మొదట మంచి కలెక్షన్​ ఉండేది.  కానీ ఇప్పుడు తగ్గింది.  నష్టాల్లో ఉన్న రూట్​లలో బస్సులు నడపలేం. 
ఆంజనేయులు, డిపో మేనేజర్​,