నకిలీ పత్తి విత్తనాల పట్టివేత.. నాలుగు ప్యాకెట్ల తీగ లాగితే కదిలిన భారీ డొంక

నకిలీ పత్తి విత్తనాల పట్టివేత.. నాలుగు ప్యాకెట్ల తీగ లాగితే కదిలిన భారీ డొంక

నల్లగొండ : అంతర్ రాష్ట్ర నకిలీ పత్తి విత్తనాల రాకెట్ గుట్టు రట్టు చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. నాలుగు ప్యాకెట్ల తీగ లాగితే కదిలిన భారీ డొంక క‌దిలింది. అనుమానం ఉన్న ప‌లు చోట్ల పోలీసులు దాడులు చేసి 30 లక్షల విలువైన 15 క్విటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఈ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్ల‌డిస్తూ.. నల్లగొండ జిల్లా చండూర్ మండలంలోని కమ్మగూడెంలో నాలుగు పత్తి విత్తన ప్యాకెట్లు సరైన ప్యాకింగ్, లేబిల్ లేక‌పోవ‌డాన్ని పోలీసులు గ‌మ‌నించారు.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల కేంద్రంగా ఈ నకిలీ విత్తనాల దందా సాగుతున్నట్లు గుర్తించామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. జిల్లాలోని చండూర్, మునుగోడు, నకిరేకల్, గుర్రంపోడు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ విత్తనాలతో పాటు తయారీ మిషనరీ, ప్యాకింగ్ మిషన్స్, కాంటాలు, కార్లు, ఆటో, సెల్ ఫోన్స్ సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎస్పీ రంగనాధ్ నేతృత్వంలో అదనపు ఎస్పీ సతీష్, చండూర్ సిఐ సురేష్, టాస్క్ ఫోర్స్ సిఐలు నాగేశ్వర్ రావు, రాఘవులు, ఎస్.ఐ., సిబ్బంది సమర్ధవంతంగా కేసును ఛేదించారు.

ఈ న‌కిలీ విత్త‌నాల దందాకు సంబంధించి 23 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని ఎస్పీ అన్నారు. పరారీలో మరికొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామన్నారు.నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని రైతుల‌కు సూచించారు. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలను మాత్రమే వాడాలన్నారు.