ఆగస్టు 4 నుంచి నారసింహుడి పవిత్రోత్సవాలు

ఆగస్టు 4 నుంచి నారసింహుడి పవిత్రోత్సవాలు
  • మూడు రోజుల పాటు నిర్వహణ
  • పవిత్రోత్సవాల సందర్భంగా 5, 6 తేదీల్లో ఆర్జిత సేవలు బంద్‌‌‌‌

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సోమవారం నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం అంకురారోపణ కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 

5న స్నపన తిరుమంజనం, మూలమంత్ర హవనాలు, పవిత్ర అధివాసం, పవిత్రమాలల ధారణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 6న ఉదయం నిర్వహించే మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పూర్తికానున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా మంగళ, బుధ వారాల్లో స్వామివారి ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహహోమం, లక్షపుష్పార్చన పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఉత్సవాలు ముగిసిన అనంతరం గురువారం నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. రద్దీ కారణగా స్వామివారి దర్శనానికి రెండు గంటలు, స్పెషల్‌‌‌‌ దర్శనానికి అరగంట టైం పట్టింది. భక్తులు జరిపించిన నిత్య పూజలు, కైంకర్యాల ద్వారా ఆదివారం రూ.44,57,014 ఆదాయం వచ్చింది. ఇందులో ప్రసాద విక్రయం ద్వారా రూ.15,72,640, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.5,05,500, వీఐపీ దర్శనాల ద్వారా రూ.7.50 లక్షలు, బ్రేక్‌‌‌‌ దర్శనాలతో రూ.4,40,100 ఇన్‌‌‌‌కం వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు.

భక్తుల సౌకర్యార్థం లొకేషన్‌‌‌‌ క్యూఆర్‌‌‌‌ కోడ్‌‌‌‌లు

లక్ష్మీనరసింహుడి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం యాదగిరిగుట్టలోని వైకుంఠ ద్వారం వద్ద, ప్రధానాలయ ప్రాంగణంలో 15 లొకేషన్లకు సంబంధించిన క్యూఆర్‌‌‌‌ కోడ్‌‌‌‌లను ఏర్పాటు చేశారు. భక్తులు తమ ఫోన్‌‌‌‌ ద్వారా క్యూఆర్‌‌‌‌ కోడ్‌‌‌‌ను స్కాన్‌‌‌‌ చేసిన వెంటనే ఆలయ సమాచారంతో పాటు భక్తులు చేరుకోవాల్సిన ప్రదేశానికి సంబంధించిన రూట్ మ్యాప్‌‌‌‌ కనిపించేలా రూపొందించారు.