ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

నాగర్​కర్నూల్, వెలుగు: నాగర్​కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్​ఎంపిక సస్పెన్స్​థ్రిల్లర్​ను తలపిస్తోంది. ఈ నెల 22తో ఎన్నికకు గడువు ముగియనుండగా ఇంత వరకు బీఆర్ఎస్​హైకమాండ్ ఎవరి పేరునూ ప్రకటించకపోవడం జిల్లాలో హాట్​టాపిక్ గా మారింది. జడ్పీ చైర్​పర్సన్​గా ఉన్న తెల్కపల్లి పద్మావతిపై అనర్హత వేటు పడ్డాక, వైస్ చైర్మన్ బాలాజీకి తాత్కాలిక ఇన్​చార్జ్​గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం చైర్మన్​రేసులో ఎంపీ రాములు కొడుకు, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్, ఊర్కొండ జడ్పీటీసీ శాంతికుమారి ఉన్నారు. జడ్పీ ఎన్నికలు జరిగిన టైంలోనే భరత్ ప్రసాద్​కు కుర్చీ దక్కుతుందని అంతా అనుకోగా, జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు చక్రం తిప్పి తెల్కపల్లి జడ్పీటీసీ పద్మావతికి దక్కేలా చేశారు. ముగ్గురు సంతానం కేసులో పద్మావతిపై అనర్హత వేటు పడడంతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత చైర్మన్​ఎంపిక అనివార్యం కావడంతో భరత్ ప్రసాద్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాలో 20 మంది జడ్పీటీసీలు ఉండగా అధికార పార్టీ నుంచి 16 మంది, నలుగురు కాంగ్రెస్​సభ్యులు ఉన్నారు.

పట్టు వదలకుండా ప్రయత్నం

సహాయ మంత్రి హోదా ఉండే జడ్పీ చైర్మన్​పదవిని తనకే ఇవ్వాలని భరత్ ప్రసాద్ తండ్రితో కలిసి సీఎం కేసీఆర్, వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ను కలిసి రిక్వెస్ట్ చేశారు. అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు ఊర్కొండ జడ్పీటీసీ శాంతికుమారికి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఇద్దరు ఎమ్మెల్యేల డైరెక్షన్​లో పార్టీ జడ్పీటీసీలతో విడతలవారీగా సమావేశం 
నిర్వహిస్తున్నారని సమాచారం. హైకమాండ్ అడిగితే ఏం చెప్పాలో ముందే బ్రీఫింగ్ ఇప్పిస్తున్నారని తెలిసింది. జిల్లాలో ఎమ్మెల్యేల మాటకిచ్చే విలువ తమకు లేనప్పుడు మధ్యలో తామేందుకు తలదూర్చాలని ముగ్గురు ఎమ్మెల్సీలు అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో బిజీగా ఉంటున్నా జడ్పీ చైర్ పర్సన్ క్యాండిడేట్, ఎంపిక టాపిక్ చర్చకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. సన్నిహితులతో కూడా ఈ విషయం మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు.

నేషనల్​ హైవేకు దళితుల భూములివ్వం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  కల్వకుర్తి –- నంద్యాల నేషనల్​ హైవేకు దళితుల భూములు ఇచ్చేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ చెప్పారు. సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్​ హైవేను తాడూరు మండల కేంద్ర సమీపంలోని దళిత భూముల మీదుగా  వేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దళిత కుటుంబాలకు చెందిన ఎకర, రెండు ఎకరాలు తీసుకోవద్దని, ఐదు, పది ఎకరాల పైగా ఉన్న భూముల్లోంచి వేయాలని కోరారు. గతంలో మార్కింగ్ ఇచ్చి తిరిగి  ఎందుకు మార్చారని ప్రశ్నించారు. రోడ్డుకు ఇరువైపులా ఎస్సీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన రైతుల భూములే ఉన్నాయని తెలిపారు. రూట్​మార్చకపోతే కలెక్టరేట్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కేవీపీఎస్​ జిల్లా అధ్యక్షుడు కాశన్న, డీహెచ్​పీఎస్ జిల్లా కార్యదర్శి లక్ష్మీపతి, భరత్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.  

పాలమూరులో ఫిజియోథెరపీ కాలేజీ పెడ్తున్నం

మహబూబ్ నగర్, వెలుగు: మహబూబ్​నగర్​లో ఫిజియోథెరపీ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్​గౌడ్ తెలిపారు. ఆంధ్ర మహిళా సభ సహకారంతో కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ ఆఫీస్​లో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఆంధ్ర మహిళా సభ ద్వారా కాలేజీ ఏర్పాటుకు కృషి చేసిన సంఘ సేవకులు, మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణరావుకు జనరల్ సెక్రటరీ లక్ష్మీ సుందరికి కృతజ్ఞతలు తెలిపారు. జనవరి నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు గవర్నమెంట్​హాస్పిటల్​దగ్గరలోని ఏఎంఎస్ భవనంలో కాలేజీ కొనసాగుతుందని వెల్లడించారు. అంతకు ముందు నియోజకవర్గ పరిధిలోని 64 మంది లబ్ధిదారులకు రూ.56.03 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఎంబీ చర్చిలో గిఫ్ట్ ప్యాక్ లు పంచారు. 

రోడ్డు మంచిగ లేదని ఎమ్మెల్యే ఫైర్

ధన్వాడ, వెలుగు: ధన్వాడ మండలంలోని కిష్టాపూర్ నుంచి మడిగెలమొల తండాకు వేసిన బీటీ రోడ్డు సరిగా లేదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్​రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చు చేసి వేస్తున్న రోడ్ల నాణ్యతను పట్టించుకోరా అని అధికారులపై మండిపడ్డారు. పనులు చేసిన కాంట్రాక్టర్​కు బిల్లులు నిలిపివేయాలని ఆదేశించారు. రూ.3 కోట్లతో కొత్తగా నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే రాజేందర్​సోమవారం ప్రారంభించారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలు పూడ్చకుండా బీటీ పనులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా పనులు చేస్తున్నప్పుడు పట్టించుకోరా అని సర్పంచులని ప్రశ్నించారు. గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి తండాకు బీటీ రోడ్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి పాండునాయక్​ టీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో ఈఈ నరేందర్, ఎంపీడీఓ సద్గుణ, ఏఈ ప్రవీణ్​కుమార్, సర్పంచులు దామోదర్​రెడ్డి, హోన్యనాయక్, నారాయణ్​రెడ్డి, మాధవరెడ్డి, వైస్​ ఎంపీపీ రాజేందర్​రెడ్డి, ఎంపీటీసీలు సుధీర్ కుమార్, కడపయ్య, ఎంపీఓ సుదర్శన్ పాల్గొన్నారు. 

భూ సమస్యలపై ఫోకస్​ పెట్టండి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలోని భూ సమస్యల పరిష్కారంపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని మహబూబ్​నగర్​కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆదేశించారు. సోమవారం ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. అంతకు ముందు జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వెంటనే అన్ని ఆఫీసులను సామగ్రితో సహా కొత్త కలెక్టరేట్ కు మార్చాలని చెప్పారు. లేదంటే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు స్థలాలు గుర్తించినప్పటికీ తహసీల్దార్, ఎంపీడీఓ ఇచ్చే నివేదిక ఒకేలా ఉండేలా చూడాలని, ఇద్దరూ చర్చించుకుని తయారు చేయాలని చెప్పారు. గ్రామల్లో జంతువులను హింసించొద్దని కలెక్టర్ అన్నారు. ఎక్కడైనా జంతువులతో హాని ఉందని అనుకుంటే, వాటిని మహబూబ్ నగర్ జంతు సంరక్షణ కేంద్రంలో విడిచి పెట్టాలని చెప్పారు. ఈ విషయంపై తహసీల్దార్లు, పశుసంవర్థక అధికారి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తక్షణమే ఎంపీడీఓలతో సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ కె.సీతారామారావు, ఇన్​చార్జ్ ఆర్డీఓ ప్రేమ్​రాజ్, డీఆర్డీఓ యాదయ్య, ఆఫీసర్లు పాల్గొన్నారు.