
న్యూఢిల్లీ : దేశాన్ని విజయ శిఖరాలకు చేర్చేందుకు.. గత కాలపు సంకుచిత ఆలోచనలను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం ఢిల్లీలో తొలి సారిగా నిర్వహించిన ‘వీర్ బల్ దివస్’ కార్యక్రమంలో గురు గోవింద్ సింగ్ కొడుకులు జొరావర్ సింగ్, ఫతే సింగ్‌లకు ప్రధాని నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ మత విశ్వాసాన్ని కాపాడుకునే పోరాటంలో ప్రాణాలొదిలిన జొరావర్ సింగ్, ఫతే సింగ్ త్యాగాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ‘‘ఒకవైపు టెర్రరిజం.. మరోవైపు ఆధ్యాత్మికం. ఒకవైపు మత హింస.. మరోవైపు ఉదారవాదం. ఒకవైపు లక్షల మందితో కూడిన సైన్యం.. మరోవైపు వీరులైన షాహిబ్‌జాదే (గురు గోవింద్ కొడుకులు)లు ఉన్నారు.
గురుగోవింద్ సింగ్ పిల్లలను మతం మార్పించాలని ఔరంగజేబు, అతడి అనుచరులు భావించారు. ఔరంగజేబు టెర్రర్ చర్యలకు వ్యతిరేకంగా, ఇండియాను మార్చాలన్న ప్రణాళికలకు వ్యతిరేకంగా గురు గోవింద్ ఎలా శిఖరంలా అడ్డునిలిచారో ఊహించుకోండి’’ అని అన్నారు. ‘‘చరిత్ర పేరుతో.. జనాల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగేలా ఏవేవో కథలు చెబుతున్నారు. అందుకే అమృత్ కాల్‌లో ముందుకు సాగాలి. భవిష్యత్‌లో ఇండియాను విజయ శిఖరాలకు తీసుకెళ్లాలి. గత కాలపు సంకుచిత దృక్పథాలను బ్రేక్ చేయాలి” అని సూచించారు. స్కూలు పిల్లలు ఆలపించిన ‘షాబాద్ కీర్తన్’ను విన్నారు. ఈ కార్యక్రమానికి పంజాబ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
తొలిసారిగా వీర్ బల్ దివస్
జనవరి 9న గురు గోవింద్ సింగ్ జయంతి. ఈ ఏడాది నుంచి డిసెంబర్ 26ను వీర్ బల్ దివస్‌ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.