తాళాలేస్తున్రు.. తలుపులు ఎత్తుకెళ్తున్రు

తాళాలేస్తున్రు.. తలుపులు ఎత్తుకెళ్తున్రు
  • పన్నుల వసూళ్లపై సర్కారు హెచ్చరికలతోనే..
  • ప్రాపర్టీ టాక్స్ కోసం  జనాలపై పడ్డ మున్సిపాలిటీలు
  • కట్టకపోతే దొరికింది పట్కపోతున్నరు 
  • ఇండ్లు, షాపులకు తాళాలు..సీజ్​
  • నెలాఖరు నాటికి    95 శాతం వసూళ్లే టార్గెట్​ 

ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఇచ్చే ఫండ్స్ చాలకపోవడంతో ఆఫీసర్లు పన్నుల వసూళ్ల మీద పడ్డరు.  టైం అడుగుతున్నా వినకుండా ఇంటి దర్వాజలు, కిటికీలు, గేట్లు ఇలా ఇంట్లో ఏముంటే వాటిని ఎత్తుకెళ్తున్నారు. 

నల్గొండ, వెలుగు : మున్సిపల్​ ఆఫీసర్లు పన్నుల వసూళ్ల కోసం జనాల ఇండ్లు, షాపులపై పడ్డారు. వెంటనే ప్రాపర్టీ ట్యాక్స్​కట్టాల్సిందేనని పట్టుబడుతున్నారు. టైం అడుగుతున్నా వినకుండా ఇంటి దర్వాజలు, కిటికీలు, గేట్లు ఇలా ఏవి దొరికితే వాటిని పట్టుకుపోతున్నారు. కొన్ని చోట్ల ఇండ్లకు, షాపులకు తాళాలు కూడా వేస్తున్నారు. నెలాఖరులోగా పాత బకాయిలు, ఈ ఏడాది పన్నులతో కలిపి 95 శాతం వరకు రాబట్టేందుకు రెడ్ నోటీసులు ఇష్యూ చేస్తున్నారు. ఆఫీసర్ల ఒత్తిళ్లు భరించలేక చిరు వ్యాపారులు స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్​తో నష్టపోయామని, ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే పన్నులు కట్టకపోతే సీజ్ ​చేస్తామని బెదిరిస్తూ మానసికంగా హింసిస్తున్నారని వాపోతున్నారు. తమకు సాయం చేయాలని కోరుతున్నారు. కాగా, ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఇచ్చే ఫండ్స్ చాలకపోవడం, పట్టణ ప్రగతి ఫండ్స్ సరిపోకపోవడంతోనే  పన్నుల వసూళ్లను సీరియస్​గా తీసుకున్నట్టు తెలుస్తోంది. పైగా వసూళ్ల కోసం స్వయంగా మున్సిపల్ కమిషనర్లే రంగంలోకి దిగుతున్నారు.  

మెమోలు ఇష్యూ చేస్తామనడంతో...
రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఆర్ధిక సంఘం నుంచి వచ్చే నిధులు ఎటూ సరిపోవడం లేదు. 2020–-21 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 141 మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి కింద నెలకు రూ.171.90 కోట్ల చొప్పున రూ. 2,062.86 కోట్లు రిలీజ్ ​చేశారు. 2021–-22 ఆర్ధిక సంవత్సరం నుంచి నెలకు రూ.145 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి సగం, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి సగం ఇస్తున్నారు. ఈ నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తుండడంతో పెద్ద మున్సిపాలిటీలకు ఎక్కువ, చిన్న మున్సిపాలిటీలకు తక్కువ వస్తున్నాయి. సగటున ఒక్కో మున్సిపాలిటీకి రూ.100 కోట్లు మాత్రమే వస్తున్నాయి. కొన్ని పెద్ద మున్సిపాలిటీల్లో సిబ్బంది ఎక్కువగా ఉండడంతో మెయింటనెన్స్​భారీగా పెరిగింది. దీంతో వచ్చే పన్నుల్లో నాలుగో వంతు సిబ్బంది జీతభత్యాలకే సరిపోతోంది. మిగిలిన మొత్తం పట్టణ ప్రగతి పనులకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీంతో డెవలప్​మెంట్​వర్క్స్ పెండింగ్​లో పడిపోతున్నాయి. కొత్త మున్సిపాలిటీల్లో, విలీన పంచాయతీలు కూడా ఉండడంతో వాటిల్లో ఆశించిన అభివృద్ధి జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో సొంతంగా ఆదాయం సమకూర్చుకోకపోతే నిధుల సమస్య వస్తుందని సర్కారు హెచ్చరించడంతో అధికారులు ఆస్తి పన్ను వసూళ్లపై పడ్డారు. ఈనెలాఖరులోగా నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోతే ఆఫీసర్లకు మెమోలు ఇష్యూ చేస్తామని సర్కారు హెచ్చరించడంతో ఆఫీసర్లు ఉరుకులు పరుగులు పెడుతూ ప్రజలపై ప్రతాపాన్ని చూపిస్తున్నారు. 

కరోనా టైంలో బకాయిలు కూడా కట్టాలె.. 
కరోనా కారణంగా మూడేండ్ల నుంచి మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు సక్రమంగా చేయడం లేదు. దీంతో అన్ని చోట్ల బకాయిలు కోట్లలో పేరుకుపోయాయి. లాక్​డౌన్ ​టైంలో అన్ని రకాల వ్యాపారాలు, స్కూళ్లు, సినిమా థియేటర్లు చాలా రోజులు మూతపడ్డాయి. లాక్​డౌన్​ఎత్తేశాక అప్పటి అప్పులు, నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఇప్పుడు కూడా కష్టపడాల్సి వస్తోంది. కానీ పన్నుల వసూళ్ల పేరిట మున్సిపల్ స్టాఫ్ మూడేండ్ల నుంచి పెండింగ్​లో ఉన్న బకాయిలు ఒకేసారి చెల్లించాలని నోటీసులిస్తున్నారు. పాత వాటికి రూ. రెండు చొప్పున వడ్డీ కలిపి పెనాల్టీ విధిస్తున్నారు. దీంతో అసలు, పెనాల్టీ కలిపి డబుల్ ​అయ్యింది. కరోనాతో ఆర్ధికంగా చితికిపోయిన తమకు పన్నుల్లో రాయితీ ఇవ్వాల్సింది పోయి వడ్డీతో కలిపి కట్టాలని నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదని వ్యాపారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్త మున్సిపాలిటీల్లో పరిస్థితి మరో రకంగా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు కొత్త ట్యాక్స్​లు ఖరారు చేయలేదు. దీంతో పంచాయతీలుగా ఉన్నప్పటి నుంచి..ఇప్పటివరకు ఎంత బకాయిలు ఉన్నాయో ఆ మొత్తంపై పెనాల్టీ వేసి మరీ పన్నులు కట్టాలంటూ నోటీసులిస్తున్నారు. లేదంటే అందరూ చూస్తుండగానే ఇండ్లను జప్తు చేయడంతో పాటు షాపులను సీజ్ ​చేస్తున్నారు.