
మార్స్ గ్రహంపై పరిశోధనల కోసం నాసా పంపిన ఇన్‌సైట్ ల్యాండర్ ఆ గ్రహం ఫొటోలు తీసి పంపిస్తోంది. అక్కడి వాతావరణ పరిస్థితులను బాగా అంచనా వేస్తోంది. కానీ ఆ గ్రహం ఉపరితలాన్ని తవ్వడానికి మాత్రం తడబడుతోంది. 16 అడుగులు తవ్వేలా డిజైన్ చేస్తే 8 నెలల్లో కేవలం 14 ఇంచులు మాత్రమే తవ్వగలిగింది. మార్స్ గ్రహం లోపలి నుంచి వేడి ఎలా బయటికి పోతోందో తెలుసుకోవడానికి మట్టి శాంపిల్‌ను పరిశీలించేలా ఇన్‌సైట్‌ను నాసా డిజైన్ చేసింది. ఎర్ర గ్రహం ఉపరితలాన్ని కాస్త తవ్వి మట్టిని తీసుకునేలా అంతా సెట్ చేసింది. హామర్‌ను, స్కూప్‌ను ప్రత్యేకంగా రెడీ చేయించింది. కానీ ఉపరితలాన్ని ఆ సుత్తి, పార తవ్వలేకపోయాయి. దీంతో అనుకున్న విధంగా సుత్తి ఎందుకు పని చేయట్లేదో నాసా తెలుసుకునే పనిలో పడింది. ల్యాండర్ దిగిన ప్రాంతం చాలా గట్టిగా ఉన్నట్టు గుర్తించింది. ఇన్‌సైట్‌లోని ‘మోల్’లోకి మట్టిని నింపితేనే మట్టిని పరిశీలించగలమని, కానీ ఇప్పడది అయ్యే పరిస్థితి లేదు కాబట్టి మోల్‌నే మట్టి దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని నాసా అంటోంది. మట్టిని ఈజీగా తీయడానికి రోబోటిక్ ఆర్మ్‌కు స్కూప్‌ను బిగించి వాడుతున్నారు. కొన్ని నెలలుగా ఈ పని చేస్తున్నా ఆ ఆర్మ్ పూర్తి స్థాయిలో పని చేయట్లేదు. అనుకున్నట్టుగా చేయి పని చేసి ఉంటే తమ పని ఈజీగా అయ్యేదని, కానీ అలా జరగడం లేదని నాసా చెప్పింది. ఇన్‌సైట్ ల్యాండర్ కోసం నాసా రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసింది. 7 నెలలు ప్రయాణించి 2018 నవంబర్‌లో గ్రహంపై దిగింది.