టీఎస్ బీపాస్ పోర్టల్​లో ఊర్ల పేర్లు కన్పిస్తలే

టీఎస్ బీపాస్ పోర్టల్​లో ఊర్ల పేర్లు కన్పిస్తలే

ఇంటి నిర్మాణం, లేఅవుట్​ పర్మిషన్లకు ఇబ్బందిపడుతున్న జనం
పోర్టల్​లో డిస్ ప్లే అయిన ఊర్లలోనూ సమస్యలు 
పెట్టుకున్న దరఖాస్తులకు నో రెస్పాన్స్ 
21 రోజులు గడిచినా రాని పర్మిషన్లు
ఏ ఆఫీసర్ దగ్గర అప్లికేషన్ ఆగిందో తెలియని పరిస్థితి

వరంగల్ ప్రతినిధి, వెలుగు : ఇంటి నిర్మాణం, లేఔట్లకు సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన టీఎస్ బీపాస్ పోర్టల్ లో ఊర్ల పేర్లు కనిపించడం లేదు. దీంతో గ్రామపంచాయతీల పరిధిలో ఇండ్లు కట్టుకునేవారికి, అధికారికంగా వెంచర్లు వేయాలనుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తిప్పలు తప్పడం లేదు. కొన్ని  జిల్లాల్లో పేర్లు కనిపిస్తున్నా.. అప్లికేషన్లకు మోక్షం కలగడం లేదు. సంబంధిత పీఆర్, ఇరిగేషన్ ఇంజినీర్లకు లాగిన్ ఇవ్వకపోవడంతో అప్రూవ్ చేసేవారు లేక అప్లికేషన్లన్నీ అండర్ ప్రాసెస్ అని చూపిస్తున్నాయి. అధికారులు ఒకవేళ ఆలస్యం చేస్తే 21 రోజుల్లో ఆటోమేటిగ్గా పర్మిషన్ ఇచ్చేసినట్లేనని మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాలు చెప్తున్నా.. అది ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. ప్రధానంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో, జిల్లా కేంద్రాలకు సమీపంలో,  జాతీయ రహదారుల వెంట ఉన్న గ్రామాల్లో ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వేలాది గ్రామాల పేర్లు మిస్సింగ్

అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఈ–పంచాయతీ ద్వారా లేఔట్ అనుమతులు, 300 గజాలు దాటిన స్థలంలో ఇంటి నిర్మాణానికి పర్మిషన్ తీసుకోవడం కుదరదు. ఇందుకోసం టీఎస్ బీపాస్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందే. అయితే రాష్ర్టంలోని చాలా గ్రామపంచాయతీల పేర్లు టీఎస్ బీపాస్ పోర్టల్ లో ఇప్పటి వరకు ఎంట్రీ కాకపోవడంతో ఆయా గ్రామాల జనం, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇంటి నిర్మాణం, లేఔట్ పర్మిషన్ల కోసం అప్లై చేసుకోలేకపోతున్నారు. జనగామ జిల్లాలో జనగామ మండలం, మున్సిపాలిటీ తప్పా మరో మండలంగానీ, ఊరు పేరుగానీ కనిపించడం లేదు. యాదాద్రి జిల్లాలోనూ ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీలు, భువనగిరి, యాదగిరిగుట్ట  మండలాల్లో నాలుగు ఊర్ల చొప్పున మాత్రమే కనిపిస్తున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ లో పోచారం మున్సిపాలిటీ మినహా మిగతా ఊర్ల పేర్లు కనిపించడం లేదు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన సిద్దిపేట జిల్లాలో చేర్యాల, దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీలు, మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు తప్పా మిగతా గ్రామాల పేర్లు టీఎస్ బీపాస్ పోర్టల్​లో ఎంట్రీ చేయకపోవడం గమనార్హం. కేవలం కరీంనగర్ జిల్లాలో మాత్రమే మండలాల పేర్లన్నీ కనిపిస్తున్నాయి.

ఇంజినీర్లకు అందని లాగిన్​

గ్రామ పంచాయతీల్లో లేఔట్ అప్లికేషన్లను సైట్ ఇన్ స్పెక్షన్ ఆఫీసర్ గా కలెక్టర్ నామినేట్ చేసిన ఇంజినీర్ అప్రూవల్ చేయాల్సి ఉంది. అలాగే లేఔట్(10 ఎకరాల వరకు) ఉంటే  జిల్లా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్(డీటీసీపీఓ), లేఔట్10 ఎకరాలు మించితే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ టైటిల్ అండ్ టెక్నికల్ వెరిఫికేషన్ ఆఫీసర్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక బిల్డింగ్ పర్మిషన్ విషయానికొస్తే మండలం యూనిట్​గా టీఎస్ బీపాస్​ను అమలు చేస్తున్నారు. ఈ  సైట్లను సైట్ ఇన్ స్పెక్షన్ ఆఫీసర్(రెవెన్యూ ఇన్ స్పెక్టర్/ డిప్యూటీ తహసీల్దార్),  టైటిల్ అండ్ టెక్నికల్ వెరిఫికేషన్ ఆఫీసర్(పీఆర్ ఏఈఈ/ఏఈ)  తనిఖీ  చేయాల్సి ఉంటుంది. తనిఖీల కోసం పని చేయాల్సిన సైట్ ఇన్ స్పెక్షన్ ఆఫీసర్లు, టైటిల్ అండ్ టెక్నికల్ వెరిఫికేషన్ ఆఫీసర్లను చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఇంకా నియమించలేదు. నియమించిన జిల్లాల్లో వారికి టీఎస్ బీపాస్ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఇవ్వలేదు. దీంతో అప్లికేషన్లు సదరు అధికారులకు చేరడం లేదు. అలాగే కొన్ని ఎంట్రీ అయిన గ్రామపంచాయతీల నుంచి దరఖాస్తులు పెట్టుకున్నా.. ఆ ఊర్లకు సైట్ ఇన్ స్పెక్షన్ ఆఫీసర్లను నియమించకపోవడంతో అప్రూవ్ కావడం లేదు. దీంతో అప్లికేషన్ పెట్టినా ఫాయిదా ఉండడం  లేదు.

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేటలో ఓ వ్యక్తి తనకున్న ఎకరంన్నర జాగా చుట్టూ  కాంపౌండ్ వాల్ తోపాటు ఇల్లు నిర్మించాలనుకున్నాడు. ఇందుకు నవంబర్ 11న టీఎస్ బీపాస్  ద్వారా అప్లికేషన్  పెట్టుకున్నాడు. అప్లికేషన్ నంబర్ తో స్టేటస్ చెక్ చేస్తే ఇంకా అండర్ ప్రాసెస్ అని కనిపిస్తోంది. అప్లికేషన్ పెట్టుకుని 21 రోజులు దాటితే ఆటోమేటిగ్గా ఇంటి నిర్మాణ అనుమతి ఇచ్చినట్లేనని  మున్సి పల్, పంచాయతీరాజ్ చట్టాలు చెప్తున్నాయి. కానీ 27 రోజులు కావొస్తున్నా  ఎలాంటి పురోగతి లేదు. అసలు ఆ అప్లికేషన్ ఎక్కడ ఆగిందో దరఖాస్తుదారుకు తెలియడం లేదు.

వరంగల్-హైదరాబాద్ నేషనల్ హైవేలోని జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని చిన్న పెండ్యాలలో  ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి ఏడాది కింద తొమ్మిది ఎకరాల ల్యాండ్ కొనుగోలు చేశారు. అనధికార లేఔట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిషేధించడం తో.. లేఔట్ పర్మిషన్ కోసం టీఎస్ బీపాస్ పోర్టల్ ద్వారా అప్లికేషన్ పెట్టేందుకు వెళ్లా రు. అయితే పోర్టల్ లో చెక్ చేస్తే జనగామ జిల్లాలో జనగామ మండలం, మున్సిపాలిటీ తప్పా మరే ఇతర మండలాల పేర్లు కనిపించకపోవడం తో దరఖాస్తు చేయడానికి కుదర్లేదు. ఆ వ్యాపారులు హైదరాబాద్ లోని డీటీసీపీ అధికారులను సంప్రదిస్తే.. అది తమ పరిధిలో లేదని కాకతీయ అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ(కుడా) అధికారులను సంప్రదించాలని సూచించారు. ‘కుడా’కు వెళ్తే  దీంతో తమకు సంబంధం లేదని, కలెక్టర్ ను వెళ్లి కలవాలని సలహా ఇచ్చారు. అప్పులు తెచ్చి భూమిపై ఇన్వెస్ట్ చేసిన ఆ వ్యాపారులు రోజురోజుకు మిత్తీలు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.

లేఔట్లు చేయలేక ఫామ్ ల్యాండ్స్‌‌‌‌గా అమ్మకం

కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి పట్టాదారులతో అగ్రిమెంట్ చేసుకున్న భూముల్లో.. లేఔట్లకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మళ్లీ పాత దారినే ఎంచుకుంటున్నారు. నెలల తరబడి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, డీటీసీపీల చుట్టూ తిరిగి విసిగి వేసారి నాన్ లేఔట్ ప్లాట్లనే జనాలకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఫామ్ ల్యాండ్స్ పేరిట వెంచర్లు చేసి, ధరణి పోర్టల్ ద్వారా గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనివల్ల కొనుగోలుదారుడు మోసపోవడంతోపాటు సర్కార్ ఆదాయానికి కూడా గండిపడుతోంది.