- రెండు కాళ్లు విరగడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో గోప్యంగా ట్రీట్ మెంట్
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లా తిప్పర్తి ఎస్సీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న వేముల శివ సాయి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ ఘటనలో రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడిన శివసాయి ప్రస్తుతం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. టీచర్ మల్లయ్య, ప్రిన్సిపల్ సునీత తనను తరచూ వేధిస్తున్నారని శివసాయి గతంలోనే తనకు చెప్పాడని తల్లి పద్మ ఆరోపించారు.
అయితే ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత పాఠశాల యాజమాన్యం తన కొడుకును చూసేందుకు రాలేదని, ఇప్పటివరకు ఆపరేషన్ కూడా చేయలేదని ఆమె వాపోయారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలని కోరింది. ప్రిన్సిపల్ సునీత, టీచర్ మల్లయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
