- జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్
నల్గొండ, వెలుగు: రెవెన్యూ అధికారులు అంకితభావంతో, చిత్తశుద్ధితో ప్రజల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. పెండింగ్ లో ఉన్న వివిధ రకాల దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో రెవెన్యూ అంశాల పై సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న భూ భారతి, భూ రికార్డులు, భూమి వివాదాలు, రెవెన్యూ సదస్సులలో సాదా బైనామా లపై వచ్చిన అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. ప్రతి మండలంలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను సమీక్షించాలన్నారు.
భూ సంబంధ వ్యవహారాలలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. అసైన్డ్ భూముల విషయంలో పెండింగ్ సమస్యలు త్వరగా పరిష్కరించాలని చెప్పారు. విద్యార్థుల స్కాలర్ షిప్ లకు సంబంధించి విద్యార్థులు ఇబ్బందులు పడకుండా క్యాస్ట్, ఇన్ కం సర్టిఫికెట్‌లను వెంటనే ఇవ్వాలన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంకు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఓటరు మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 61 శాతం పూర్తి చేశామన్నారు. దీన్ని 75 శాతానికి తీసుకువెళ్లేందుకు ప్రతి రోజు బీఎల్ఓలతో సమీక్షించాలన్నారు. సమీక్ష సమావేశానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవోలు, తహసీల్దార్లు హాజరయ్యారు.
